పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందజేస్తున్న మంత్రి సీతక్క
సర్పంచ్‌ను సన్మానిస్తున్న మంత్రులు సీతక్క, పొంగులేటి
ఏటూరునాగారం: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతామని రాష్ట్ర పంచాయతీరాజ్, సీ్త్ర, శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని ఎస్‌ఎల్‌ఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో కలెక్టర్ దివాకరతో కలిసి కొండాయి గ్రామానికి చెందిన 90మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉంటే ఇంటి నిర్మాణానికి తక్షణమే లక్ష రూపాయల రుణం అందుతుందని వివరించారు. అలాగే కొండాయి గ్రామానికి వెళ్లే దారిలోని జంపన్నవాగుపై హైలెవల్ బ్రిడ్జిని రూ.16 కోట్లతో మంజూరు చేయించి నిర్మాణం పనులు చేపట్టామన్నారు. కొండాయి గ్రామం జంపన్నవాగు పరీవాహక ప్రాంతంలో ఉన్నందున మంజూరైన ఇళ్లను సురక్షిత ప్రాంతంలో నిర్మించుకోవాలని లబ్ధిదారులకు మంత్రి సీతక్క సూచించారు. పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన 38 చెక్కులను మంత్రి అందజేశారు. అలాగే నూతనంగా ఏర్పడిన ఆత్మకమిటీతో మంత్రి సీతక్క ప్రమాణ స్వీకారం చేయించారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) కమిటీ పారదర్శంగా పనిచేయాలని సూచించారు. అనంతరం చైర్మన్, డైరెక్టర్‌లను మంత్రి సన్మానించారు. అనంతరం ఏటూరునాగారం పట్టణ కేంద్రంలో సుమారు కోటి రూపాయలతో చేపట్టిన ఆధునిక కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశంచారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, డీపీఓ వెంకయ్య, హౌసింగ్ పీడీ సూర్యనారాయణ, ఎంపీడీఓ శ్రీనివాస్, రవాణా శాఖ స్టేట్ డైరెక్టర్ వసంతశ్రీనివాస్, నాయకులు ఇర్సవడ్ల వెంకన్న, వావిలాల ఎల్లయ్య, ఎండీ అప్సర్‌పాషా, గౌస్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
నూతన సర్పంచ్‌లకు సన్మానం
వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయం ఆవరణలో ఆదివారం నూతనంగా ఎన్నికై న కాంగ్రెస్ సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాలెంవాగు ప్రాజెక్టు మంజూరు చేశారని తెలిపారు. ఆ ప్రాజెక్టు అభివృద్ధికి గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు కాల్వల మరమ్మతులకు నిధులు మంజూరు చేసి 15వేల ఎకరాలకు సాగునీరు అందించేలా కృషి చేశామని వెల్లడించారు. వాజేడు మండల పరిధిలోని పూసూరు బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం కొత్తగా ఎన్నికై న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యె తెల్లం వెంకట్రావ్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీను, నాయకులు చిడెం మోహనరావు, మన్నెం సునీల్ పాల్గొన్నారు.
కొండాయి బ్రిడ్జి పనులు త్వరలోనే పూర్తి
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు


