
భారతీయ మహిళామణులకు బొట్టు అంటే ప్రాణం.అందం, సంప్రదాయాల మేళవింపు అది. పండగ అయినా, పెళ్లిఅయినా, ఏ వేడుక అయినా అదొక ఫ్యాషన్. అందుకే కాలక్రమేణా బొట్టు లేదా బిందీ రూపాలు మారుతూ వచ్చాయి.ఈ మార్పునే ఆకళింపు చేసుకున్నారు బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకురాలు మేఘనా ఖన్నా. రోజువారీ జీవితంలో భాగమైన బొట్టు బిళ్లలను ఫ్యాషన్ ఆభరణాలుగా మార్చి, తన క్రియేటివిటీతో పలువురి సెలబ్రిటీల ఫ్యావరెట్‌గా మారిపోయింది. మిలిటరీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన మేఘన ఉద్యోగాన్ని వదిలి మరీ ఈ వ్యాపారాన్ని ఎంచుకుంది. మేఘనా సక్సెస్ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందాం ఈ కథనంలో.
బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకురాలు మేఘనా ఖన్నా బిందీ సంప్రదాయం నుండి ప్రేరణ పొంది, ది బిండి ప్రాజెక్ట్‌ను స్థాపించారు. అయితే ఈ జర్నీ వెనుక పెద్ద పోరాటమే ఉంది. మేఘనా ఖన్నా పూణేలో మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఎంబీఏ చేశారు. ఒక ఏడాది పాటు ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరారు. కానీ సొంతంగా వ్యాపారాన్ని చేయాలనే ఆలోచనకు మరింత పదును పెరిగింది. ఈ క్రమంలో ఆమె దృష్టి ముక్కు పోగులపై పడింది. జోధ్‌పూర్ కళాకారులతో కలసి "లెవిటేట్" అనే హ్యాండ్‌క్రాఫ్ట్ జ్యువెలరీ బ్రాండ్‌ను ప్రారంభించింది. 2002 - 2020 వరకు అంటే పద్దెనిమిదేళ్లు లెవిటేట్ విజయవంతంగా నడిచింది. ఇందులో రకరకాల చోట్ల నుంచి వచ్చిన అందమైన నగలు, యాక్సెసరీలు, గృహాలంకరణ వస్తువులు ఉండేవి. కోవిడ్ మహమ్మారి మేఘనా వ్యాపారాన్ని దెబ్బతీసింది. చివరకు వ్యాపారం మూసివేయాల్సి వచ్చింది. కానీ బిజినెస్ చేయాలనే కోరిక మాత్రం నశించ లేదు.
2022లో అనుకోకుండా బొట్టు బిళ్లల్లో బంగారు, వెండివి ఉంటాయని తెలుసుకుంది మేఘనా. తన స్నేహితురాలు అమ్మమ్మ ఇచ్చిన బంగారు బొట్టు చూశాక తానెందుకు ఇలాంటి తయారు చేయకూడదనే ఆలోచన వచ్చింది. అన్ని ఆభరణాల మాదిరిగానే బొట్టు బిళ్లలు కూడా ఒకఫ్యాషన్‌గా ఉండాలనే ఆలోచనతో "ది బిందీ ప్రాజెక్ట్" ప్రారంభించింది. దీనికి తోడు ‘లెవిటేట్’ అనుభవం ఉండనే ఉంది. రూ.5 లక్షలతో బిందీ ప్రాజెక్ట్ షురూ అయింది. కేవలం ఇద్దరు మహిళలకు శిక్షణ ఇచ్చి, అందంగా స్పెషల్ డిజైన్లతో బిందీ డిజైన్లు రూపొందాయి. దీనికి తగ్గట్టు మార్కెటింగ్ చేసుకున్నారు. తొలుత వీటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పర్యావరణహితమైన, రీసైకిల్ చేయబడిన వ్యర్థాలతో అందమైన బొట్టు బిళ్లలను తయారు కావడంతో సెలబ్రిటీలను సైతం విపరీతంగా ఆకర్షించాయి. ఇవి కేవలం ఒక సాధనంగా కాకుండా, ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మారిపోయాయి.
రెండున్నరేళ్లలో 1500 కస్టమర్లు వచ్చారు. సోషల్ మీడియాలో వాట్సాప్, ఇన్‌స్టా ద్వారా ఆర్డర్లు తీసుకుంటారు. ఇలా 2024 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల ఆదాయం వచ్చింది. ఇది 2025లో రూ. 20 లక్షలకు చేరిందంటే దీని ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఫెస్టివ్, లెదర్, వస్త్రంతో పూర్తిగా చేత్తో తయారవుతాయి. రంగు రాళ్లు, ఇత్తడి ముక్కలు, పూసలు ఇలా రక రకాలుగా తయారయ్యే ఒక్కో బొట్టు బిళ్లా ఒక్కో డిజైనర్ ఆభరణంలా ఉంటుంది. సామాన్యులతో పాటు,ప్రముఖ పాప్ గాయని ఉషా ఉతుప్, కరీనా కపూర్, కరిష్మా, తమన్నా, సోనం కపూర్ తదితర బాలీవుడ్ హీరోయిన్లను కూడా ఆకర్షిస్తున్నాయి.