చట్టాలపై అవగాహన తప్పనిసరి
● లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్
వెంకటాపురం(ఎం): ప్రతిఒక్కరూ చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని రామాంజాపూర్‌లోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యాహక్కు, బాల కార్మికుల, ర్యాగింగ్, బాల్య వివాహాల చట్టాల గురించి మహేందర్ వివరించారు. ఉచిత న్యాయం పొందడంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోతు స్వామిదాస్, హెచ్‌ఎం గోదాదేవి, ఉపాధ్యాయులు సమ్మయ్య, రాధ తదితరులు పాల్గొన్నారు.
గందరగోళంగా భూ సర్వే
ములుగు రూరల్: భూ సర్వే విషయంలో రైతులను అధికారులు గందరగోళానికి గురిచేస్తున్నారని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. సర్వే అధికారులు భూమి హద్దులను నిర్ణయించే క్రమంలో ప్రతీసారి హద్దులు మారుతున్నాయని వివరించారు. అధికారులు ల్యాండ్ మాఫియా చేతిలో కీలుబొమ్మలుగా మారారని పేర్కొన్నారు. వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని లింగాపూర్ శివారులో జరుగుతున్న తతంగమే ఇందుకు నిదర్శనమని వెల్లడించారు. 30 ఏళ్లుగా సాగులో ఉన్న రైతుల భూముల హద్దులను చెరిపేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందించి సరిహద్దులు నిర్ణయించి సమస్యలు లేకుండా చూడాలని కోరారు.


