- ఆ దేశాధ్యక్షుడు గుస్తావో పెట్రోకు ట్రంప్ వార్నింగ్
- సైన్యంతో బదులిస్తామన్న కొలంబియా
వాషింగ్టన్: లాటిన్ అమెరికాలో దుమారం రేపేందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించుకున్నట్టు కన్పిస్తోంది. ‘తర్వాత నీ వంతే కావచ్చు, జాగ్రత్త!’ అని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోకు ట్రంప్ ఓ బూతు మాట ప్రయోగించి మరీ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘గుస్తావో పెట్రో విచ్చలవిడిగా కొకైన్ తయారు చేయిస్తున్నారు.
దాన్ని నేరుగా అమెరికాలోకి తరలిస్తున్నారు. కాబట్టి ఆయన కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అంతటితో ఆగలేదు. మెక్సికో, క్యూబా దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. అవి కూడా విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు తయారు చేస్తూ అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ‘‘ పలు నేరగాళ్ల ముఠాలకూ ఆ దేశాలు ఆశ్రయమిస్తున్నాయి. తీరు మార్చుకోకుంటే వాటికీ వెనిజువెలా గతే పడుతుంది’’ అంటూ అల్టిమేటమిచ్చారు.
అవసరమైతే ఆ దేశాల్లోని డ్రగ్ ల్యాబ్స్‌పై దాడులకు వెనుకడుగు వేయబోనని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఖండాల్లో తమ దేశ ఆధిపత్యాన్ని ఎవరూ వేలెత్తి చూపేందుకు కూడా వీల్లేకుండా చేస్తామన్నారు. ‘‘మా చుట్టూ మంచి మిత్రులుండాలి. స్థిరత్వం, శక్తియుక్తులుండాలి. వెనిజువెలాలో అమితమైన శక్తిసామర్థ్యాలున్నాయి. వాటిని కాపాడాల్సిన అవసరముంది. మా ప్రయోజనాలు తీరాలంటే అవి కావాలి’’ అంటూ కుండబద్దలు కొట్టారు.
వెనెజువెలాలో మా సైన్యం..
వెనిజువెలా చమురు కంపెనీలపై తమ నిషేధం ఇకపై కూడా కొనసాగుతుందని ట్రంప్ తెలిపారు. ‘‘వెనిజువెలాలో మా సైనిక మోహరింపులు కొనసాగుతాయి. అక్కడ మా డిమాండ్లు పూర్తిగా నెరవేరేదాకా, మేం పూర్తిగా సంతృప్తి చెందేదాకా అక్కణ్నుంచి వైదొలగేదే లేదు’’ అని స్పష్టం చేశారు.
సైన్యంతో మేం సిద్ధం: పెట్రో
ట్రంప్ బెదిరింపులపై కొలంబియా అధ్యక్షుడు పెట్రో తీవ్రంగా స్పందించారు. అమెరికా చర్యలను లాటిన్ అమెరికా సార్వభౌమత్వంపైనే దాడిగా ఆయన అభివర్ణించారు. ‘‘ఇది కచ్చితంగా మానవతా సంక్షోభానికి దారి తీయగల పరిణామం. ట్రంప్ తీరు చూసి మేమిప్పటికే అప్రమత్తమయ్యాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వెనిజువెలా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తున్నాం’’ అని ఆయన ప్రకటించారు. మదురోకు పెట్రో అత్యంత సన్నిహితుడు.

క్యూబా పని పడతాం
రూబియో సంకేతం
వెనిజువెలా తర్వాత ఇక క్యూబాయే తమ లక్ష్యం కావచ్చని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంకేతాలిచ్చారు. ‘నేనే గనక క్యూబా ప్రభుత్వంలో ఉంటే, ఆ దేశ రాజధాని హవానాలో నివసిస్తూ ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కొంత ఆందోళన చెంది తీరతా’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా మరో సార్వభౌమ దేశంపై సైనిక చర్యకు దిగనుందన్న అనుమా నాలు బలపడుతున్నాయి. మెక్సికోకు ట్రంప్ శనివారం హెచ్చరికలు జారీ చేయడం తెలిసిందే. ‘‘మెక్సికో విషయంలో కూడా ఏదో ఒకటి చేయాల్సిందే. అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బాం మంచి వ్యక్తే. కానీ దేశాన్ని ఆమె పాలించడం లేదు. డ్రగ్ ముఠాలే నడుపుతున్నాయి’’ అని ఆరోపించారు.


