సాంకేతిక విజ్ఞానాన్ని పెంచుకోవాలి
● జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి
ములుగు: విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని పెంచుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం అధ్యక్షుడు శిరుప సతీష్‌కుమార్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు పాఠశాలల్లో వివిధ స్థాయిల్లో నిర్వహిస్తున్న అనేక పోటీ పరీక్షల్లో పాల్గొని విజేతలుగా నిలవాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో భాగంగా జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో స్టీల్‌ప్లేట్లను విద్యార్థులకు అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులందరూ ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా సైనన్స్ అధికారి అప్పని జయదేవ్ మాట్లాడుతూ సైన్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధం కలిగి ఉంటుందన్నారు. విద్యార్థులు అవగాహనతో చదివి జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్‌లో ప్రథమ స్థానంలో బండారుపల్లి ఆదర్శ పాఠశాల చెందిన శివ ప్రసాద్, ద్వితీయ స్థానంలో ఇదే పాఠశాలకు చెందిన హర్షితతో పాటు మంగపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన మహమ్మద్ ఆఫ్సియాలు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు నిర్వహకులు తెలిపారు. అనంతరం విజేతలకు సర్టిఫికెట్లు, సైన్స్ పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవరపు శ్రీధర్, కోశాధికారి బోదెబోయిన జయరాం, స్థానిక పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు రాజేందర్, ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


