● రాష్ట్ర పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క
ములుగు: గత రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు రూ.36వేల కోట్ల రుణాలను అందించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. జిల్లాలోని 585 మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.52.50 కోట్ల రుణాల చెక్కులను అందజేశామని తెలిపారు. రూ.36 వేల కోట్ల రుణాలకు రూ.1,121 కోట్ల వడ్డీని మాఫీ చేసినట్లు వివరించారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి పలు రకాల వ్యాపారాలను చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని వెల్లడించారు. ఒక్కో భవనానికి ఉపాధి హామీ పథకం కింద రూ. 10 లక్షల నిధులతో నిర్మాణ పనులు మొదలు పెడుతున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, అధికారులు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు. అనంతరం ములుగు ప్రభుత్వ డీగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్‌మేళాలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అదేవిధంగా కలెక్టరేట్‌లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై, గోదావరి పుష్కరాలపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అలాగే మున్సిపాలిటీలోని 5వ వార్డులో చేపట్టగా మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ములుగు పట్టణాభివృద్ధికి రూ.15 కోట్లతో ఇప్పటికే టెండర్లు జరిగాయని వెల్లడించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణం చేపట్టాలని సూచించారు. అనంతరం ఇంచర్ల, దేవగిరిపట్నం, కన్నాయిగూడెం గ్రామాల్లో రూ.10 లక్షలతో నిర్మించనున్న ఒక్కొక్క మహిళా సమాఖ్య భవనానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. దేవగిరిపట్నంలో ఇందిరమ్మ పథకం కింద చింతలపూడి వినోద ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోగా మంత్రి ప్రారంభించారు. అనంతరం వెంకటాపురం(ఎం) మండల కేంద్రంలో వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమానికి హాజరై పలు సూచనలు చేశారు. లక్ష్మీదేవిపేటలో రూ.10 లక్షలతో నిర్మించనున్న మహిళ సమాఖ్య భవన నిర్మాణ పనులకు, ఎల్లారెడ్డిపల్లెలో రూ.17.50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయినేజీ, జీపీ భవనం పనులను సీతక్క ప్రారంభించారు.


