సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల వేళ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు విస్తృతంగా నిర్వహించారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించినా మందుబాబులు మాత్రం వారి తీరు మార్చుకోలేదు. న్యూ ఇయర్ సందర్బంగా వేల సంఖ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి.
కొత్త సంవత్సరం సందర్బంగా తెలంగాణ పోలీసులు ఎంత హెచ్చరించినా మందుబాబులు మాత్రం లెక్కచేయలేదు. బుధవారం రాత్రి ఒక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. దీంతో, వారందరిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఇక, వనస్థలిపురంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. తనను ఓ కానిస్టేబుల్ కొట్టాడని రోడ్డుపై వాహనాలకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో బైక్ తాను నడపకపోయినా తనపై కానిస్టేబుల్ చెయ్యి చేసుకున్నాడని ఆరోపించాడు. తన స్నేహితుడి బైక్‌పై వెనకాల కూర్చున్నా అని.. తనను పట్టుకున్నారని.. బైక్ రేపు తెచ్చి ఇస్తానని చెప్పినా కానిస్టేబుల్ కొట్టడానికి వచ్చాడని సదరు వ్యక్తి ఆరోపించాడు. కొద్దిసేపు మద్యం మత్తులో రోడ్డు పై హల్‌చల్ చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
మరోవైపు.. ఇప్పటికే జనవరి తొలి వారమంతా ప్రత్యేక డ్రైవ్ ఉంటుందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపిన విషయం తెలిసిందే. మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానాతో పాటు వాహనాల జప్తు చేస్తామని హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని మందు బాబులకు సీపీ ముందే హెచ్చరించారు. అంతే కాకుండా మద్యం సేవించే వారు క్యాబ్ లేదా డ్రైవర్లను ఆశ్రయించాలని, వారు రైడ్‌కు నిరాకరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఫ్రీగా మందు బాబులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి నగరంలో 500లు దాకా ఫ్రీ సర్వీసులను ఏర్పాటు చేశారు. అందులో వారిని క్షేమంగా ఇంటి దగ్గర దారిబెట్టారు.

న్యూ ఇయర్ సందర్బంగా హైదరాబాద్ నగరవ్యాప్తంగా పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. శాంతి భద్రతల పరిరక్షణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తాగి వాహనాలు నడుపుతున్న వారి కోసం హైదరాబాద్ వ్యాప్తంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ముషీరాబాద్ డిపో సమీపంలోని ఆజామాబాద్ క్రాస్ రోడ్ వద్ద చిక్కడపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏడుకొండలు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పోలీసులను దూరం నుంచే చూసి పలువురు వెనక్కి తిరిగి పారిపోగా 15 మంది మందు బాబులు చిక్కినట్లు పోలీసులు తెలిపారు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి వద్ద కాచిగూడ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. హిమాయత్‌నగర్ వై-జంక్షన్ వద్ద చేపట్టిన తనిఖీలను ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ పర్యవేక్షించారు.


