హేమాచల క్షేత్రం అభివృద్ధిపై మంత్రికి నివేదిక
మంగపేట: మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధిపై పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్కకు సోమవారం నివేదికను అందజేసినట్లు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి రెవెల్లి మహేశ్ తెలిపారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో సీతక్కను కలిసి ఆలయ పూజారులు ఆశీర్వచనం ఇచ్చారు. మకర సంక్రాంతి రోజున స్వామివారి వరపూజ మహోత్సవానికి ఆలయానికి వచ్చిన మంత్రి స్వామివారిని దర్శించుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ మేరకు ఏప్రిల్‌లో జరగనున్న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి ముందుగా ఆలయంలో భక్తుల సౌకర్యానికి చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను మంత్రికి వివరించి నివేదికను అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా 2027 జూన్‌లో జరుగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా మల్లూరులో పుష్కరఘాట్ నిర్మాణం చేపడితే దేవస్థానం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రికి వివరించినట్లు తెలిపారు. వీటిపై స్పందించిన మంత్రి త్వరలోనే హేమాచలక్షేత్రంలో చేపట్టాల్సిన పనులతో పాటు మల్లూరులో పుష్కరఘాట్ నిర్మాణానికి హామీ ఇచ్చారని పూజారులు వివరించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు ఈశ్వర్‌చంద్ రామానుజం దాస్, నాగరాజీవ్ శర్మ, రికార్డు అసిస్టెంట్ లక్ష్మినారాయణ ఉన్నారు.


