రోగిని చావబాదిన వైద్యుడు
సిమ్లా: ప్రాణం పోయాల్సిన చోట.. ప్రాణభ యం నీడలా వెంటాడింది. రోగికి అండగా ఉండాల్సిన వైద్యుడే.. యమధర్మరాజులా విరుచుకుపడ్డాడు. సిమ్లా (హిమాచల్ ప్రదేశ్)లోని అ త్యంత ప్రతిష్టాత్మకమైన ఇందిరాగాంధీ వైద్య కళాశాల (ఐజీఎంసీ) ఆసుపత్రి ఒక అమాన వీయ ఘటనకు వేదికైంది. ఊపిరి అందక విలవిల్లాడుతున్న రోగికి వైద్యం అందించాల్సింది పోయి, రౌడీలా మారి ముష్టిఘాతా లు కురిపించాడొక వైద్యుడు. ప్రస్తుతం సోష ల్ మీడియాను కుదిపేస్తున్న ఆ వీడియోను చూస్తుంటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది!
అసలేం జరిగిందంటే..
అర్జున్ పవార్ అనే వ్యక్తి ఎండోస్కోపీ పరీక్ష కోసం ఐజీఎంసీకి వచ్చాడు. పరీక్ష పూర్తయ్యాక అతనికి శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఆయాసంతో ఊపిరాడక, కాస్త ఉపశమనం కోసం పక్కనున్న వార్డులోని ఒక ఖాళీ బెడ్‌పై పడుకున్నాడు. అదే అతను చేసిన ’నేరం’. విధి నిర్వహణలో ఉన్న ఒక వైద్యుడు అక్కడికి వచ్చి, ’నా బెడ్ మీద ఎందుకు పడుకున్నావు?’ అంటూ రోగితో వాగ్వాదానికి దిగాడు.
వైద్యానికి బదులు.. దెబ్బల వర్షం
రోగి పరిస్థితిని అర్థం చేసుకోవలసింది పోయి, ఆ వైద్యుడు దురుసుగా వ్యవహరించాడు. మాటామాటా పెరగడంతో సహనం కోల్పోయిన సదరు వైద్యుడు, రోగిపై భౌతిక దాడికి దిగాడు. అస్వస్థుడైన ఆ రోగిని కనికరం లేకుండా కొట్టడం అక్కడి వారిని విస్మయానికి గురిచేసింది. ఈ దృశ్యాలన్నీ ఎవరో వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కట్టలు తెంచుకున్న ఆగ్రహం
ఈ దాడి వార్త తెలియగానే బాధితుడి బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. సదరు వైద్యుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితుని కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం మరింత తీవ్రరూపం దాలి్చంది.
విచారణకు సీఎం ఆదేశం
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ సంఘటనను.. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖి్వందర్ సింగ్ సుఖు తీవ్రంగా పరిగణించారు. వెంటనే నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అటు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ రావు స్పందిస్తూ.. దీనిపై అంతర్గత విచారణ కమిటీని వేశామని, తప్పు తేలితే కఠిన చర్యలు తప్పవని హామీ ఇచ్చారు. ఆ విచారణ నివేదికలో ఏం తేలుతుందో.. ఆ ’ముతక’ వైద్యుడికి ఎలాంటి శిక్ష పడుతుందో వేచి చూడాలి.


