హన్మకొండ: విద్యుత్ వ్యవస్థను రక్షించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ పకడ్బందీ చర్యలు చేపట్టింది. వర్షాకాలం, అకాల వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులు రావడం సహజం. వీటితో విద్యుత్ సబ్‌స్టేషన్‌లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లకు, విద్యుత్ లైన్లకు ముప్పు వాటిల్లుతోంది. తద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలో విద్యుత్ వ్యవస్థలను రక్షించడంతోపాటు వినియోగదారులకు అంతరాయాలు లేకుండా అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతి సబ్‌స్టేషన్‌లో నిర్మాణ సమయంలోనే లైటర్నింగ్ అరెస్టర్‌లు (పిడుగుల నిరోధకాలు) ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా పొడవాటి లైన్లను గుర్తించి ఈ లైన్లలో స్తంభాలకు లైటర్నింగ్ అరెస్టర్‌లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లకు, విద్యుత్ లైన్లకు రక్షణ ఉంటుంది.
టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో పొడవాటి విద్యుత్ లైన్లలో మొత్తం 2,337 లైటర్నింగ్ అరెస్టర్‌లు ఏర్పాటు చేశారు. హనుమకొండ సర్కిల్‌లో 95, వరంగల్ సర్కిల్‌లో 25, జనగామలో 107, భూపాలపల్లి సర్కిల్‌లో 52, మహబూబాబాద్ సర్కిల్‌లో 38, ఖమ్మం సర్కిల్‌లో 248, భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్‌లో 182, కరీంనగర్ సర్కిల్‌లో 281, జగిత్యాలలో 161, పెద్దపల్లిలో 211, నిజామాబాద్‌లో 328, కామారెడ్డిలో 59, అదిలాబాద్‌లో 89, నిర్మల్‌లో 84, మంచిర్యాలలో 218, ఆసిఫాబాద్ సర్కిల్‌లో 159 లైటర్నింగ్ అరెస్టర్‌లు ఏర్పాటు చేశారు.
ఎలా పనిచేస్తుందంటే..
లైట్నింగ్ అరెస్టర్ అనేది మెరుపు, పిడుగు వల్ల ఉత్పన్నమయ్యే అధిక ఓల్టేజీని భూమిలోకి సురక్షితంగా మళ్లించే రక్షణ పరికరం. దీని ద్వారా ట్రాన్స్‌ఫార్మర్‌లు, సబ్‌స్టేషన్‌లు, స్విచ్‌గేర్ పరికరాలు, ఇతర విద్యుత్ పరికరాలతో పాటు యంత్రాంగం సురక్షితంగా ఉండడం ద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గుతాయి. మెరుపు కారణంగా కలిగే బ్రేక్‌డౌన్లు తగ్గుతాయి. దీంతోపాటు పరికరాలు సురక్షితంగా ఉండడంతో నష్టం తగ్గుతుంది.
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం. విద్యుత్ వ్యవస్థ రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్రమంలోనే సుదూరంగా ఉండే విద్యుత్‌లైన్లలో లైటర్నింగ్ అరెస్టర్‌లు చేశాం. విని యోగదారులు కూడా వర్షాకాలంలో ఇంటి విద్యుత్ పరికరాలకు సర్జ్ ప్రొటెక్టర్లు వినియోగించాలి. మెరు పు సమయంలో అనవసరంగా విద్యుత్ పరికరాల ను తాకకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
–టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
కర్నాటి వరుణ్ రెడ్డి
ఉరుములు, మెరుపులనుంచి
రక్షణకు నిరోధకాల బిగింపు
టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 2,337 లైటర్నింగ్ అరెస్టర్‌ల ఏర్పాటు


