
పెళ్లైన రెండు సంవత్సరాలకే నిర్మల్ చందేల్ భర్త చనిపోయాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీకి చెందిన నిర్మల్‌కు ఒకవైపు తట్టుకోలేని దుఃఖం, మరోవైపు ఎన్నో ఆంక్షలు. నిర్మల్ అలంకరించుకోవడానికి లేదు. కొత్త దుస్తులు ధరించడానికి లేదు. బయటికి వెళ్లడానికి లేదు. ఉత్సవాలు, వేడుకలలో పాల్గొనడానికి లేదు.
ఆంక్షల వల్ల తనలో విషాదం మరింత ఎక్కువ అయింది. కొంతకాలానికి ఆమె పుట్టింటికి వెళ్లింది. కాస్త ఉపశమనంగా అనిపించింది. సోలన్ జిల్లాలోని ఒక స్వచ్ఛంద సంస్థలో అకౌంటెంట్‌గా చేరింది. ఉచిత భోజనంతో పాటు వసతి సౌకర్యం కూడా ఉండేది. అక్కడ తనలాగే ఎంతోమంది ఒంటరి మహిళలు ఉంటున్నారు. వారు కూడా తనలాగే ఎన్నో బాధలు అనుభవించారు.
చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు. ఏక్లా నారీ శక్తి సంఘటన్ (ఇఎన్‌ఎస్‌ఎస్) అనే స్వచ్ఛంద సంస్థ హిమాచల్‌ప్రదేశ్ చాప్టర్‌కు ప్రాతినిధ్యం వహించడంతో నిర్మల్ జీవితం కొత్త మలుపు తీసుకుంది. ఈ చాప్టర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 19,445 సభ్యులు ఉన్నారు. 1999లో 350 మంది ఒంటరి మహిళలతో జైపూర్‌లో ప్రారంభమైన ఏక్లా నారీ శక్తి సంఘటన్‌లో ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాలలో 2,50,000 మంది మహిళలు ఉన్నారు. రాజస్థాన్‌లో అత్యధిక సంఖ్యలో 1,02,000 మంది సభ్యులు ఉన్నారు.
సభ్యులు ఆర్థికంగా సొంత కాళ్లమీద నిలబడేలా చేయడం నుంచి వారి ఆరోగ్య సంరక్షణ వరకు ఎన్నో విషయాలలో కృషి చేస్తోంది ఏక్లా నారీ శక్తి సంఘటన్. మన దేశంలో ఒంటరి మహిళల (సింగిల్ ఉమెన్) సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఒంటరి మహిళల సంఖ్య 2011లో 51.2 మిలియన్‌లు ఉండగా 2024కు 71.4 మిలియన్‌లకు చేరింది.
(చదవండి: పేపర్ పువ్వులతో భారత సంతతి మహిళ గిన్నిస్ రికార్డు..!)