సంకల్ప బలముంటే.. ప్రతీది సాధ్యమే..! | Telangana Women Judges Breaking Barriers: Stories of Courage and Success | Sakshi
Sakshi News home page

సంకల్ప బలముంటే.. ప్రతీది సాధ్యమే..!: మహిళా న్యాయమూర్తులు

Oct 27 2025 11:02 AM | Updated on Oct 27 2025 2:56 PM

Number Of Women Lawyers And Judges is increasing in Telangana

యువరానర్‌.. అనాలనేది చాలా మంది కల. కానీ యువరానర్‌ అనిపించుకునే స్థాయిలో ఉండేవారు కొందరే. ఆ కొందరిలోనూ మహిళలు తక్కువగా కనిపిస్తుంటారు. కానీ తెలంగాణ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటీవల మహిళా జడ్జీలు.. లాయర్ల సంఖ్య పెరుగుతుంది. రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తులు మహిళలే. ఆత్మస్థైర్యంతో విజయం సాధిస్తే.. మనోధైర్యంతో వృత్తిలో రాణిస్తున్నామంటున్నారు మహిళా జడ్జిలు. వీరిపై ప్రత్యేక కథనం.

ఆత్మస్థైర్యంతో ముందుకు.. సునీత కుంచాల, పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి
లక్ష్య సాధనలో  ఆటుపోట్లు ఎదురైనా మనోధైర్యంతో ముందుకెళ్లి విజ యం సాధించారు పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల. సునీత తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. తండ్రి గురువులు ఉపాధ్యాయుడిగా, తల్లి జయకుమారి ప్రభుత్వాస్పత్రిలో నర్సు. ఇంటర్మీడియట్‌ పూర్తి కాగానే చిన్న వయసులోనే సునీతకు వివాహమైంది. భర్త, తల్లిదండ్రుల సహకారంతో డిగ్రీ, పీజీ ప్రైవేట్‌గానే పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలయ్యారు. 

ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణురాలు అ య్యారు. సునీత ఆడపడుచు జడ్జీ కావడంతో తాను కూడా జడ్జీ కావాలనే లక్ష్యం పెట్టుకొని.. శ్రమించా రు. 2003లో జడ్జీ పోస్టుకు పరీక్ష రాసి.. ఇంటర్వ్యూ దాకా వెళ్లి త్రుటిలో ఉద్యోగావకాశాన్ని చేజార్చుకున్నారు. ఓటమితో నిరాశచెందకుండా మళ్లీ ప్రయత్నించారు. 2013లో జూనియర్‌ సివిల్‌జడ్జిగా ఎంపికయ్యారు. జిల్లా జడ్జీ కావాలనే కాంక్ష వెంటాడడంతో అదే ఏడాది పడ్డ నోటిఫికేషన్‌లో ఒకే పోస్టు ఉండడంతో కష్టపడి చదివి విజయం సాధించారు. 
పోక్సో నేరాలకు కఠిన శిక్షలు
జిల్లా జడ్జిగా హైదరాబాద్‌లోని స్పెషల్‌ కోర్టులో రెండేళ్లపాటు పనిచేసిన కాలంలో 84 పోక్సో కేసుల్లో తీర్పునిచ్చారు. 10 కేసుల్లో జీవితఖైదు విధించారు. పెద్దపల్లి జిల్లా జడ్జిగా భాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు కేసుల్లోనూ తీర్పులిచ్చారు. నిజామాబాద్‌ జిల్లాలో పనిచేసే సమయంలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లకు ఆఫీసు సబార్డినేటర్లుగా ఉద్యోగావకాశాన్ని కల్పించడం సంతోషాన్ని ఇచ్చిందంటారు 

సునీత కుంచాల. నిజామాబాద్‌లో పనిచేసిన కాలంలో 14 వేల మందికి కరాటేలో శిక్షణ ఇప్పించారు. నిజామాబాద్‌లోని బాలసదనంలోని విద్యార్థుల ఇబ్బందిని గుర్తించి ప్రైవేట్‌ స్కూల్‌లో ఉచిత విద్య అందించేలా ట్రస్టు ఏర్పాటు చేయించడం సంతృప్తినిచ్చిందంటారు.

కష్టాలు ఎదురైనా కుంగిపోలేదు: తడిగొప్పుల ప్రవిళిక, జూనియర్‌ సివిల్‌ జడ్జి, పిడుగురాళ్ల
తన ప్రయాణంలో కష్టాలు, కన్నీళ్లు అనేకం ఉన్నాయని పిడుగురాళ్ల జూనియర్‌ సివిల్‌ జడీ్జగా విధులు నిర్వర్తిస్తున్న తడిగొప్పుల ప్రవళిక తెలిపారు. వేములవాడ ప్రాంతంలోని కొదురుపాకకు చెందిన ప్రవళిక జడ్జీగా ఎంపికయ్యే క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇంటర్‌ వరకు కరీంనగర్‌లో చదువుకున్నారు. 2020లో పీజీ లాసెట్‌లో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన ప్రవళిక క్లాట్‌ ద్వారా నల్సార్‌ విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌ఎం చదివారు. అనంతరం మొదటి ప్రయత్నంలోనే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. 

వ్యవసాయ కుటుంబం. వివాహమైన తర్వాత తల్లిదండ్రులు, అత్తారింటి వారి సహకారంతో చదువు పూర్తి చేయడంతోపాటు జడ్జిగా ఎంపికయ్యారు. జడ్జిగా ఎంపికవ్వాలంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వూ్యలను విజయవంతంగా పూర్తి చేయాల్సిందే. వీటన్నింటిని విజయవంతంగా పూర్తి చేయాలంటే హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులపై పూర్తి అవగాహన ఉండాలి. లాయర్‌గా వృత్తిలో రాణించాలంటనే నిత్య విద్యార్థి మాదిరిగా కొత్త అంశాలను నేర్చుకుంటూ ఉండాల్సిందేనని ప్రవళిక తెలిపారు.

ఆత్మవిశ్వాసంతోనే విజయం: గడ్డం వందన, జూనియర్‌ సివిల్‌ జడ్జి,వేములవాడ  
అమ్మాయిలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా.. కష్టపడితే ఏదైనా సాధిస్తారని వేములవాడకు చెందిన జూనియర్‌ సివిల్‌ జడ్జి గడ్డం వందన నిరూపించారు. జడ్జీ అంటే కేవలం ఉద్యోగమే కాదని.. జీవన విలువలు.. సమాజాన్ని అర్థం చేసుకోవడమని ఆమె అంటున్నారు. వేములవాడకు చెందిన వందన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నందిగామ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 

సవాళ్లను స్వాగతించాలి
వందన తల్లిదండ్రులు గడ్డం శైలజ, సత్యనారాయణరెడ్డి. వేములవాడలో 10వ తరగతి వరకు చదువుకున్న వందన ఇంటర్‌ హైదరాబాద్‌లో, లా కోర్సు మహాత్మాగాంధీ న్యాయ కళాశాలలో పూర్తి చేశాను. న్యాయవిద్యలో పీజీని ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. 

ఎల్‌ఎల్‌ఎం పూర్తయ్యాక జ్యుడీషి యల్‌ ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ అయ్యారు. మొదటి ప్రయత్నంలోనే 2022లో ఆంధ్రప్రదేశ్‌ కర్నూల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. చదువుతోపాటు క్రమశిక్షణ ఉంటేనే విజయం సాధిస్తామని వందన అంటున్నారు.

(చదవండి: ఫ్యాషన్‌ సెన్స్‌.. కారాదు నాన్‌సెన్స్‌..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement