నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు
● కౌన్సిలర్ల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి
● వీఐపీ రిపోర్టర్, ములుగు మున్సిపల్
చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ
ములుగు: ఎండనక, వాననక నిరంతరం శ్రమిస్తున్నారు.. తెల్లవారుజాము నుంచి పొద్దుగూకే వరకు పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా వీధులు, డ్రెయినేజీలను మున్సిపల్ కార్మికులు శుభ్రపరుస్తున్నారు.. చెత్తాచెదారాన్ని తొలగిస్తూ సమాజానికి సేవ చేస్తున్నారు. అరకొర వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సరైన రక్షణ పరికరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.. నేడు (ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ములుగు మున్సిపల్ తొలి చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన చింతనిప్పుల చంద్రకళ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం చూపేందుకు శనివారం సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా మారారు. పారిశుద్ధ్య సిబ్బంది సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం 4వ వార్డులో పర్యటించి కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
చంద్రకళ: ఎలా ఉన్నారు.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?
స్వరూప: ప్రభుత్వం అందించే రూ.9,500 వేతనం కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు వేతనం పెంచి ఆదుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్నాం. సెలవురోజుల్లో కూడా పనులు చేస్తూ వీధులు శుభ్రపరుస్తున్నాం.
చంద్రకళ: సొంత ఇళ్లు అందరికీ ఉన్నాయా?
పూలమ్మ: ఇరవై ఏళ్లకు పైగా కార్మికురాలిగా పనిచేస్తున్నా. ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు. కిరాయికి ఉంటూ ఇబ్బందులు పడుతున్నాం. ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. కార్మికులందరికీ ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించి ఇస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
చంద్రకళ: ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా?
విజయ: డ్రెయినేజీలు శుభ్రం చేయడం, చెత్తను తరలించే క్రమంలో దుర్వాసన వస్తుంది. బ్యాక్టీరియా వల్ల ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కార్మికులకు గ్లౌస్, మాస్క్‌లు, బూట్లు, భద్రత పరికరాలు పంపిణీ చేయాలి. పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య బీమాతో పాటు శాశ్వత ఉద్యోగ కల్పనతో పాటు వేతనాలు పెంచాలి.
చంద్రకళ: తాగునీటి సరఫరా ఎలా ఉంది?
రాజక్క: కాలనీలో చేతిపంపులు పనిచేయడం లేదు. తాగునీటి సమస్య ఉంది. ఎండాకాలం ప్రారంభమైనందున తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
చంద్రకళ:అందరికీ పింఛన్లు వస్తున్నాయా?
మల్లిక: కాలనీలో చాలామందికి పింఛన్లు రావడం లేదు. పింఛన్ కోసం చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటివరకు రాలేదు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వృద్ధాప్య, వింతంతువు, వికలాంగులకు పింఛన్లు అందించాలి.
చంద్రకళ:కాలనీలో ఇంకా ఏమైనా సమస్యలు నెలకొన్నాయా?
రమ: కోతుల బెడద తీవ్రంగా ఉంది. కాలనీల్లో విచ్చలవిడిగా తిరుగుతూ గాయపరుస్తున్నాయి. వాటిని పట్టుకెళ్లి అటవీప్రాంతంలో వదిలిపెట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.


