
సందర్భం
బాగా ఇష్టమైన ఇల్లు కాలి బూడిదైతే... ఆ బూడిదను చూస్తూ ఏడుస్తూ కూర్చోలేము. ఒక్కో ఇటుక పేరుస్తూ కొత్త ఇంటికి సిద్ధం అవుతాము. జార్జియా మెలోని అలాగే చేసింది. కుటుంబ కల్లోలాన్ని మనసుపైకి రానివ్వకుండా తిరుగులేని నాయకురాలిగా ఎదిగింది. ఇటలీ తొలి మహిళా ప్రధాని అయింది. ఆమె ఆత్మకథ ‘ఐయామ్ జార్జియా – మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్ (ఇండియన్ ఎడిషన్)కు ప్రధాని నరేంద్ర మోదీ ముందుమాట రాశారు.
కొన్ని నెలల క్రితం అల్బేనియాలో జరిగిన ఒక సదస్సులో వివిధ దేశాల నేతలు హాజరయ్యారు. ఈ సదస్సుకు హాజరైన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి అల్బేనియా అధ్యక్షుడు స్వాగతం పలికిన తీరు వైరల్ అయింది. కారు దిగి వస్తున్న మెలోనికి వర్షంలో మోకాళ్లపై కూర్చొని నమస్కారం చెబుతూ ఆయన స్వాగతం పలికిన తీరు ప్రపంచాన్ని ఆకట్టుకుంది.
న్యూయార్క్‌లో జరిగిన ఒక అవార్డ్‌ల కార్యక్రమంలో... ‘మెలోని నిజాయితీపరురాలు. ఆమె మనసు అందమైనది’ అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఇటలీలో జరిగిన జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీని ‘నమస్తే’ అంటూ మెలోని స్వాగతం పలకడం వైరల్‌గా మారింది.
ఒక్క మాటలో చె ప్పాలంటే... జార్జియా మెలోని అనేది ‘ప్రధాన ఆకర్షణ’కు మరో పేరు.
అయితే ఆమె ప్రస్థానం నల్లేరు మీద నడక కాదు. ఒక్కో అడుగు వేస్తూ ప్రయాణం ప్రారంభించింది. ఆ ప్రయాణంలో ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ముందుకు వెళ్లింది.
‘ఐయామ్ జార్జియా–మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్’ను ఒక అధ్యక్షురాలి ఆత్మకథగా మాత్రమే చూడనక్కర్లేదు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఇటలీ తొలి మహిళా అధ్యక్షురాలి స్థాయికి ఎదగడం అనేది సామాన్య విషయమేమీ కాదు. ధైర్యంలో, ఆత్మవిశ్వాసంలో, సానుకూల శక్తి విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలకు స్ఫూర్తినిస్తోంది మెలోని.
రోమ్‌లో పుట్టి గార్బటెల్లా జిల్లాలో పెరిగింది మెలోని. చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే మెలోని తండ్రి, కుటుంబాన్ని విడిచి కానరీ దీవులకు వెళ్లాడు. అక్కడ మరో వివాహం చేసుకున్నాడు. మెలోనికి పదిహేడేళ్లు ఉన్నప్పుడు ఆమె తండ్రి మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు.
తండ్రి దూరం అయ్యాడు. తమకు ఇష్టమైన ఇల్లు అగ్నిప్రమాదంలో నాశనం అయింది. బాల్యం, కుటుంబ విచ్ఛిన్నం తన రాజకీయ దృక్పథాన్ని ప్రభావితం చేశాయని తన ఆత్మకథలో రాసుకుంది మెలోని. పొలిటికల్ పార్టీ ఇటాలియన్ సోషల్ మూమెంట్ (ఎంఎస్‌ఐ) యువ విభాగం ‘యూత్ ఫ్రంట్’లో చేరడంతో మెలోని రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తరువాత కాలంలో ‘స్టూడెంట్ మూవ్‌మెంట్’ నేషనల్ లీడర్‌గా ఎదిగింది. ప్రావిన్స్ ఆఫ్ రోమ్’ కౌన్సిలర్‌గా పనిచేసింది. ‘యూత్ యాక్షన్’ అధ్యక్షురాలిగా ఎంపికైంది... ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇటలీ తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించింది.
మోదీ ముందుమాట
‘దేశభక్తి ఉట్టిపడే అత్యత్తమ నాయకురాలు’ అని ‘ఐయామ్ జార్జియా – మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్’ పుస్తకానికి రాసిన ముందు మాటలో మన ప్రధాని నరేంద్ర మోదీ మెలోనిని కొనియాడారు. ఆమె వ్యక్తిగత, రాజకీయ ప్రయాణం గురించి వివరించారు. మెలోని ఆత్మకథను ‘మన్‌కీ బాత్’లో చె ప్పారు. ‘‘ఇటలీ ప్రధాన మంత్రి మెలోనిపై అభిమానం, స్నేహంతో ఈ ముందుమాట రాశాను. దీన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఆమె స్ఫూర్తిదాయకమైన, చారిత్రక ప్రయాణం భారత్‌లో ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది’’ అని తన ముందు మాటలో రాశారు మోదీ. గతంలో రెండు పుస్తకాలకు మాత్రమే మోదీ ముందు మాట రాశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆనందీబెన్ పటేల్‌కు అంకితం ఇచ్చిన పుస్తకానికీ, ప్రముఖ బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలిని ఆత్మకథకు గతంలో ముందుమాట రాశారు.