
భారత దేశంలో నడిచిన ఉద్యమాల్లో దళి తోద్యమానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఉద్యమానికి అంబేడ్కర్ భావజాలమే ప్రధాన ఊపిరి. ఇందులో మేధావులు, కళాకారులు, కవులు, స్త్రీలు, ప్రజలు అంచెలంచెలుగా ఉద్య మంతో కలసి నడిచారు. ఉద్యమం ఒక విశ్వా సాన్ని ప్రజలకు కల్గించింది. స్వాతంత్య్రోద్యమంలో అంబేడ్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ సామాజిక స్పృహను మేల్కొ ల్పారు. వీటన్నిటి అవగాహనతోనే కారంచేడు, చుండూరు ఉద్యమాలను సాగించడం సాధ్యమయ్యింది.
అంబేడ్కర్ ‘మహద్ చెరువు’ పోరాట దృక్పథాన్ని అర్థం చేసు కుని సామాజిక, ప్రజాస్వామిక, లౌకిక వాద పోరాటాన్ని న్యాయ సమ్మతమైన పోరాట ధర్మాన్ని స్వీకరించాం. దానిని దళిత ఉద్యమా నికి అన్వయించడంతో కారంచేడు, చుండూరు, లక్ష్మీపేట ఉద్యమాల నిర్మాణం జరిగింది. సిద్ధాంత పరమైన, తాత్త్విక పరమైన అనేక చర్చలు జరిగాయి. అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కులు, అనేక సందర్భాల్లో ఆయన ఎదుర్కొని నిలబడిన పోరాట ఘట్టాలు, ప్రభు త్వాన్ని నిలదీయటానికి ఆయన వేసిన ప్రశ్నలు దళిత ఉద్యమానికి ఆయువుగా నిలిచాయి.
ప్రధానంగా హేతువాద ఉద్యమాల నుండి దళిత ఉద్యమంలోకి వచ్చినవారం ఇందులో ఎక్కువగా ఉన్నాం. ఈ ఉద్యమాన్ని అందుకే కుల నిర్మూలనా ఉద్యమంగా నడపగలిగాం. కారంచేడు, చుండూరు, ఇంకా అనేక చోట్ల మాల, మాదిగల మీద దాడులు జరిగినా అన్ని కులాలలో లౌకికవాదులు కలిసి రావటానికి కారణం ఈ ఉద్యమానికి ఉన్న కుల నిర్మూలన సైద్ధాంతిక భావనే. అంబేడ్కర్ ఆలోచనలను కమ్యూనిస్ట్ ఉద్యమాలు కూడా అర్థం చేసుకోవటం ప్రారంభించాయి.
అస్పృశ్యులను ఎందుకు ఊరి బయట ఉంచారో అంబేడ్కర్ చెప్పారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా అస్పృశ్యత కేవలం పేదరిక నిర్మూలన వల్ల పోతుందని కమ్యూనిస్టులు వాదించినందువల్ల అస్పృశ్యతా నివారణ జరక్కపోగా, అది స్వాతంత్య్రం అనంతరం మరింత జఠిల మైంది. అంబేడ్కర్ తీసుకొచ్చిన రిజర్వేషన్ల వల్ల దళితుల్లో చదువు కున్నవాళ్ళు పెరిగారు. రిజర్వేషన్ల వల్ల లాభం పొందినవారు కింది తరగతులను చైతన్యపరిచారు.
కొన్ని గ్రామాల్లో జరిగిన సంఘటనల నుండి ప్రారంభం అయిన దళిత ఉద్యమం రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. దళితులపై దాడులు జరగకుండా ఉండటం కోసం సామాజిక న్యాయ పోరాటాన్ని అన్ని దిశలకు తీసుకెళ్లే పెద్ద ప్రయత్నం జరిగింది.
ఇందులో ప్రధానమైన అంశం కుల నిర్మూలనా భావాన్ని విస్తృతం చేయడమే. ఎందుకంటే కులం అనేది కొన్ని వందల సంవత్సరాలుగా సమాజంలో ఘనీభవించింది. అది మెదడులోకి ఇంకిపోయింది. దాని రూపాన్ని మార్చాలి. ఆ మెదడులో ఏర్పడిన నమ్మకం శాస్త్రీయంగా నిజం కాదు. కొందరు ప్రత్యేకంగా ఆ భావాన్ని మెదడులోకి ఇంకించారు. దానికి మత ప్రయోజనాలు ఉన్నాయి.
దళిత ఉద్యమ ప్రభావం వల్ల అంబేడ్కరిజాన్ని చాలా లోతైన విషయంగా కమ్యూనిస్ట్ ఉద్యమాలు గమనించాయి. కేవలం ఆర్థిక పోరాటాలు కుల సమస్యనూ, కుల ఆర్థిక దోపిడినీ నివారించలేవు అని తెలుసుకున్నారు. నక్సలైట్ ఉద్యమంలో ప్రసిద్ధులైన కేజీ సత్య మూర్తి, బీఎస్ రాములు, వైకే, కంచె ఐలయ్య, ఊసా, ఎంఎస్ గోపి నాథ్, గద్దర్ లాంటి ఎందరో కళాకారులు, మేధావులు, దళిత ఉద్య మంలోకి వచ్చారు. ఇది పెద్ద కీలకమైన పరిణామం. ఈ పరిణామంతో భారతదేశంలో భావజాల చర్చ బలంగా జరిగింది. దానివల్ల కుల నిర్మూలన మీద గొప్ప పరిణామాత్మకమైన చర్చ జరిగింది.
ఈ ఉద్యమాలలో దళిత ఉద్యకారులు ఆ యా సంఘటనల్లో, ప్రధాన ఘట్టాల్లో, బొజ్జ తారకం లాంటి సామాజిక న్యాయవాదులు, ఉద్యమకారులతో కలిసి నడిచారు. అది చాలా విస్తృతమైన తాత్త్విక సామాజిక పరిణామానికి దారి తీసింది. 111 మంది ఎంపీలను ఏకతాటి మీదకు తీసుకు వచ్చిన ఉద్యమం... దళిత ఉద్యమం. అదే సమయంలో ‘‘ద ఎస్సీస్ అండ్ ద ఎస్టీస్ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) ఆక్ట్, 1989’’ని అంబేడ్కర్‌కి కొనసాగింపుగా చట్ట రూపంలోకి తెచ్చిన ఉద్యమం... దళిత ఉద్యమం.
అలాగే ‘రాష్ట్రపతి దళితుడు కావాలి’ అనే నినాదాన్ని ప్రయోగాత్మకంగా చేసిన మహోద్యమం కూడా ఇదే. ముగ్గురు ప్రధాన మంత్రులు దళిత బాధితులను స్వయంగా కలసి చర్చలను జరిపిన ఉద్యమం కూడా దళిత ఉద్యమమే. మాజీ ప్రధాన మంత్రి వీపీ సింగ్, రామ్ విలాస్ పాశ్వాన్, శరద్ యాదవ్, వెంకట స్వామి వంటి ఉద్ధండులు ఢిల్లీ బోటు క్లబ్‌లో ఉద్యమంలో పాల్గొ న్నారు. పార్లమెంటు భవనం ముందు మహా మానవహారం నిర్మించిన మహోద్యమం దళిత ఉద్యమం.
బీసీ ఉద్యమాలు, స్త్రీవాద ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, ఉపకుల ఉద్యమాలు ఎన్నో దళిత ఉద్యమ ప్రేరణతో వచ్చాయి. భావ జాల చర్చతో పాటు ఆచరణాత్మకమైన కార్యక్రమం నిర్మాణం జరిగింది. ప్రత్యామ్నాయ భావజాల ఉద్యమాన్ని సాహిత్యాన్ని దళిత ఉద్యమం ముందుకు తీసుకువచ్చింది.
నీతి, నిజాయతీ, ఆచరణ, కార్యాచరణ, నిరంతర ఆధునీకరణలు దళిత ఉద్యమ గమనంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దళిత ఉద్యమం పేదరిక నిర్మూలనను, కుల నిర్మూలనను పరస్పర సంబంధితాలుగా భావించింది. కుల నిర్మూలనతో పాటు ఆర్థిక స్వావలంబన కోసం కూడా కృషి చేసింది.
ప్రభుత్వం కూడా ఉద్యమస్ఫూర్తితో దళితుల చైతన్యాన్ని అవగాహన చేసుకునే పరిస్థితులు వచ్చాయి. దళితుల్లో కళాకారులు, కవులు, ఉపన్యాసకులు, నిర్మాణ కర్తలు, ఆర్గనైజర్లు రూపొందారు. వీరికి అంబే డ్కర్, మహాత్మా ఫూలే, బుద్ధుడు వంటివారి భావధారలే బలం.
అంబేడ్కరిజం సత్యం అనే పునాది మీద నిలబడి మాట్లాడగల్గే ధైర్యంతో నాలుగు దశాబ్దాల్లో కొన్ని లక్షల మందిని తీర్చిదిద్దింది. దళిత మహిళలు భూ పోరాట ఉద్యమాలను నడిపారు. యువకులు క్రమశిక్షణ కల్గిన సైనికులుగా రూపొందారు. మేధావులు ఎన్నో పరిశో ధనల ద్వారా భారతదేశ పునఃనిర్మాణానికి పూనుకున్నారు. నాలుగు దశాబ్దాల దళిత ఉద్యమ ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకొని సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ, తాత్విక ప్రత్యామ్నాయ నిర్మాణానికి అందరం పూనుకోవాల్సిన సందర్భంలో ఉన్నాం.
ఈ జూలై 17 నాటికి కారంచేడు ఉద్యమం ప్రారంభమై 40 ఏళ్ళు! చుండూరు ఉద్యమం 1991లో జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నాటికి ఈ సందర్భంగా ఒక పెద్ద మహాసభ జరిపి భవిష్యత్తు కార్యాచరణ మీద విస్తృతమైన చర్చ చేయాలనేది ఆలోచన. ఈ చర్చలు ఒక శతాబ్ది కాలానికి దిక్సూచి అవ్వాలి. అంబేడ్కర్ ఇచ్చిన స్ఫూర్తి కొన్ని తరాలు, యుగాలకు ఊపిరిగా నిలుస్తుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వేలు, లక్షలమంది ఉద్యమంతో కలిసి నడిచారు. ఇది ఏ ఒక్కరో నడిపిన ఉద్యమం కాదు. ఇది సమూహ ఉద్యమం.
ఉద్యమం ఒక అనంత ప్రయాణం. అది ఆగదు. భవిష్యత్తు కార్యాచరణలు కాలానుగుణంగా రూపొందించి ముందుకు నడవాలి. ఇది అంబేడ్కర్ బాట. దీనికి నిరంతర కార్యాచరణే ఊపిరి. ఆ దిశగా నడుద్దాం. అందరం ఏకమై మహా సంఘటిత శక్తిగా నడుద్దాం. ప్రతి ఒక్క దళిత బహుజనుడు ఉద్యమకారుడే. అంబేడ్కర్ ఆలోచన విధానమే దళిత ఉద్యమానికి స్ఫూర్తి.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695
(జూలై 17 నాటికి కారంచేడు ఉదంతానికి 40 ఏళ్లు.)