మంగపేట: మండల పరిధిలోని లక్ష్మీనర్సాపురంలో గల నాగులమ్మ ఆలయంలో నాగులమ్మ, సడాలమ్మ అమ్మవార్లు గద్దెలపై బుధవారం కొలువుదీరారు. జాతర రెండో రోజు బుధవారం నాగులమ్మ ఆలయ ప్రధాన పూజారి బాడిష రామకృష్ణ ఆధ్వర్యంలో కన్నాయిగూడెం సమీపంలో సడాలమ్మ, నాగులమ్మ అమ్మవార్లకు ఎదుర్కోలు మహోత్సవాన్ని సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు. నాగులమ్మ పూజారి బాడిష నాగరమేశ్, గిరిజన పూజారులు, వడ్డెలు ఆలయ సమీపంలోని గండొర్రెగుట్ట వద్ద నాగులమ్మ, ఝెర్రట్టలగుట్ట వద్ద సడాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి డోలి వాయిద్యాల నడుమ తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. ఈ క్రమంలో ఆయా గ్రామాల ప్రజలు నృత్యాలు చేస్తూ భారీగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం పూజారులు, వడ్డెలు అమ్మవార్లను గద్దైపె ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని పెరకలకుంట లక్ష్మీదేవర ఆలయం నుంచి ఆలయానికి వచ్చిన లక్ష్మీదేవరకు ఆలయ పూజారులు, వడ్డెలు కంకణాలు కట్టి స్వాగతం పలికారు. రాత్రి సమయంలో అమ్మవార్లకు రమణక్కపేట సమీపంలోని పవిత్ర గోదావరిలో ఏడు చెలిమల నీటితో పాటు వివిధ దళాలతో పుణ్యస్నానాలు, అభిషేక పూజలు నిర్వహించారు. చుంచుపల్లి నుంచి అమ్మవారికి చెందిన అవిరేణి కుండలను ఆదివాసీ మహిళలు తీసుకొచ్చి ఆలయానికి సమర్పించారు. నేడు గురువారం గద్దెలపై కొలువైన అమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఇంకా భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ మేరకు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆలయ ప్రధాన పూజారి బా డిష రామకృష్ణ, నాగరమేశ్ ఆధ్వర్యంలో ఆలయంలో తగిన వసతులు కల్పించారు. ఈ కార్యక్రమంలో పూజారులు సోడి సత్యం, కుర్సం పుల్లయ్య, కట్టం సమ్మక్క, చౌళం భవాని, మడకం సుప్రజ, పొలిశెట్టి స్వరూప, వడ్డెలు కొర్స శ్రీకాంత్, శివ, చిన్నాబ్బాయి, కారం రాజేశ్, కుల పెద్ధలు విష్ణుమూర్తి, మడకం రాజేశ్వర్‌రావు, చౌళం వెంకటేశ్వర్లు, కొమరం మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
నాగులమ్మ, సడాలమ్మకు పూజలు
భారీగా తరలివచ్చిన భక్తజనం


