ఏటూరునాగారం: మండల పరిధిలోని ముళ్లకట్ట బ్రిడ్జి నుంచి కొంత మంది రాత్రి సమయంలో ఇసుకను ఎలాంటి అనుమతి లేకుండా లారీల్లో తరలిస్తున్నట్లు సమాచారం. ఇసుకను ముందుగా ట్రాక్టర్ల ద్వారా లోడ్ చేసుకొని ఒక రహస్య ప్రదేశంలో నిల్వ చేసి రాత్రి సమయాల్లో టిప్పర్లు, లారీల్లో వరంగల్‌కు తరలిస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ సమాచారం రెవెన్యూ, టీఎస్‌ఎండీసీ అధికారులకు తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ముళ్లకట్ట బ్రిడ్జికి సమీపంలో ఎలాంటి ఇసుక తవ్వకాలు జరపవద్దని గతంలో 163 జాతీయ రహదారి అథారిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇసుక తవ్వకాల వల్ల బ్రిడ్జికి ప్రమాదం ఉందని ముందుగానే హెచ్చరించారు. కానీ కొంత మంది డబ్బుల లాభాపేక్ష కోసం ఇసుకను తవ్వుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై తహసీల్దార్ జగదీశ్‌ను వివరణ కోరగా ముళ్లకట్ట వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో రాత్రి సమయాల్లో పట్టుకునేందుకు ప్రయత్నించగా ట్రాక్టర్లు దొరకలేదు. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకొని ఇసుక అక్రమ రవాణాదారులపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని వివరించారు.
అనుమతి లేకుండానే
ముళ్లకట్ట బ్రిడ్జి నుంచి రాత్రివేళల్లో రవాణా


