ఏటూరునాగారం: మండలకేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఏటీడీఏ ఏపీఓ వసంతరావు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆదేశాల మేరకు సెక్టార్ అధికారుల ద్వారా గిరిజన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మొత్తం 12 వినతులు వచ్చాయి. వెంకటాపురం (ఎం), తాడ్వాయి, వాజేడు, మంగపేట, బయ్యారం, తదితర మండలాలకు చెందిన గిరిజనులు వినతులు అందించారు.
● మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం ముందు ఉన్న ఖాళీ స్థలంలో అర్హులైన నాయకపోడు గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కాపుల సమ్మయ్య, రాజు, సారయ్య విన్నవించారు.
● వాజేడు మండలం నాగారం గ్రామానికి చెందిన 19 మంది గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు గిరి సౌరవికాసం కింద బోర్లు, మోటార్లు ఇవ్వాలని స్థానిక సర్పంచ్ బోదెబోయిన స్వరూప విన్నవించారు.
● ఏటూరునాగారం మండలం రొయ్యూర్ గ్రామంలో 1వ వార్డులో మట్టిరోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని, మంగపేట మండలం కమలాపురంలో బోరు నిర్మించుకోవడానికి అటవీశాఖ నుంచి అనుమతి ఇప్పించాలని స్థానికుడు దామోదర్ కోరారు.
ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. రైతు భరోసా వస్తుంది. పీఎం కిసాన్ రావడం లేదు. అగ్రికల్చర్, ఐటీడీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. సమస్యను పరిష్కరించి ఆదుకోవాలి.
– దబ్బట్ల సుదర్శన్, రైతు, ఏటూరునాగారం


