గిరిజనుల్లో వెలుగులు
నింపేందుకే కంటైనర్ స్కూల్
ములుగురూరల్: గ్రామ పంచాయతీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని ఇంచర్ల ఎంఆర్ గార్డెన్‌లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంపై జిల్లాలోని సర్పంచ్‌లు, కౌన్సిలర్లకు కలెక్టర్ దివాకర ఆధ్వర్యంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవచేయాలన్నారు. గ్రామసభలు నిర్వహించి పంచాయతీ నిధులను ఖర్చు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు రూ. 600కోట్లను మంజూరు చేసిందని మరో రూ.1200 కోట్లు మంజూరు చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పంచాయతీలకు ఒక వెయ్యి 3కోట్ల రూపాయలను కేటాయించిందని వెల్లడించారు. గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు రూ.50 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. శిక్షణ తర్వాత సర్పంచ్‌లు, కౌన్సిలర్లు తూచ తప్పకుండా సూచనలు పాటించాలన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లది కీలక పాత్ర అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 15 మంది ప్రత్యేక వైద్య నిపుణులు వైద్యసేవలు అందిస్తున్నారని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. దివ్యాంగులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ధ్రువీకరణ పత్రం స్థానంలో యూడీఐడీకార్డు ప్రవేశపెట్టిందని వివరించారు. యూడీఐడీకార్డు కోసం మీసేవ కేంద్రాల్లో స్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, గ్రంథాల య సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ చంద్రకళ, ఆర్డీఓ వెంకటేశ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఏటూరునాగారం: ఏజెన్సీలోని గిరిజన విద్యార్థుల్లో వెలుగులు నింపేందుకు అడవిలో కంటైనర్ స్కూల్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. మండల కేంద్రంలోని అల్లంవారిఘణపురం పంచాయతీ పరిధిలోని గుర్రాలబావిలో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ వారి సహకారంతో ఈ కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలను కలెక్టర్ దివాకర, ఎస్పీ రాంనాథ్ కేకన్‌లతో కలిసి మంత్రి గురువారం ప్రారంభించి మాట్లాడారు. అవకాశాలు లేని చోట కొత్త వనరులను సృష్టించడమే లక్ష్యమన్నారు. పేదలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని వివరించారు. కంటైనర్ పాఠశాలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు, బాత్‌రూమ్‌లను కూడా నిర్మించినట్లు వివరించారు. అటవీప్రాంతాల్లో ఉన్న గిరిజనులను విద్యావంతులు చేసేందుకు ఈ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని వెల్లడించారు. అడవిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు అటవీశాఖ అనుమతి ఇవ్వనందున ఇలాంటి పాఠశాలను ఏర్పాటు చేసుకొని విద్యను అందించాల్సి వస్తుందని వివరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై గిరిజనులు సీతక్కకు వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, ఆత్మ చైర్మన్ కర్ల అరుణ, రొయ్యూర్ సర్పంచ్ కావిరి అర్జున్, అల్లంవారిఘనపురం సర్పంచ్ మహాలక్ష్మీ, రామన్నగూడెం సర్పంచ్ నవీన్, నాయకులు ఇర్సవడ్ల వెంకన్న, గుడ్ల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ
మంత్రి సీతక్క


