బెంగళూరులో తెలంగాణ ఉపాధ్యాయుల ప్రదర్శన
మంగపేట: దక్షిన భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బెంగళూరు జ్ఞానభారతి క్యాంపస్‌లోని ఆర్‌ఐఈఎస్‌టీ వేదికగా తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు మిన్నంటాయి. 2025–2026 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న 30 రోజుల సర్టిఫికెట్ ఇన్ ఇంగ్లిష్(సీఈఎల్‌టీ)శిక్షణలో భాగంగా గురువారం నిర్వహించిన రీజినల్ కాంట్రీబ్యూషనల్ కార్యక్రమంలో తెలంగాణ ఉపాధ్యాయులు తమ ప్రతిభను చాటారు. శిక్షణలో భాగంగా ఐదు రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులు తమ ప్రాంతీయ కళలను ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్రం తరఫున వివిధ జిల్లాల నుంచి హాజరైన ఉపాధ్యాయులు రాష్ట్ర సాంస్కృతిక చిహ్నమైన బతుకమ్మ, వీరనారి రాణిరుద్రమాదేవి ఏకపాత్రాభినయం, వనదేవతల పండుగ, సమ్మక్క–సారక్క జాతరపై నిర్వహించిన ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో సమ్మక్క–సారక్క పాత్రలో జిల్లాకు చెందిన మంగపేట మండంలోని తొండ్యాల లక్ష్మిపురం, ఎంపీపీఎస్ ఉపాధ్యాయులు ఎం.కావ్య, మంగపేట ఎంపీపీఎస్ పాఠశాల సెకండ్ గ్రేడ్ ఉపాధ్యారాలు ఆర్. వందన ప్రత్యేక ఆకర్షణగా నిలిచి తన సత్తా చాటారు. ఉపాధ్యాయుల ప్రదర్శనను డైరెక్టర్ సిప్రయన్ మంథారో, తెలంగాణ ఇన్‌చార్జ్ రవినారాయణ, డైరెక్టర్ హిలేష్‌సిభగత్ ప్రత్యేకంగా అభినందించారు. ఇంగ్లిష్ బోధనలో శిక్షణ పొందుతూనే తమ ప్రాంతీయ అస్తిత్వాన్ని చాటిన ఉపాధ్యాయులను అభినందించారు.


