విద్యార్థులు ప్రణాళికతో చదవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ప్రణాళికతో చదవాలి

Mar 3 2026 7:33 AM | Updated on Mar 3 2026 7:33 AM

విద్యార్థులు ప్రణాళికతో చదవాలి

ములుగు: పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రణాళికతో చదవాలని కలెక్టర్‌ దివాకర అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనపై విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రతిభను విశ్లేషించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా గణితం, సైన్స్‌, ఇంగ్లిష్‌ వంటి ప్రధాన సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు సాధిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో రోజువారీగా, వారాంత మోడల్‌ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులను సన్నద్ధం చేయాలని తెలిపారు. పరీక్షలు అంటే భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా రాసేలా ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ధైర్యం నింపాలని సూచించారు. విద్యార్థుల హాజరు, అభ్యసన పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. టెన్త్‌ ఫలితాల్లో జిల్లాను ముందంజలో నిలిపేందుకు సమష్టిగా పాటుపడాలని సూచించారు. అనంతరం పదోతరగతి విద్యార్థులకు పలు సూచనలు చేసి ఆల్‌ ది బెస్ట్‌ తెలిపి విజయపథ సందేశ లేఖలను అందజేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, డీఈఓ సిద్ధార్థరెడ్డి, మండల అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి

ఈ నెల 14నుంచి జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్‌ జీ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి వచ్చే అధికారులకు సైతం సెల్‌ఫోన్‌ అనుమతి లేదన్నారు. పోలీస్‌ స్టేషన్‌ నుంచి ప్రశ్నాపత్రం పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లేటప్పుడు, పరీక్ష అనంతరం సమాధాన పత్రాలను పోస్టాఫీస్‌లో డిపాజిట్‌ చేసే సమయంలో తప్పకుండా పోలీస్‌ సిబ్బంది సమక్షంలోనే జరగాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, పరీక్షల నిర్వహణ సమయంలో జిరాక్స్‌ సెంటర్లు మూసివేయాలన్నారు. పరీక్ష సమయంలో తహసీల్దార్లు పరీక్ష కేంద్రాన్ని సందర్శిస్తారని డీటీ స్థాయి అధికారులు సిట్టింగ్‌ స్క్వాడ్‌గా ఉంటారని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏఎన్‌ఎంతో పాటుగా మెడికల్‌ కిట్‌, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్షలకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు సరిపడా బస్సులు విధిగా సమయానుగుణంగా నడపాలని అదనపు కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ సిద్ధార్థ రెడ్డి, డీపీఓ వెంకయ్య, వివిధ శాఖల అధికారులతో పాటు ఏసీజీఈ వినోద్‌ కుమార్‌, కోఆర్డినేటర్లు రాజు, శ్యాంసుందర్‌ రెడ్డి పాల్గొన్నారు.

కలెక్టర్‌ టీఎస్‌.దివాకర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement