
సిక్కోలు వీరుల గాథలను ప్రదర్శిస్తున్న జానపద కళాకారులు
అభిప్రాయం
భారతదేశంలో బిర్సా ముండా (1875 –1900), కుమరం భీమ్ (1901– 1940), అల్లూరి సీతారామరాజు (1897 –1924) వంటివారి పోరాటాల కోవ లోకి వచ్చే సిక్కోలు యోధులు తాటి రాజు(మరణం: 1865), కొర్ర మల్లయ్య (మరణం: 1900). చెప్పాలంటే, వాళ్ల పోరాటాలకు ముందుగానే వీళ్లు మద్రాసు ప్రెసిడెన్సీలోని నాటి గంజాం ప్రాంతంలోని వైజాగ్ పటం జిల్లాలో అనగా నేటి ఉత్తరాంధ్రాలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి ఆశువులు బాశారు. వీళ్ల గురించి జానపదులు ఇప్పటికీ పాడుతుంటారు.
గొలుగొండ ఏజన్సీలో వీరయ్య దొర (1879), గోదావరి జిల్లాలోని ద్వారబంధాల చంద్రయ్య (1879) వంటి ఆదివాసీ యోధులు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి అమరులయ్యారు. అయితే వారి ప్రాణత్యాగాలు నేటి వరకూ వెలుగులోకి రాలేదు. నాటి ఉమ్మడి గంజాం జిల్లాలోని గుణుపురం, పర్లాకిమిడి, పాలకొండ ఏజన్సీలలో (1833–34) జరిగిన సవరల తిరుగుబాటు, 1834లో మేరంగి, కురుపాం ప్రాంతాలలో జరిగిన అచ్చిప్పవలస తిరుగుబాటు, విశాఖ పట్నం జిల్లా శృంగవరపు కోట తిరుగుబాటు (1837), గొలుగొండ ఏజెన్సీలో వీరయ్య దొర (1879–80) పితూరీలు చరిత్ర (History) కెక్కలేదు.
1900వ సంవత్సరంలో సాలూరు, పాచిపెంట ఏజెన్సీలలో కొర్రవానివలస పితూరీగా చెప్పబడుతున్న గిరిజనుల తిరుగుబాటులో కొండదొర తెగకు చెందిన కొర్ర మల్లయ్య (Korra Mallaiah) బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడి మరణించారు. కరువుతో అల్లాడిన గిరిజన రైతులు కప్పం చెల్లించాలన్న స్థానిక దళారులకు, బ్రిటిష్ అధికారులకు ధీటుగా సాలూరు ఏజెన్సీలో 5,000 మంది గిరిజనులతో మల్లయ్య తిరుగుబాటు చేశాడు. వెదురుకర్రలతో తుపాకులను చేసి అవే నిజమైన తుపాకీలుగా నమ్మించాడు.
ఆధ్యాత్మిక గురువుగా స్వామి అని పిలవబడే కొర్ర మల్లయ్య మట్టి సుద్దలను బాంబులుగా మార్చగలనని చెప్పాడు. తన కుటుంబ సభ్యులను పంచ పాండవులుగానూ, తన కుమారుణ్ణి శ్రీకృష్ణుని అవతారంగానూ భావించి, తనకు అతీత శక్తులు ఉన్నాయని చెప్పి గిరిజనులను ఏకంచేసి బ్రిటిష్‌వాళ్లపై పోరాటం చేశాడు.
1900 మే నెల ఏడవ తేదీన పాచిపెంట దరి కొర్రవాని వలస గ్రామాన్ని బ్రిటిష్ సైన్యం చుట్టుముట్టి కాల్పులు జరపగా ఏడుగురు గిరిజనులు నేలకొరిగారు. పట్టుబడిన మల్లయ్య, మరో ఇద్దరికి మరణదండన విధించారు. ఇది తెలుగు నేలపై కొర్రవానివలస పితూరీగా ప్రసిద్ధి గాంచింది.
అలాగే ఉమ్మడి గంజాం జిల్లా పర్లాకిమిడి, గుణుపూరు ప్రాంతాలలో (1854–58) జరిగిన తాటిరాజు పితూరి, 1864లో పుత్తాసింగ్ పితూరీ గూర్చిన సమాచారం వెలుగులోకి రాలేదు. గయాబిసాయిగా పేరుగాంచిన తాటిరాజును 1865 ప్రాంతంలో శ్రీకాకుళం నడిబొడ్డున వందలమంది పోలీసుల సమక్షంలో ఉరితీసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాలలో జానపద కళా కారులు ‘తాటిరాజు వేషం’ వేసి ప్రదర్శనలు ఇవ్వడం కనిపిస్తుంది. దీన్నిబట్టి తాటిరాజు (Tati Raju) సామాన్య ప్రజలకు కూడా తెలిసిన ఉద్యమ నాయకుడని అర్థమవుతుంది.
విశాఖ మన్యంలోని గొలుగొండ ఏజెన్సీలో వీరయ్య దొర బ్రిటిష్ సైన్యం గుండు దెబ్బ తగిలి మరణించాడు. అలాగే 1891లో గొలుగొండలో శాంతి భూపతి పోరాటాలు కూడా వెలుగులోకి రాలేదు. ఇలా కళింగాంధ్రలో జరిగిన మన్యం పోరాటాలు భారతదేశంలో ఏ ప్రాంతానికి తీసిపోనివి.
చదవండి: దళితోద్యమ విజయాలు ఎన్నెన్నో!
కానీ ఎందుకో ఈ పోరాటాలు చరిత్రకెక్కని కథలుగా మిగిలిపోయాయి. ఇకనైనా వీటిపై పరిశోధన జరిపి విస్మృతికి గురైన కళింగాంధ్ర ఆదివాసీల పోరాటాలకు చరిత్రలో చోటు కల్పించాలి. అలాగే వాళ్ళ జయంతులు, వర్ధంతులు జరిపి నేటి తరానికి వారి పోరాటాలను అందివ్వ వలసిన అవసరం ఉన్నది.
- బద్రి కూర్మారావు
‘గిడుగు రామమూర్తి తెలుగు భాషా జానపద కళాపీఠం’ వ్యవస్థాపక అధ్యక్షుడు