9.12 ఎకరాల్లో
ఆయిల్‌పామ్ మొక్కల పెంపకం
మొక్కలకు రక్షణ కరువు
ఏటూరునాగారం: ఏజెన్సీలోని రైతులకు ఆయిల్‌పామ్ మొక్కల పెంపకం, వచ్చే ఆదాయం, ఉపయోగాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మోడల్ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. ఐటీడీఏ హర్టికల్చర్ ద్వారా 3 మే 2023న 9.12 ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటేందుకు అప్పటి పీఓ అంకిత్, ఐటీడీఏ ప్రాజెక్టు హర్టికల్చర్ అధికారి రమణ ఆధ్వర్యంలో మొక్కల సంరక్షణకు కలెక్టర్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి రూ.24 లక్షలు మంజూరు చేశారు. మొక్కలు నాటించారు. నీరు పట్టేందుకు సైతం డ్రిప్, మోటార్లను అమర్చారు. కానీ నాటి నుంచి నేటి వరకు ఆ మొక్కల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఆయిల్‌పామ్ తోట పెంపకం పేరుతో నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేసి రూ.24 లక్షలు డ్రా చేయడం గమనార్హం. మొక్కల పెంపకంపై పర్యవేక్షణ కొరవడడంతో గడ్డి, పిచ్చి మొక్కులు పెరగడంతో పాటు ఆయిల్‌పామ్ మొక్కలు ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ ప్రాజెక్టు పూర్తైందని అధికారులు, సిబ్బంది కలిసి విందులు కూడా చేసుకోవడం గమనార్హం.
ఎండిపోతున్నా పట్టించుకోని అధికారులు
రూ.24 లక్షల నిధులు వృథా
ఐటీడీఏ ప్రాజెక్టు హర్టికల్చర్ అధికారి రమణ మోడల్ ప్లాంటేషన్‌కు శ్రీకారం చుట్టారు. ఆయన బదిలీ కావడంతో పాటు ఆశాఖకు సంబంధించిన అధికారుల పోస్టులు స్థానికంగా ఖాళీగా ఉండడంతో ప్లాంటేషన్ గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. ఉద్యానశాఖకు సంబంధించిన అధికారులు ఉన్నా పట్టించుకోకపోవడం గమనార్హం. ఆయిల్‌పామ్ మొక్కలకు నీటి సౌకర్యం, కంచె సైతం లేకపోవడంతో పశువులు, మేకలు మేస్తుండడంతో ఆయిల్‌పామ్ మొక్కలు ఎండితున్నాయి. ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన మోడల్ ప్లాంటేషన్ ప్రాజెక్టుపై ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


