మంగపేట: మండల పరిధిలోని వాగొడ్డుగూడెం పంచాయతీ పరిధి లక్ష్మీనర్సాపురం నాగులమ్మ ఆలయంలో మండమెలిగె పండుగ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. జాతర కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రధాన పూజారి, నాగులమ్మ ఉపాసకుడు (ఆలయ ట్రస్టి) బాడిష రామకృష్ణ స్వామి ఉదయం ఆలయాన్ని శుద్ధిచేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం ఎదుట తోరణ స్తంభాలను నిలిపారు. పసుపు, కుంకుమలతో అలంకరించి గడపను ప్రతిష్ఠించారు. మండమెలిగె పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి డోలి వాయిద్యాల నడుమ వడ్డెలు, గిరిజన పూజారులు, ఆదివాసీ ఉపాధ్యాయ సంఘం నాయకులతో కలిసి ఆలయానికి చేరుకుని మామిడి తోరణాలతో అలంకరించారు. అనంతరం గోదావరి నదీ జలాలతో శుద్ధి చేసిన అమ్మవారి ఆభరణాలు, గజ్జెలు, అడారాల(కుండలు)తో అలంకరించి దూపంతో రహస్య పూజలు నిర్వహించారు. అలాగే పూజారులు, వడ్డెలు, కులపెద్దలు ఆలయ ప్రాంగణంలో ఉన్న ఘడికామరాజు, పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, ఎర్రమ్మ, పోతురాజు, నాగులమ్మ నాగులమ్మ గద్దెలను పవిత్ర గోదావరి నదీ జలాలతో అభిషేకించారు. అమ్మవారి ప్రతి రూపాలైన జెండా కర్రలతో డోలి వాయిద్యాలతో భక్తిశ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలోని ఆయా గద్ధెలపై ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. గద్దెలపై జెండాలను ప్రతిష్ఠించారు. నేడు మహాజాతర ఘట్టం ప్రారంభమవుతుందని ఆలయ ప్రధాన పూజారి రామకృష్ణ స్వామి తెలిపారు.
నేడు నాగులమ్మ, సడాలమ్మ రాక
నేడు గండొర్రెగుట్ట నుంచి నాగులమ్మ, యర్రెట్టలగుట్ట నుంచి వచ్చే సడాలమ్మ అమ్మవార్లు ఆలయంలో కొలువుదీరనున్నారు. అమ్మవార్లకు పవిత్ర గోదావరి జలాలతో పుణ్యస్నానం చేయించిన అనంతరం డోలు వాయిద్యాలు, మేళతాళాలతో ఆలయానికి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టించనున్నట్లు నాగులమ్మ పూజారి రమేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగులమ్మ పూజారి బాడిష నాగరమేష్, సోడి సత్యం, కుర్సం పుల్లయ్య, కట్టం సమ్మక్క, చౌళం భవాణి, మడకం సుప్రజ, పొలిశెట్టి స్వరూప, వడ్డెలు కొర్స శ్రీకాంత్, శివ, ఆదివాసీ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
ప్రారంభమైన నాగులమ్మ జాతర
గద్దెలపై జెండా కర్రల ప్రతిష్ఠాపన


