ఆమె సమరానికి ఆనవాలు | Womens Leadership of Independence Movement Period in 1930-31 | Sakshi
Sakshi News home page

ఆమె సమరానికి ఆనవాలు

Jan 25 2026 5:40 AM | Updated on Jan 25 2026 5:40 AM

Womens Leadership of Independence Movement Period in 1930-31

1930–31 ఆల్బమ్‌

కాలగర్భం నుంచి వెలికి వచ్చిన వెల కట్టలేని విలువైన వజ్రంలాంటి ఆల్బమ్‌ ఇది. మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి  చా...లా సంవత్సరాల ముందు వచ్చిన ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఆల్బమ్‌ ఎక్కడో అజ్ఞాతంలో ఉండిపోయింది. ఇప్పుడు ఆ అజ్ఞాతవాసాన్ని వీడి తాజాగా ప్రజల మధ్యలోకి వచ్చింది. ప్రసిద్ధ మహిళా నాయకులు కాదు సామాన్య అసామాన్య స్వాతంత్య్రోద్యమ మహిళా నాయకుల విశ్వరూపాన్ని ప్రదర్శించే ఫొటో ఆల్బమ్‌ ఇది...


విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా ముంబైలోని ఒక బ్రిటిష్‌ దుకాణం ముందు నిలబడి ఉన్న ఫైర్‌బ్రాండ్‌... లీలావతి మున్షీ


ఉప్పు తయారు చేయడానికి ముంబైలోని సముద్రపు నీటిని తమ ఇళ్లకు తీసుకువెళుతున్న మహిళలు, పిల్లలు.


బ్రిటిష్‌ పోలీసులతో ఢీ అంటే ఢీ అంటున్న మహిళా ఉద్యమకారులు



రెండు దశాబ్దాల క్రితం లండన్‌లో ఒక ఫొటో ఆల్బమ్‌ను వేలం వేశారు. వేలం పాటలో ఈ ఆల్బమ్‌ను దిల్లీకి చెందిన ఆల్కాజీ ఫౌండేషన్‌ సొంతం చేసుకుంది. చిన్న సైజ్‌లో ఉన్న ఈ ఆల్బమ్‌ బూడిద రంగు కవర్‌పై...‘ఓల్డ్‌ కాంగ్రెస్‌ పార్టీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోస్‌ కలెక్షన్‌–కె.ఎల్‌.నర్పీ’ అని కనిపిస్తుంది.

జాతీయ జెండాతో ఉద్యమ బాటలో మహిళలు
డ్యూక్‌ యూనివర్శిటీకి చెందిన ఇద్దరు పరిశోధకులు ప్రత్యేక దృష్టి సారించే వరకు ఈ ఫొటో ఆల్బమ్‌ అల్కాజీ ఫౌండేషన్‌కే పరిమితం అయింది. పరిశోధకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన ఆల్బమ్‌ ఇది. స్వాతంత్య్రోద్యమ కాలంలో మహిళల నాయకత్వానికి, ఉద్యమ క్రియాశీలతకు అద్దం పట్టే ఆల్బమ్‌ ఇది. 
సహాయ నిరాకరణ ఉద్యమం నాటికి మహిళల పాత్ర పరిమితంగానే ఉండేది. ఆ తరువాత మాత్రం మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎవరికీ తెలియని మహిళా స్వచ్ఛంద సేవకులు ఈ ఆల్బమ్‌లో కనిపిస్తారు. 



‘రాట్నం వడకండి’ నివాదంతో మహిళల నేతృత్వంలో ముంబై వీధుల్లో జరిగిన ఊరేగింపు

ఎంతోమంది మహిళా కార్యకర్తలు తమ చంటి బిడ్డలతో పాటు బ్రిటిష్‌ వలసవాద వ్యతిరేక పోరాటంలో భాగమైన అరుదైన దృశ్యాలు ఇందులో కనిపిస్తాయి.
‘ఉద్యమ స్ఫూర్తికి అద్దం పట్టేలా ఉన్న ఈ ఫొటోలలోని మహిళలను చూసి మేము ముగ్ధులమయ్యాం’ అన్నారు డ్యూక్‌ విశ్వవిద్యాలయానికి చెందిన సుమతి రామస్వామి. ఆమె తన సహోద్యోగి అవరతి భట్నాగర్‌తో కలిసి ఈ ఆల్బమ్‌ను అధ్యయనం చేశారు.
‘ఈ ఆల్బమ్‌ జాతీయవాద ఉద్యమంలో మహిళల పాత్రను కళ్లకు కట్టడం మాత్రమే కాదు మహిళలు ఇల్లు దాటి ఉద్యమంలోకి అడుగుపెట్టడానికి సంబంధించిన అరుదైన దృశ్యాలకు వేదికగా నిలిచింది’ అంటారు భట్నాగర్‌.


ముంబైలోని చౌపట్టీ బీచ్‌ దగ్గర ఉప్పు తయారుచేయడానికి సిద్ధం అవుతున్న మహిళలు

ఒక ఫొటోలో... గుజరాత్‌ స్వాతంత్య్ర సమరయోధురాలు లీలావతి మున్షీ బ్రిటిష్‌ ప్రభుత్వ యాజమాన్యంలోని ఉప్పు పాన్‌పై దాడి చేస్తున్న పురుషుల బృందానికి సూచన ఇవ్వడం కనిపిస్తుంది.
మరో ఫొటోలో విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా బ్రిటిష్‌ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌ ప్రవేశ ద్వారం ముందు మున్షీ ధిక్కారంగా నిలబడి కనిపిస్తుంది.
సుమతి రామస్వామి, అవరతి భట్నాగర్‌ ఈ ఆల్బమ్‌ను ‘ఫొటోగ్రాఫింగ్‌ సివిల్‌ డిసొబిడియన్ట్‌’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు. అరుదైన ఛాయాచిత్రాలతో పాటు విద్యావేత్తలు రాసిన విలువైన వ్యాసాలు కూడా ఉన్న ఈ పుస్తకం నేటి తరం మహిళలకు మార్గదర్శనం చేసేలా ఉంటుంది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement