టి.గోల్ఫ్ ఫౌండేషన్ అధినేత ఎన్‌ఆర్‌ఎన్ రెడ్డితో అమూల్య
మాజీ ఐఆర్‌ఎస్ అధికారి, గోల్ఫ్ ప్రేమికుడు డాక్టర్ ఎన్‌ఆర్‌ఎన్ రెడ్డి టీ గోల్ఫ్ ఫౌండేషన్ స్థాపించి అమెచ్యూర్ గోల్ఫర్లనుప్రోత్సహిస్తున్నారు. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు టోర్నీల్లో ఆడేందుకు వీలుగా టికెట్లు, వసతి సౌకర్యం వంటి వాటిని అందిస్తున్నారు.
గోల్ఫ్ అంటే ఖరీదైన క్రీడ కదా మనకెందుకులే అని ఆమె అనుకోలేదు. రైతులం కదా అంతటి ఖరీదైన ఆటకు శిక్షణ ఇప్పించడం మన తరమవుతుందా అని ఆమె తల్లిదండ్రులూ వెనకడుగు వేయలేదు.. తండా అమ్మాయి కదా గోల్ఫ్‌కిప్రోత్సహించడం వల్ల ప్రయోజనం ఏముంటుంది అని ఆమె కోచ్ కూడా భావించలేదు. పట్టుదలతో ఆటపై పట్టు సాధిస్తే, అవకాశాలు వాటంతట అవే వస్తాయి అని ఆమె.. బిడ్డ ఆసక్తి, పట్టుదలే వెన్నుదన్నుగా నిలవడం ఖాయమని ఆమె తల్లిదండ్రులు.. వెన్నుతట్టిప్రోత్సహిస్తే ఆమె అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి కావడం తథ్యమని ఆమె కోచ్ బలంగా విశ్వసించారు.
వారి నమ్మకం నిజమైంది. తండా నుంచి వచ్చిన ఓ సాధారణ అమ్మాయి.. గోల్ఫ్‌లో అదరగొడుతోంది. ఎందరో దిగ్గజ గోల్ఫర్లను వెనక్కి నెట్టి ఇటీవల జరిగిన హైదరాబాద్ ఓపెన్ కప్‌ని కైవసం చేసుకుని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంది. ఆమె పేరు జి.అమూల్య. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం ఎర్ర సోమ్లా తండాకు చెందిన రైతులు జి.రవికుమార్, సునీత దంపతుల కుమార్తె. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతోంది.
వాస్తవానికి మన దేశంలో బాగా క్రేజ్ ఉండేది క్రికెట్‌కే... తర్వాత బ్యాడ్మింటన్ , టెన్నిస్, హాకీ.. గత కొంతకాలంగా ఒలింపిక్స్ పతకాలు వస్తున్న రెజ్లింగ్, బాక్సింగ్, షూటింగ్ వంటి వాటినీ క్రీడాభిమానులు ఫాలో అవుతున్నారు. దీంతో చాలామంది తల్లిదండ్రులు దాదాపుగా ఇవే క్రీడల్లో తమ పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. ధనవంతుల క్రీడగా భావించే గోల్ఫ్ పట్ల ఎవరూ ఆసక్తి చూపించరు. ఎందుకంటే ఈ ఆటలో ఉపయోగించే గోల్ఫ్ స్టిక్, బాల్స్ వంటివన్నీ ఇతర క్రీడలతో పోలిస్తే చాలా ఖరీదు. అయినా అమూల్య మాత్రం గోల్ఫ్ పై ఆసక్తి పెంచుకుంది.
స్థానికంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఆమెలో గోల్ఫ్ ఆటపై ఉన్న ఆసక్తిని, నైపుణ్యాన్ని కోచ్ భాస్కర్ గుర్తించారు. కెరీర్ ఆరంభం నుంచే అమూల్యను వెన్నుతట్టిప్రోత్సహించారు. రాష్ట్రస్థాయి, సౌత్ జోన్ లెవెల్ టోర్నీల్లో ఆడేలాప్రోత్సహించారు. అప్పటి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అమూల్యను హైదరాబాద్ బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కోర్సు, హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌లో శిక్షణ తీసుకునేలా సిఫార్సు చేశారు. ఈప్రోత్సాహానికి తగ్గట్టే అమూల్య పలు టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా 2022–23 మధ్యలో పలు జూనియర్, సౌత్ జోన్ స్థాయి టోర్నీల్లో ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది.
మలుపు తిప్పిన హైదరాబాద్ ఓపెన్
మాజీ ఐఆర్‌ఎస్ అధికారి, గోల్ఫ్ ప్రేమికుడు డాక్టర్ ఎన్‌ఆర్‌ఎన్ రెడ్డి టీ గోల్ఫ్ ఫౌండేషన్ స్థాపించి అమెచ్యూర్ గోల్ఫర్లనుప్రోత్సహిస్తున్నారు. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు టోర్నీల్లో ఆడేందుకు వీలుగా టికెట్లు, వసతి సౌకర్యం వంటి వాటిని అందిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోనే తొలిసారి అమెచ్యూర్ గోల్ఫర్ల కోసం హైదరాబాద్ ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ పేరుతో జాతీయస్థాయి టోర్నీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 300 మందికి పైగా గోల్ఫర్లు దీనిలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అమూల్య కూడా ఎన్‌ఆర్‌ఎన్ రెడ్డిని కలిసి టోర్నీలో ఆడతానని అడగడంతో.. ఆమె నేపథ్యం తెలుసుకున్న ఆయన ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా అవకాశమిచ్చారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అమూల్య క్వాలిఫైయింగ్ రౌండ్‌లో అదరగొట్టి, ప్రధాన రౌండ్‌లో పెద్ద పెద్ద గోల్ఫర్లను వెనక్కి నెట్టి ఓవరాల్ గ్రాస్ విన్నర్‌గా నిలిచింది. తద్వారా రూ.90వేల ప్రైజ్ మనీతో పాటు గవర్నర్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక హైదరాబాద్ ఓపెన్ ట్రోఫీ, గోల్ఫర్లు ధరించే గ్రీన్ జాకెట్ అందుకుంది. గోల్ఫ్ ట్రిప్ సంస్థ ద్వారా బ్యాంకాక్‌లో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్సులో ఆడే అవకాశాన్ని కూడా గెలుచుకుంది. గోల్ఫ్ కిట్‌ను టీ గోల్ఫ్ ఫౌండేషన్ అందించింది. భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి సహకారం కావాలన్నా తమ ఫౌండేషన్ కు రావొచ్చని ఎన్‌ఆర్‌ఎన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఓ మారుమూల తండా నుంచి వచ్చి గోల్ప్ లో అదరగొడుతున్న అమూల్య భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. – సత్య కిషోర్ కొండ్రెడ్డి


