పరేడ్‌లో దళనాయకి | CRPF officer Simran Bala to lead all-male contingent at Republic Day 2026 parade | Sakshi
Sakshi News home page

పరేడ్‌లో దళనాయకి

Jan 23 2026 5:39 AM | Updated on Jan 23 2026 5:39 AM

CRPF officer Simran Bala to lead all-male contingent at Republic Day 2026 parade

న్యూస్‌మేకర్‌

26 ఏళ్ల సిమ్రన్  బాలా 77వ భారత గణతంత్ర ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. జమ్ము కాశ్మీర్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా పని చేస్తున్న సిమ్రన్  బాలా
ఆల్‌ మేల్‌ సీఆర్‌పీఎఫ్‌ దళానికి జనవరి 26న జరిగే పరేడ్‌లోనాయకత్వం వహించనున్నారు. సిమ్రన్  బాలా స్ఫూర్తిబాట....

త్రివిధ దళాలలో నారీ శక్తి తేజం దేశానికి చాటడానికి గత కొన్నేళ్లుగా రిపబ్లిక్‌ డే వేడుకలు వేదిక అవుతున్నాయి. ఈసారి కూడా నారీ శక్తికి అలాంటి గౌరవమే దక్కనుంది. జనవరి 26న జరగనున్న 77వ  గణతంత్ర దినోత్సవంలో 26 ఏళ్ల సిమ్రన్‌ బాలా ఈసారి చరిత్ర సృష్టించనున్నారు. జమ్ముకూ శ్రీనగర్‌కూ సరిగ్గా 150 కిలోమీటర్ల దూరంలో ఉండే రాజౌరీ పట్టణంలో సి.ఆర్‌.పి.ఎఫ్‌.  అసిస్టెంట్‌ కమాండెంట్‌ అయిన సిమ్రన్‌ బాలా  కర్తవ్య పథ్‌లో జరిగే గ్రాండ్‌ పరేడ్‌లో ‘సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌’ (సి.ఆర్‌.పి.ఎఫ్‌.) పురుష కవాతు బృందానికి నాయకత్వం వహించనున్నారు. ఈ ఘనత పొందిన మొదటి మహిళా అధికారిణి బాలా.  

సరిహద్దులో పుట్టి పెరిగి..
రాజౌరి జిల్లాలోని నౌషెరాలో జన్మించిన బాలా బాల్యమంతా ఘర్షణలను, అలజడులనే చూశారు.  సరిహద్దుల్లో కాల్పులు, నిరంతర భద్రతా సవాళ్లను చూస్తూ పెరిగారు. సైనికుల క్రమశిక్షణ, విధి నిర్వహణ, సేవ... తమ రోజువారీ జీవితంలో భాగమైన వాతావరణం చూస్తుండటంతో దేశానికి సేవ చేయాలనే లోతైన సంకల్పం చిన్ననాడే ఆమెలో నాటుకుంది. దాంతో అదే లక్ష్యంగా ప్రయత్నించి సి.ఆర్‌.పి.ఎఫ్‌.లో అధికారిగా చేరారు. సి.ఆర్‌.పి.ఎఫ్‌. మొదటి మహిళా అధికారి ఆమే కావడం విశేషం.

దేశస్థాయిలో 82వ ర్యాంకు సాధించి...
రాజనీతి శాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన సిమ్రన్‌ యూపీఎస్సీ సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ పరీక్షకు సిద్ధమయ్యారు. 2023 మేలో మొదటి ప్రయత్నంలోనే దేశస్థాయిలో 82వ ర్యాంకును సాధించి  సి.ఆర్‌.పి.ఎఫ్‌.లో చేరారు. గురుగ్రామ్‌లో అకాడమీలో కఠినమైన శిక్షణ పొందాక ఛత్తీస్‌గఢ్‌లోని ‘బస్తారియా బెటాలియన్‌’లో మొదటి ఆపరేషనల్‌ పోస్టింగ్‌లో చేరి నక్సల్‌ వ్యతిరేక కార్యకలాపాలకు బాధ్యత వహించే యూనిట్‌లో పని చేశారు. ప్రస్తుతం రాజౌరిలో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా ఉన్నారు.

గొప్ప అనుభూతి
గ్రాండ్‌ పరేడ్‌లో సి.ఆర్‌.పి.ఎఫ్‌. పురుషుల కవాతు బృందానికి మహిళా అధికారిగా నాయకత్వం వహించే అవకాశం సిమ్రాన్ కు సులభంగా ఏం దక్కలేదు. పరేడ్‌ రిహార్సల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన, శిక్షణ, ఫీల్డ్‌ పోస్టింగ్‌లలో విశిష్ట రికార్డు సొంతం కావడం వల్లే ఆమెకు ఈ అవకాశం దక్కింది. ఇంటెన్సివ్‌ పరేడ్‌ రిహార్సల్స్‌ సమయంలో ఆమె విశ్వాసం, డ్రిల్, కమాండ్‌ సామర్థ్యాలలో కచ్చితత్వం ఇతరుల కంటే మెరుగ్గా ఉండేలా చేసిందని పైఅధికారులు ప్రశంసించారు. తనకు ఈ బాధ్యత ఇచ్చిన మరుక్షణం నుంచి తాను పొందుతున్న అనుభూతి మాటల్లో వర్ణించలేనిదని సిమ్రాన్‌ బాలా అన్నారు.

బాలికలకు స్ఫూర్తిగా..
సిమ్రన్‌ బాలా పుట్టిపెరిగిన రాజౌరి, పూంచ్‌ జిల్లాల్లో ప్రస్తుతం హర్షాతిరేకాలు వెల్లివిరుస్తున్నాయి. ఆమె గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. నేటి బాలికలకు ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని, రక్షణ రంగంలో కెరీర్‌లను ఎంచుకోవడానికి మహిళలకు ఆమె మార్గదర్శిగా నిలిచారని ఊరి పెద్దలు మెచ్చుకుంటున్నారు. ‘సిమ్రాన్ లాగే మేము కూడా యూనిఫాం ధరించి భారతమాతకు సేవ చేయాలనుకుంటున్నాము’ అని ఆమె స్వస్థలానికి చెందిన యువతులు అంటుండటం ఆమె చేసిన కృషికి అద్దం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement