ఎవరికైనా ఇంటి అడ్రస్ చెప్పడానికి చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ మార్క్ చెబుతాం తేలిగ్గా కనుక్కోవడానికి! కానీ ఇల్లే అలా ల్యాండ్‌మార్క్ అయిన అబ్బురం గురించి విన్నారా?
ఆ ఘనత క్రికెటర్ దీప్తి శర్మకు దక్కుతుంది. ఆమె ఇంటి ముందు ‘అర్జున అవార్డీ క్రికెటర్ దీప్తి శర్మ మార్గ్: సర్వజన్ వికాస్ సమితి అవద్‌పురి మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది’ అనే ఆర్చ్ కనపడుతుంది. ఇప్పుడు ఎందుకీ ప్రస్తావన అంటే మహిళా క్రికెట్ వరల్డ్ కప్ పోటీలే! ఆల్‌రౌండర్‌గా అందులో ఆమె చూపిస్తున్న ప్రతిభనే సందర్భంగా దీప్తి పరిచయం..
ఆగ్రాలోని షాగంజ్, అవద్‌పురి కాలనీలో పుట్టి పెరిగారు దీప్తి. చిన్నప్పటి నుంచీ క్రికెట్ అంటే ప్రాణం. క్రికెట్ బ్యాట్‌తో ఆగ్రా వీధులను చుట్టారు. తన స్పిన్ బౌలింగ్‌తో ఆ ఊరి దారులను సుపరిచితం చేసుకున్నారు. క్రికెటర్ కావాలన్న ఆ దీక్షే ఆమెను ఈ రోజు స్టేడియంలో నిలబెట్టింది. వరల్డ్ కప్ టీమ్‌లో భాగస్వామిని చేసింది.
అన్నయ్యే తొలి గురువుగా..
దీప్తికి క్రికెట్ మీద ఆసక్తి ఏర్పడింది అన్నయ్య సుమిత్ శర్మ క్రికెట్ ఆడటాన్ని చూసే. అన్నయ్యను అనుకరిస్తూ ఆమె క్రికెట్ ఆడేవారు. అది అన్నయ్య దృష్టిలో పడింది. క్రికెట్ అంటే దీప్తికున్న మక్కువనూ, ఆ ఆటలో ఆమె ప్రతిభనూ గమనించాడు. అంతే! చెల్లికి తొలి కోచ్‌గా మారాడు. ‘ఆడపిల్లకు క్రికెట్ ఏంటీ?’ అన్న బంధువుల మాటలకు తలొగ్గిన తల్లి .. చెల్లిని క్రికెట్ ఆడనీయకుండా ప్రయత్నించేది.
కానీ అమ్మకు తెలియకుండా చెల్లిని గ్రౌండ్‌కి తీసుకెళ్లి క్రికెట్‌లోని మెలకువలను నేర్పించాడు అన్నయ్య. ఆట పట్ల ఆ పిల్లలకున్న నిబద్ధతను చూసి తల్లిదండ్రులూ ప్రోత్సహించడం మొదలుపెట్టారు. బంధువుల మాటను బేఖాతరు చేసి. చదువునూ సీరియస్‌గా తీసుకోవాలనే షరతు పెట్టారు. అలా ఆ ఇంటి పెద్దలు రెండిటి మధ్య సమన్వయం పాటించినట్లే దీప్తి కూడా చదువు, క్రికెట్ రెండిటినీ సమన్వయం చేసుకుంది.
ప్రొఫెషనల్ క్రికెటర్‌గా..
గ్రౌండ్‌లో అన్నాచెల్లెళ్ల క్రికెట్ కమిట్‌మెంట్ చూసిన స్థానిక కోచ్‌లు దీప్తికి తదుపరి శిక్షణనివ్వడానికి ముందుకు వచ్చారు. ఆ శిక్షణ ఆమె బ్యాటింగ్‌ను, బౌలింగ్ స్కిల్స్‌ను మెరుగుపరచాయి. దానికి తోడు గ్రౌండ్‌లో గంటల కొద్దీ ప్రాక్టీస్.. ఆమెను ఆల్‌రౌండర్‌గా మలిచింది. ఆ ప్రత్యేకతే నేషనల్ సెలెక్టర్‌లను ఆకట్టుకుంది. పదిహేడేళ్ల వయసులోనే ఆమెకు ఇండియన్ విమెన్స్ క్రికెట్ జట్టులో స్థానం కల్పించేలా చేసింది. ఆమె ప్రతిభ యూపీ వారియర్స్ (ఐపీఎల్)కి కెప్టెన్‌ను చేసింది. తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కూ చేర్చింది.
సవాళ్లు.. విజయాలు
గెలుపు దారి అంత సులువుగా ఉండదు. ఇందుకు దీప్తి క్రికెట్ ప్రయాణం మినహాయింపు కాదు. ఆడపిల్ల క్రికెట్ ఆడటం ఏంటీ అని పెదవి విరవడాల దగ్గర్నుంచి క్రికెట్‌లో లింగవివక్ష లాంటి నుదురు చిట్లింపుల వరకు ప్రతి చిన్నా పెద్దా సవాళ్లకు ఎదురొడ్డింది దీప్తి. అన్నిటినీ బౌల్డ్ చేసింది.. మూస ఆలోచనలను బౌండరీకి ఆవల నెట్టేసింది. ఒక్కమాటలో క్రికెట్‌లో ఆమె ప్రకంపనలు సృష్టించిందని చెప్పవచ్చు.
వన్ డే ఇంటర్నేషనల్స్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా రికార్డ్ క్రియేట్ చేయడమే కాదు క్రికెట్‌లో ఉన్న పురుషాధిపత్యాన్నీ బ్రేక్ చేసింది. ఇలా ఆటలోని ఆమె శైలి, వ్యూహం, స్థిరత్వం అన్నీ మన దేశ మహిళా క్రికెట్‌ను ఉన్నత స్థితికి చేర్చాయి. అందుకే మన మహిళా క్రికెట్‌లో ఆమెను ఒక అద్భుతంగా అభివర్ణిస్తారు క్రికెట్ విశ్లేషకులు. చిన్న పట్టణం నుంచి పెద్ద కలతో విశాలమైన మైదానంలోకి అడుగుపెట్టి ఆ కలను ఆమె సాకారం చేసుకున్న తీరు అమ్మాయిలకే కాదు అబ్బాయిలకూ స్ఫూర్తే!
అందుకే దీప్తి శర్మ అర్జున అవార్డ్ అందుకున్న వెంటనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఆమె ఇంటిముందున్న రోడ్లను సువిశాలం చేసి.. ఆమె ఉంటున్న వీథికి మౌలిక సదుపాయాలను కల్పించారట. ఆ గౌరవంతోనే అవద్‌పురి వాసులు తమ వీథి ముందు ‘అర్జున అవార్డీ క్రికెటర్ దీప్తిశర్మ మార్గ్ : సర్వజన్ వికాస్ సమితి అవద్‌పురి మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది’ అనే ఆర్చ్‌ను ఏర్పాటు చేశారు.
‘జీవితంలో.. ఆటలో ఎక్కడైనా ఒడిదొడుకులు ఉంటాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడమే విజయం. ఆ చాలెంజెసే మనల్ని అద్భుతమైన ప్లేయర్‌గా తీర్చిదిద్దుతాయి ఆటలో అయినా.. జీవితంలో అయినా!
– దీప్తి శర్మ


