తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు.. 66 శాతం మంది వారే! | Telangana Group 1 Results: 66 percent of new CTOs are women | Sakshi
Sakshi News home page

Group 1 Results: ఆ ఉద్యోగాల్లో 66 శాతం మంది వారే!

Sep 29 2025 5:31 PM | Updated on Sep 29 2025 6:19 PM

Telangana Group 1 Results: 66 percent of new CTOs are women

తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు ఇటీవ‌ల విడుద‌ల‌య్యాయి. నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన 14 నెల‌లోపే ఫ‌లితాల‌ను విడుద‌ల చేసి రికార్డు నెల‌కొల్పింది తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌. 562 మంది గ్రూప్ 1 ఉద్యోగాల‌కు ఎంపిక‌య్యారు. వీరికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శ‌నివారం నాడు హైద‌రాబాద్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో నియామ‌క ప‌త్రాలు అంద‌జేశారు. ఈసారి ఫ‌లితాల్లో మ‌హిళ‌లు గ‌ణ‌నీయ‌మైన పురోగ‌తి సాధించ‌డం విశేషం. జ‌న‌ర‌ల్ మెరిట్ టాప్ -10లో ఆరుగురు మ‌హిళ‌లు ఉన్నారు. ఇక టాప్‌-50లో 25 మంది, టాప్‌-100లో 41 మంది మ‌హిళ‌లు ఉన్నారు.

గ‌త కొన్నేళ్లుగా ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో మ‌హిళా ప్రాతినిథ్యం పెరుగుతూ వ‌స్తోంద‌ని గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ‌ వాణిజ్య ప‌న్నుల విభాగంలో మ‌హిళా అధికారుల సంఖ్య బాగా పెరుగుతోంది. తాజాగా వెల్ల‌డైన గ్రూప్‌-1 ఫ‌లితాల (Group 1 Results) ఆధారంగా క‌మర్షియ‌ల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు కొత్త‌గా కేటాయించిన ఉద్యోగుల్లో 66 శాతం మంది మ‌హిళ‌లు ఉన్నారు. శిక్ష‌ణ పూర్తైన త‌ర్వాత క‌మర్షియ‌ల్ ట్యాక్స్ ఆఫీస‌ర్లుగా జీఎస్టీ (GST) సంబంధిత వ్య‌వ‌హారాల‌ను వీరు ప‌ర్య‌వేక్షిస్తారు.

48 మందిలో 31 మంది వారే!
తెలంగాణ‌ వాణిజ్య ప‌న్నుల విభాగంలో ప్ర‌స్తుతం 8 మంది మ‌హిళా క‌మర్షియ‌ల్ ట్యాక్స్ ఆఫీస‌ర్లు (commercial tax officers) ఉన్నారు. గ‌త కొన్నేళ్లుగా ఈ డిపార్ట్‌మెంట్‌లో మ‌హిళ‌ల ప్రాతినిథ్యం పెరుగుతోందని సీనియ‌ర్ అధికారి కె. హ‌రిత తెలిపారు. 1990 ప్రాంతంలో త‌న బ్యాచ్‌లో తానొక్క‌రే మ‌హిళా సీటీవోగా ఉన్నాన‌ని గుర్తు చేసుకున్నారామె. తాజాగా ప్ర‌భుత్వం 48 మందిని సీటీవోలుగా నియ‌మించ‌గా, వీరిలో 31 మంది మ‌హిళ‌లు ఉండ‌టం విశేషం.

కీల‌క పోస్టుల్లో 24 మంది
క‌మర్షియ‌ల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో అదనపు కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్ల సహా 34 కీల‌క పోస్టులు ఉన్నాయి. వీటిల్లో 24 మహిళలు ఉన్నారు. 1996లో 8 మంది మ‌హిళ‌లు ఈ విభాగంలో చేరారు. అప్ప‌టి నుంచి క్రమంగా మ‌హిళా ఉన్న‌తోద్యోగుల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. రాష్ట్ర విభజన తర్వాత చాలా మంది అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోయారు. వీరిలో ఎక్కువ మంది పురుషులు ఉన్నారు. దీంతో తెలంగాణ వాణిజ్య విభాగంలో మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకుని తమదైన ముద్ర వేయడానికి అవకాశాలు ఏర్పడ్డాయి.

క‌మర్షియ‌ల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేసే వారికి మెరుగైన‌ విశ్లేషణాత్మక నైపుణ్యాలు అవసరమ‌ని సీనియ‌ర్ మ‌హిళా అధికారి ఒక‌రు అన్నారు. వాణిజ్య ప‌న్నుల‌కు సంబంధించిన నియ‌మ నిబంధ‌న‌లు తర‌చు మారుతుంటాయ‌ని, దానికి అనుగుణంగా ఉద్యోగులు అప్‌డేట్ కావాల్సి ఉంటుంద‌ని వివ‌రించారు. ఉద్యోగ, వ్య‌క్తిగ‌త జీవితాన్ని బాలెన్స్ చేసేవిధంగా ఉండ‌డం వ‌ల్లే ఎక్కువ మంది మ‌హిళ‌లు ఈ వాతావ‌ర‌ణంలో ప‌నిచేయ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నార‌ని వెల్ల‌డించారు.

చ‌ద‌వండి: ఒకేసారి 3 ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించిన మ‌హిళ‌

గ‌తంలో వాణిజ్య పన్ను శాఖ‌ కమిషనర్లుగా పనిచేసిన టికె శ్రీదేవి, నీతు ప్రసాద్ (Neetu Prasad) వంటి అధికారులు మ‌హిళా శ‌క్తిని చాటిచెప్పారు. సాంప్రదాయకంగా పురుషులు ఆధిపత్యం చెలాయించే ఉన్న‌త ఉద్యోగాల్లోనూ మ‌హిళ‌లు రాణిస్తున్నార‌ని చెప్ప‌డానికి వాణిజ్య పన్నుల విభాగం నిద‌ర్శ‌నంగా నిలుస్తోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement