గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
● రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
మంగపేట : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని వాడగూడెం, వాగొడ్డుగూడెం, రామచంద్రునిపేట, బ్రాహ్మణపల్లితో పాటు తదితర గ్రామాల్లో శనివారం రాత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా వాగొడ్డుగూడెం నుంచి పూరేడుపల్లి వరకు రూ.4 కోట్లతో చేపట్టనున్న 5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం రామచంద్రునిపేట(సంఘంపల్లి), బ్రాహ్మణపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందుగా మంగపేట ఎఫ్‌ఎస్‌సిఎస్ చైర్మన్ తోట రమేశ్ ఇంటివద్ధ ఆయన సమక్షంలో తిమ్మంపేట, చుంచుపల్లి, వాడగూడెం, రమణక్కపేట, మంగపేట తదితర గ్రామాలకు చెందిన సుమారు 50 మంది బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికి సీతక్క పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పార్టీలో ప్రతిఒక్కరూ ఐకమత్యంగా ఉండాలన్నారు. జిల్లాలో మంగపేట పెద్ద మండలం అయినప్పటికీ 15 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు లేకపోవడంతో అభివృద్ధి కుంటు పడిందన్నారు. ప్రతిఒక్కరూ మండల అభివృద్ధికి పనిచేయాలని, అభివృద్ధికి తాను పూర్తిగా సహకరిస్తానని వివరించారు. వచ్చే నెలలో ఇందిరమ్మ రెండోవిడత ఇళ్ల మంజూరులో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో సీసీరోడ్లు నిర్మాణం పనులు జరిగాయని లేని గ్రామాల్లో సైతం సీసీ రోడ్ల నిర్మాణం పనులు చేపడుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉపాధిహామీ మండలి(టీఎస్‌ఈజీసీ)సభ్యుడు గుమ్మడి సోమయ్య, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, జిల్లా ప్రచార కార్యదర్శి నాయకులు పూజారి సురేందర్, అధికార ప్రతినిధి యానయ్య, మండల మహిళా అధ్యక్షురాలు నిర్మల, మండల నాయకులు నర్సయ్యగౌడ్, శేషగిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


