జెండర్‌ ‘బౌండరీ’ దాటిన ఫస్ట్‌ కామెంటేటర్‌ | India first female cricket commentator Chandra Nayudu special story | Sakshi
Sakshi News home page

జెండర్‌ ‘బౌండరీ’ దాటిన ఫస్ట్‌ కామెంటేటర్‌

Oct 14 2025 4:32 AM | Updated on Oct 14 2025 5:57 AM

India first female cricket commentator Chandra Nayudu special story

దారులు ఏర్పరచేవారెప్పుడూ ఒంటరిగానే బయలుదేరుతారు! చెప్పకనే ఆ బాటను పదిమందికీ గమ్యంగా మారుస్తారు. అలా పురుషుల రంగమైన క్రికెట్‌లో మహిళలను కామెంటరీ బాక్స్‌ వరకు  నడిపించిన వ్యక్తి చంద్ర నాయుడు.  ఆమెను పరిచయం చేస్తోంది ఈ వారం పాత్‌ మేకర్‌..

ఇప్పుడిప్పుడే క్రికెట్‌లో మహిళల ఉనికి, ఉన్నతి కనిపిస్తోంది. కామెంటరీ రంగంలోనూ మహిళా గళాలు వినిపిస్తున్నాయి. క్రికెట్‌ నేపథ్యం కాకపోయినా మందిరా బేడీ క్రికెట్‌ యాంకర్‌గా, కామెంటేటర్‌గా కనిపించి, వినిపించి కలకలం రేపింది. అంజుమ్‌ చో్రపా, ఇసా గుహా, లీసా స్థాలేకర్, స్నేహల్‌ ప్రధాన్‌ లాంటి క్రికెటర్స్‌ కూడా ఆట నుంచి రిటైరైపోయి కామెంటేటర్స్‌గా మారినవారే! వీళ్లందరికీ ఆ ధైర్యం, స్ఫూర్తిని పంచింది మాత్రం 1970ల్లోని క్రికెట్‌ ప్లేయర్‌..  చంద్ర నాయుడు. మగాళ్లే వినిపించే క్రికెట్‌ వ్యాఖ్యానంలోకి మైక్‌ పట్టుకుని వచ్చిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ఆ రంగంలో మహిళలు రావడానికి దారిని ఏర్పరచారు.

ఘనకీర్తి వారసత్వం
చంద్రనాయుడు.. దేశపు తొలి టెస్ట్‌మ్యాచ్‌ కెప్టెన్‌ కల్నల్‌ సీకే నాయుడు కూతురు. 1932లో లార్డ్స్‌ స్టేడియంలో మన దేశం ఇంగ్లండ్‌తో ఆడిన తొలి టెస్ట్‌మ్యాచ్‌లో మన జట్టుకు ఆయనే సారథ్యం వహించారు. అతని సోదరులైన సీఎల్‌ నాయుడు, సీఆర్‌ నాయుడు, సీఎస్‌ నాయుడు కూడా క్రికెటర్లే. అలా క్రికెట్‌ కుటుంబంలో పుట్టిన చంద్ర నాయుడు రక్తంలో కూడా క్రికేట్‌ ఉండటంతో ఊహ తెలియని వయసు నుంచే క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకున్నారావిడ. ఊహ తెలిసేప్పటికి ఆమె ఆసక్తి, ఇష్టం అన్నీ క్రికెటే అయ్యాయి. ప్రాక్టీస్‌తో ఆటలో ప్రావీణ్యం సంప్రాదించి దేశపు తొలితరం మహిళా క్రికెటర్లలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు.

సల్వార్, కమీజ్‌తో రోల్‌ మోడల్‌గా..  
ఇటు చదువు.. అటు ఆటలు.. రెండిట్లోనూ చంద్ర చురుకే! 1950ల్లో తన కాలేజీ రోజుల్లో ఉత్తరప్రదేశ్‌ క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. సల్వార్, కమీజ్‌తోనే క్రికెట్‌ ఆడేవారు ఆమె. ఈ ఆట కోసం ΄్యాంట్, షర్ట్‌ ధరించాల్సిన అవసరం ఉండదని, సంప్రదాయ దుస్తుల్లోనే చక్కగా ఆడొచ్చని తోటి అమ్మాయిలు గ్రహిస్తారని! క్రీడారంగంలో ముఖ్యంగా క్రికెట్‌లోకి వీలైనంత ఎక్కువ మంది అమ్మాయిలు రావాలని చంద్ర ఆశించారు. అందుకే స్పోర్ట్స్‌వేర్‌తో వాళ్లు వెనుకడుగు వేయకుండా తనను ఓ రోల్‌మోడల్‌గా చూపేందుకు ప్రయత్నించారు ఆమె.

ట్రయల్‌ బ్లేజర్‌
ఎన్నో విజయాల తర్వాత క్రికెట్‌ ఆట నుంచి ఆమె దృష్టి క్రికెట్‌ మ్యాచ్‌ వ్యాఖ్యానం మీదకు మళ్లింది. రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల కోసం రేడియోలో వ్యాఖ్యానం చెప్పడం మొదలుపెట్టారు. ఆల్‌ ఇండియా రేడియో కోసం కాకుండా స్టేడియంలో మ్యాచ్‌ చూస్తున్న ప్రేక్షకుల కోసం నేరుగా వ్యాఖ్యానం చేయాలని ఉత్సాహపడ్డారు. ఆ అవకాశం 1977లో వచ్చింది బాంబే (అప్పటి) – మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌తో! ఆ ఆటను వ్యాఖ్యానించడానికి స్టేడియంలో   తొలిసారిగా మైక్‌ పట్టుకున్నారు చంద్ర నాయుడు.  ఆ సందర్భమే ఆమెను తొలి మహిళా కామెంటేటర్‌ అనే ఖ్యాతిని తెచ్చి పెట్టింది. చరిత్రలో నిలిపింది. భారతీయ క్రికెట్‌ బ్రాడ్‌కాస్టింగ్‌లోనే ఓ సంచలనంగా మారింది.  ఇండియా, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన టెస్ట్‌ సిరీస్‌కి ఆల్‌ ఇండియా రేడియోలో ఆమె చెప్పిన వ్యాఖ్యానానికి బీబీసీ మేల్‌ కామెంటేటర్స్‌ అబ్బురపడ్డారట.

టీచర్‌గా ...
క్రికెట్‌ కామెంటరీ నుంచి రిటైరయ్యాక చంద్ర నాయుడు ఇండోర్‌ వెళ్లిపోయి.. అక్కడి ప్రభుత్వ మహిళా పీజీ కాలేజ్‌లో లెక్చరర్‌గా చేరారు. చివరి వరకు అక్కడే పనిచేసి ప్రిన్సిపల్‌గా రిటైరయ్యారు. ఆమె తండ్రి తొలి టెస్ట్‌ మ్యాచ్‌కి ఎక్కడైతే కెప్టెన్‌గా వ్యవహరించారో అక్కడే ఆ లార్డ్స్‌ స్టేడియంలోనే 1982లో ఇండియా, ఇంగ్లండ్‌కు మధ్య జరిగిన గోల్డెన్‌ జుబ్లీ టెస్ట్‌ మ్యాచ్‌కు చంద్ర నాయుడు ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. ఆమె ఇండోర్‌లో.. 2021, ఏప్రిల్‌లో తన 88వ ఏట తుదిశ్వాస విడిచారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement