రెండు రోజుల వ్యవధి.. ఇద్దరు మహానీయులు.. ఇద్దరూ రాజవంశాలకు చెందినవాళ్లే.. కన్నుమూసి ఓ యుగానికి తెరదించారు. హైదరాబాద్(తెలంగాణ)కు చెందిన రాజకుమారి ఇందిరాదేవి ధనరాజ్ గిర్, దర్భంగా(బీహార్) రాజవంశం చివరి మహారాణి కామసుందరి దేవి.. సేవలు, త్యాగం అనే విలువల్ని ప్రతిబింబిస్తుంది వీళ్లిద్దరి జీవితం. అధికారమనేది ప్రదర్శన కోసం కాదు.. బాధ్యత కోసం వినియోగించాలని ప్రేరణ ఇస్తుంది. ఇంతకీ దేశానికి వీళ్లు చేసిన సేవలు, త్యాగాలెంటో ఓసారి చూద్ధాం..
1932 అక్టోబర్ 22న జన్మించిన కామసుందరి దేవి.. దర్భంగా మహారాజా కామేశ్వర్ సింగ్ మూడో భార్య. 1962లో ఇండియా–చైనా యుద్ధ సమయంలో ఆమె చేతుల మీదుగా దర్భంగా రాజవంశం 600 కిలోల బంగారంను భారత ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చింది. ఈ చర్య దేశవ్యాప్తంగా దేశభక్తి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. మహారాజా మరణించిన 1962 తర్వాత ఆమె సాదాసీదా జీవితం గడుపుతూ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. విద్య, సామాజిక సేవ, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో మహారాణి కామసుందరి కీలక పాత్ర పోషించారు. కల్యాణి ఫౌండేషన్ ద్వారా విద్యా, సామాజిక కార్యక్రమాలకు మద్దతు ఇచ్చి.. మిథిలా ప్రాంతంలో సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడారు. మహారాణి కామసుందరి దేవి(93) జనవరి 12న బీహార్‌లోని దర్భంగా కల్యాణి నివాస్‌లో తుదిశ్వాస విడిచారు.

దేశభక్తి చరిత్ర
దర్భంగా రాజశంశానికి దేశభక్తి చరిత్ర ఉంది. మహాత్మా గాంధీ దక్షిణ ఆఫ్రికా నుండి తిరిగి వచ్చినప్పుడు స్వదేశీ ఉద్యమానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. గాంధీజీ లేఖ అందుకున్న వెంటనే ఆ సమయంలో మహారాజుగా ఉన్న లక్ష్మేశ్వర్ సింగ్ భారీ ఆర్థిక సాయం అందించడమే కాకుండా.. మీడియా మేనేజ్‌మెంట్ బాధ్యతలను కూడా చూసుకున్నారు. ఆ లేఖ నేటికీ భద్రంగా ఉంది. ఇక.. 1962 చైనా యుద్ధం సమయంలో దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు.. దేశ రక్షణ కోసం 15 మణుగుల బంగారం (సుమారు 600 కిలోలు) దానం చేశారు. అంతేకాదు తమ సొంత మూడు విమానాలను, 90 ఎకరాల విస్తీర్ణంలోని ఎయిర్‌పోర్టును ప్రభుత్వానికి అప్పగించారు. నేటి దర్భంగా ఎయిర్‌పోర్ట్ ఉంది ఆ భూమిలోనే ఉంది. అంతకు ముందు.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(INC) వ్యవస్థాపకుడు ఏ.ఓ. హ్యూమ్‌కు 1880లలో ఏటా 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేసేవారు. దేశంలో మొదటి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 230 ఎకరాల భూమిని దానం చేశారు.
ఇందిర.. సాహిత్యం, కళల ప్రతీక
1930 ఆగస్టు 17న హైదరాబాద్‌లోని జ్ఞాన్‌భాగ్ ప్యాలెస్‌లో జన్మించిన ఇందిరాదేవి.. రాజా ధనరాజ్‌గిర్జీ బహదూర్, రాణి ప్రేమిలా దేవి దంపతుల కుమార్తె. ఇంటి వద్దే ఆంగ్ల గవర్నెస్ ద్వారా విద్యాబోధన పొందిన ఆమె, ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మతో వివాహం అనంతరం సాహిత్య, కళా రంగాల్లో తనదైన ముద్ర వేసింది. ఆంగ్లంలో కవిత్వం రాసిన ఆమె రచనలు Return Eternity (1965), Partings in Mimosa (1968), Memories of the Deccan (2008) వంటి పుస్తకాల రూపంలో వెలువడ్డాయి. 1973లో సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతికి నామినేట్ కావడం ఆమె ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు. కవి, సంపాదకుడు కృష్ణ శ్రీనివాస్ ఆమెను నామినేట్ చేశారు. అలా భారత దేశ చరిత్రలోనే మొట్టమొదటి భారతీయ మహిళా నోబెల్ నామినీగా ఆమెకు గుర్తింపు దక్కింది. ఆమె కవిత్వంలో హైదరాబాద్ సంస్కృతి, డెక్కన్ జ్ఞాపకాలు, వ్యక్తిగత అనుభవాలు ప్రతిబింబించేవి. చిత్రకళ, రచన, ఫోటోగ్రఫీ రంగాల్లోనూ విశేష కృషి చేసిన ఆమె, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో హిందీ అకాడమీకి ఛైర్‌పర్సన్‌గా పనిచేసి సాహిత్యాభివృద్ధికి తోడ్పడ్డారు. 13 జనవరిన హైదరాబాద్‌లోని జ్ఞాన్‌భాగ్ ప్యాలెస్‌లో 95 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారు.
ఇందిరాదేవి తన కవిత్వం, కళల ద్వారా హైదరాబాద్ సంస్కృతిని నిలబెట్టగా, కామసుందరి దేవి తన త్యాగం, సేవల ద్వారా దేశభక్తి, సామాజిక బాధ్యతను ప్రతిబింబించారు. ఈ ఇద్దరు మహనీయులు మనకు ఒకే సందేశం అందించారు: దేశం, సంస్కృతి, సమాజం కోసం చేసిన సేవలు, త్యాగాలు శాశ్వతంగా నిలుస్తాయి. ‘‘దేశభక్తి ఎప్పుడూ నినాదాల్లో, అధికార ప్రదర్శనలో ఉండదు. అది నిశ్శబ్ద త్యాగంలో, సమాజానికి చేసిన సేవలో, సంస్కృతిని కాపాడటంలో ఉంటుంది’’ అని ఓ కవి చెప్పిన మాటకు ఈ ఇద్దరే రాజవంశానికి చెందిన ఆడపడుచులే ప్రత్యక్ష తార్కాణాలు.


