
గ్రూప్–2, 3, 4 కొలువులు సాధించిన మహిళ
జోగులాంబ గద్వాల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్స్ ఫలితాల్లో జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన ఎం.జ్యోత్స్న ఒకేసారి గ్రూప్–2, 3, 4 ఉద్యోగాలు సాధించింది. జ్యోత్స్న ఇంటర్ చదువుతున్న సమయంలో 2017లో తల్లి, తండ్రి ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో ఒకేసారి మృతిచెందారు. అమ్మమ్మ గ్రామమైన మల్దకల్ మండలం ఎల్కూరులో 9వ తరగతి వరకు, 10వ తరగతి ఉలిందకొండలో, డోన్‌లో ఇంటర్ చదివింది.
ఇంటర్‌లో 970 మార్కులు సాధించిన జ్యోత్స్న ఢిల్లీలో అంబేడ్కర్ యూనివర్సిటీలో ఓపెన్ కేటగిరిలో సీటు రావడంతో 2021 వరకు అక్కడ చదివింది. చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన రవితో వివాహమైంది. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే గ్రూప్స్‌కు ప్రిపేరయ్యింది. ముందుగా గ్రూప్–4లో బీసీ వెల్‌ఫేర్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా జాబ్ వచి్చంది. అనంతరం గ్రూప్–3లో, గ్రూప్–2లో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ శాఖలో మండల పంచాయతీ ఆఫీసర్ (ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్)గా ఉద్యోగం సాధించింది.
కుటుంబ సభ్యుల సహకారంతోనే..
నేను ఈ స్థాయిలో ఉండేందుకు మా కుటుంబ సభ్యుల సహకారం చాలా ఉంది. ఏడాది వయస్సున్న బాబును ఇంటి వద్ద వదిలి హైదరాబాద్‌కు వెళ్లి చదువుకున్నాను. దీని వెనక నా కృషి, పట్టుదల ఎంతో ఉంది. ముఖ్యంగా భర్త రవి సహకారంతోపాటు అత్త, మామ, బావ, తోటికోడలు సహకరించారు.
ఎం.జ్యోత్స్న, చిన్నతాండ్రపాడు