సంక్రాంతి దుస్తుల విక్రయాల్లో కీలకంగా అతివలు
షాపింగ్‌మాల్స్ ఇతర దుకాణాల్లో విపరీతమైన రద్దీ
ఓపికతో వ్యవహరించిన ‘సేల్స్ గర్ల్స్’
పండగ దుస్తుల వ్యాపారంలో వీరి పాత్రే కీలకం
శ్రీకాకుళం కల్చరల్: పండగ ముగిసిపోయింది. షాపింగ్‌లు అయిపోయాయి. ఎవరికి నచ్చిన దుస్తులు వారు తీసుకున్నారు. ఆ హడావుడి.. ఆ రద్దీ.. ఆ తోపులాటల మధ్య చాకచక్యంగా వ్యవహరించిన అతివలు కొందరున్నారు. ఎంతమంది వచ్చినా ఓపికతో దుస్తులు చూపించి నచ్చింది చేతికిచ్చి పంపించారు. ఓర్పుతో నేర్పుగా పండగ వ్యాపారాన్ని ఒంటి చేత్తో గట్టెక్కించారు. నిజానికి వీరిని ‘సేల్స్ గర్ల్స్’ అని పిలవడం చాలా చిన్న మాట. ఇలా ఓర్పు, నేర్పు ఉన్న మహిళలు పెద్దపెద్ద మాల్స్‌లో ఉద్యోగినులుగా వ్యవహరిస్తూ కొనుగోలుదారులను మెప్పించి అక్కడే దుస్తులు కొనేలా ఒప్పిస్తున్నారు. చీర సెలెక్టు చేయడానికి వచ్చే వారు కూడా మహిళలే కావడంతో ఎన్నో రకాలు ఎంచుతుంటారు. వాళ్లకి ఎంతో ఓపికగా అన్ని రకాలు చూపిస్తూ వారి మనసును గెలుచుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు అక్కడ పనిచేస్తున్న సేల్స్ గర్ల్స్. కొత్తగా వచ్చిన చీరల కోసం పరిచయం చేయడం, ఏ రంగు కట్టుకుంటే బాగుంటుంది వంటి అంశాలను వారికి తెలియచేస్తూ అమ్మకాలను సాగించారు.
జిల్లా కేంద్రంలో 10 షాపింగ్ మాల్స్, వందకుపైగా పెద్ద చీరల షాపులు ఉన్నాయి. వాటిలో 70 శాతం మంది మహిళలే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా వందల్లో దుకాణాలు ఉన్నారు. వీటిలో మగవారు ఉన్నా వారు అకౌంటింగ్ సెక్షన్‌లకే పరిమితం అవుతున్నారు. కొనేవారు వచ్చిన దగ్గర నుంచి వారికి స్వాగతం పలుకుతూ, వారికి ఏం కావాలో అడిగి తెలుసుకుని నచ్చిన వస్తువులు ఇచ్చి పంపించే బాధ్యతను ‘సేల్స్ గర్ల్స్’కు అప్పగిస్తున్నారు. దీంతో కొనుగోలుదారుల ఇష్టాఇష్టాలు తెలుసుకుని వారికి నప్పే దుస్తులు తెప్పించి ఒప్పించి మెప్పించే బాధ్యతను ఈ మహిళలు అలవోకగా చేశారు.
నేను టీచర్ ట్రైనింగ్ అయ్యాను
గత ఏడాదిగా సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తున్నాను. టీచర్ ట్రైనింగ్ (డీఈడీ) పూర్తిచేశాను. కోచింగ్ తీసుకొని డీఎస్సీ రాశాను. ఖాళీగా ఉండకుండా ఈ ఉద్యోగం చేస్తున్నాను. ఎంతో ఓపికతో కస్టమర్లకు బట్టలు చూపిస్తాం.
– సంతోషలక్ష్మీ, పొందూరు
ఏడేళ్లుగా పనిచేస్తున్నాను
ఈ సేల్స్ విభాగంలో ఏడేళ్లుగా పనిచేస్తున్నాను. కస్టమర్లకు కావాల్సిన చీరలను చూపించే స్టాల్ వద్దకు మర్యాదపూర్వకంగా తీసుకెళ్లడం నా బాధ్యత. వారు కొనుగోలు చేసే విధంగా అన్ని రకాలు చూపిస్తాం. నా ఇద్దరు పిల్లలను ఈ సంపాదనతో చదివిస్తున్నా.
– హేమలత, హడ్కో కాలనీ
కువైట్‌లో పనిచేసేదాన్ని
నేను ముందులో కువైట్‌లో పనిచేసేదాన్ని. మా నాన్నగారు చనిపోయాక మా అమ్మకి చెల్లికి తోడుగా ఉండాలని వచ్చేశాను. ఈ ఉద్యోగంతో మా చెల్లిని చదివిస్తున్నా. ఆమె ప్రస్తుతం పీజీ చదువుతోంది. నేను పదేళ్లుగా ఈ సేల్స్ రంగంలో పనిచేస్తున్నాను. అమ్మకి తోడుగా ఉంటున్నాను.
– లీలారాణి, ఇలిసిపురం


