హేమాచలక్షేత్రంపై నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

హేమాచలక్షేత్రంపై నిర్లక్ష్యం

Feb 23 2026 7:00 AM | Updated on Feb 23 2026 7:00 AM

హేమాచలక్షేత్రంపై నిర్లక్ష్యం

హేమాచలక్షేత్రంపై నిర్లక్ష్యం

వివాదాలకు నిలయం పీడిస్తున్న రాజకీయ గ్రహణం

ఆలయ అభివృద్ధిని

పట్టించుకోని దేవాదాయశాఖ

మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధిపై దేవాదాయ ధర్మాదాయశాఖ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని భక్తులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం వందల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఏ మాత్రం పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తుంది. ఈ దేవాలయం 35 ఏళ్ల క్రితం నుంచే దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉంది. ప్రతి ఏటా కోటి రూపాయలకు పైగా ఆదాయం వస్తుండడంతో 2018లో దేవస్థానానికి 6 ఏ టెంపుల్‌గా గుర్తింపు పొందింది. ఆలయ నిర్వహణను పర్యవేక్షించేందుకు గ్రేడ్‌వన్‌ స్థాయి అధికారిని నియమించాల్సి ఉంది. అయినప్పటికీ ఆలయంపై దేవాదా యశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో 2016 నుంచి ఇప్పటి వరకు ఇన్‌చార్జ్‌ కార్యనిర్వహణ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతోంది.

ఆలయంలో కొందరు సిబ్బంది మధ్య అంతర్యుద్ధం సోషల్‌ మీడియా వేదికగా చేసుకుని వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఆలయ ప్రధాన అర్చకుడి పోస్టు భర్తీలో భాగంగా కొందరు పూజారుల మధ్య విబేధాలు బయటపడిన పలు సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి. అదే విధంగా కొందరు సిబ్బంది ఒకరంటే ఒకరికి గిట్టక రెండు వర్గాలుగా విడిపోయారు. పలు విషయాలపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల సిబ్బందిలో గణేశ్‌ అనే వ్యక్తిని విధుల నుంచి తప్పించి పక్కన పెట్టారు. దీంతో తాను మేడారం మహాజాతర డ్యూటీలో ఉండగా తానంటే గిట్టనివారు ఆకాశ రామన్న పేరిట ఉత్తరం రాసి తనపై కుట్రచేశారని అసహనం వ్యక్తం చేస్తూ వాట్సాప్‌ గ్రూపులో పోస్టుచేశారు. పూజారులు, సిబ్బంది విషయంలో కొందరు రాజకీయ నేతలు జోక్యం చేసుకోవడంతో పవిత్ర పుణ్యక్షేత్రంలో పూజలు నిర్వహించాల్సిన పూజారులు, విధులు నిర్వహించాల్సిన సిబ్బంది మధ్య ఏమి జరుగుతుందోననే ఆసక్తికర చర్చ సాగుతోంది. విషయంపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులు స్పందించి గుట్టపై రాజకీయ వివాదాలకు తావులేకుండా భక్తులకు సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

హేమాచలక్షేత్రాన్ని 2016 నుంచి రాజకీయ గ్రహణం పట్టి పీడిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్వం నుంచి స్థానికులకు ఒకరికి ఆలయ చైర్మన్‌గా మరో 13 మంది సభ్యులుగా 2016 వరకు ఆలయ పాలకమండలి కొనసాగింది. ఆలయ చైర్మన్‌ పదవి దక్కించుకునే ప్రయత్నంలో కొందరు రాజకీయ నాయకుల స్వార్ధం ఆలయ అభివృద్ధికి శాపంగా తయారైంది. ఏజెన్సీ ప్రాంత పరిధిలో ఉన్న ఆలయానికి పాలక మండలిలో చైర్మన్‌, సభ్యులుగా తమకు అవకాశం కల్పించాలని స్థానిక ఆదివాసీ గిరిజనులు హైకోర్టును ఆశ్రయించారు. పాలకమండలి ఏర్పాటుకు హైకోర్టు స్టే ఇవ్వడంతో 2017 ఆలయ పాలక మండలి ఏర్పాటు నిలిచిపోయింది. దీంతో ఆలయ ప్రాంగణంలో ప్రసాదం, కొబ్బరికాయల విక్రయాలు, కొబ్బరి ముక్కలు, పుట్టు వెంట్రుకలు, ఆలయ ప్రాంగణంలో షాపుల నిర్వహణకు బహిరంగ వేలం పాటలు నిలిచిపోవడంతో ఆదాయానికి గండి పడుతుంది. నిత్యం సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు.

సౌకర్యాల కల్పనపై దృష్టి సారించని అధికారులు

పదేళ్లుగా ఏర్పాటు చేయని

పాలకమండలి

సోషల్‌ మీడియా వేదికగా సిబ్బంది

అంతర్యుద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement