నగరం.. ఫ్యాషన్‌కి.. కొత్త ట్రెండ్స్‌కి కేంద్ర బిందువు. అయితే దీనిని పాటించడానికీ ఫ్యాషన్ సెన్స్ ఉండాలి.. అయితే ఆ సెన్స్ నాన్‌సెన్స్ కాకూడదని పలువురు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఫ్యాషన్, ట్రెండ్ పేరుతో ఇష్టారీతిన ఫ్యాషన్ ఉత్పత్తులను వినియోగిస్తూ.. వాటిని భారీ స్థాయిలో డంప్ చేస్తున్నారు. దీంతో మనకు తెలియకుండానే ఈ డంప్ ప్రకృతిపై ప్రభావం చూపుతోంది.. మరీ ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో నిత్యం ఉత్పత్తయ్యే 9,000 టన్నుల వ్యర్థాల్లో 800 టన్నులు ఫ్యాషన్, వ్రస్తాలే ఉంటున్నాయని అంచనా.. వీటిలో చాలా వాటిని రీసైకిల్ చేయకుండానే డంప్ చేస్తున్నారని, ఇది పర్యావరణానికి ఓ సవాలుగా మారుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇష్టారీతిన ఫ్యాషన్ ఉత్పత్తులను వినియోగించేవారు రీసైకిల్/ ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను వినియోగించడం ఓ జీవన విధానంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.
యువతలో పెరుగుతున్న ఫాస్ట్ ఫ్యాషన్ ధోరణి పర్యావరణానికి ప్రధాన సవాలుగా మారుతోంది. అధునాత జీవనశైలి పేరుతో మనం ధరించే ప్రతి ఉత్పత్తి వెనుక ఎకో ఫ్రెండ్లీ సూత్రం దాగుంది. దానిని గ్రహించి ఉత్పత్తులు ఎంపిక చేసుకుంటే.. అటు ప్రకృతికి.. ఇటు భవిష్యత్తు తరాలకు మేలుచేసినట్లవుతుంది. ఇందుకు సామాజిక బాధ్యతతో పాటు.. ఎకో ఫ్రెండ్లీ జీవన విధానం అలవర్చుకోవాలని నినదిస్తున్నారు.
సింథటిక్ ఫ్యాబ్రిక్‌తో సమస్య..
మారుతున్న జీవనశైలికి అనుగుణంగా కొత్త దుస్తులు కొనడం, తరచూ ట్రెండ్స్ మార్చుకోవడం అలవాటుగా మారింది. మార్కెట్లో తక్కువ ధరకే దొరికే సింథటిక్ ఫ్యాబ్రిక్స్ డిమాండ్ పెరగడంతో ఉత్పత్తి పరిమాణం భారీగా పెరిగింది. ఇది అధిక వ్యర్థాలకు దారి తీస్తోంది. అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం ఫ్యాషన్ పరిశ్రమలు ప్రపంచవ్యాప్తంగా 10 శాతం కర్బన ఉద్గారాలకు, 20 శాతం నీటి కాలుష్యానికీ కారణమవుతోంది. ఒక జీన్స్ తయారీకి సగటున 7,000 లీటర్ల నీరు అవసరమవుతుందంటే కాలుష్యం తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు.
రీ యూజ్, రీ సైకిల్ పరిష్కారం..
గతంలో ఏ వస్తువునైనా పూర్తిగా వినియోగించి, రిపేర్ చేసుకొని, తదుపరి తరానికి
అందించే అలవాటు మన సంస్కృతిలో ఉండేది. అదే ‘స్లో ఫ్యాషన్’ భావన. నాణ్యమైన, దీర్ఘకాల మన్నిక కలిగిన వ్రస్తాలు వాడటం, వాడిన వాటిని ఇతర అవసరాలకు వినియోగించడం ద్వారా వ్యర్థాలను తగ్గించవచ్చు. హైదరాబాద్‌లో ఇటీవల ఔత్సాహిక యువత, స్టార్టప్‌లు ఈ మార్గాన్ని ఎంచుకున్నాయి.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ‘థ్రిఫ్ట్ మార్కెట్స్’ నిర్వహించి వాడిన దుస్తులను మళ్లీ అమ్మడం లేదా ఇతరులకు వితరణ చేయడం మొదలైంది. ఈ కల్చర్ ద్వారా ఫ్యాషన్ వ్యర్థాలు తగ్గుతాయి. సెలబ్రిటీలు కూడా ఈ మార్పుకు తోడ్పడుతున్నారు. నటి సమంతా ఆ మధ్య ఓ ఈవెంట్‌లో ‘రీయూజ్ వస్త్రాలు కూడా నా ఫ్యాషన్ స్టేట్మెంట్’ అని చెప్పడం ఆహా్వనించదగ్గ పరిణామం.
మోతాదుకు మించి..
హైదరాబాద్‌లో టైMð్ట్సల్ వేస్ట్ మోతాదుకు మించుతోంది. జీహెచ్‌ఎంసీ ల్యాండ్‌ఫిల్ ప్రాంతాల్లో రోజూ వందల టన్నుల పాత దుస్తులు, ఫ్యాబ్రిక్ డంప్ చేస్తోంది. వీటిలో 40 శాతం రీసైకిల్ చేయగలిగినవే అయినా, అవగాహన లేక నేరుగా భూమిలోకి వెళ్తున్నాయి. నిత్యం 720 నుంచి 800 టన్నుల టెక్స్‌టైల్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని నివేదికలు చెబుతున్నాయి.
సింథటిక్ ఫ్యాబ్రిక్‌లో ఉన్న నైలాన్, పాలిస్టర్ వంటి పదార్థాలు సహజంగా కరగవు. వీటి నుంచి విడుదలయ్యే మైక్రోఫైబర్లు నీటిని కలుషితం చేస్తున్నాయి. వ్రస్తాల్లో ఉపయోగించే రసాయనాలు, సింథటిక్ కలర్స్ చర్మవ్యాధులకు కారణమవుతున్నాయి.
ప్రత్యామ్నాయ మార్గాలు..
హ్యాండ్లూమ్, ఖాదీ, ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్ వంటి దేశీయ ఉత్పత్తులు పర్యావరణానికి కాస్త సహాయకారిణిగా ఉంటాయి. ఇవి సహజంగా భూమిలో కరిగిపోతాయి. రసాయనాల మోతాదు తక్కువగా ఉంటుంది. తెలంగాణ హ్యాండ్లూమ్ ఉత్పత్తులు, ఇక్కత్ శారీస్, నారాయణపేట ఫ్యాబ్రిక్స్, మంగళగిరి కాటన్ వంటి ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటమే కాక, కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. ముఖ్యంగా అవసరాన్ని బట్టి దుస్తులు కొనడం, మన్నికైన, నాణ్యమైన ఫ్యాబ్రిక్ ఎంపిక చేయడం, వాడిన బట్టలను దానం చేయడం, రీసైకిల్ సెంటర్లకు ఇవ్వడం..వంటి మార్పుకు నాంది పలకాలి.


