 
													ఫోరెన్సిక్ ఫోటోగ్రాఫర్
‘బిందూ... బాడీ’... అని ఆమెకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. సాధారణంగా అర్ధరాత్రి సమయంలో. బిందు ఫ్రీలాన్స్ ఫోరెన్సిక్ ఫొటోగ్రాఫర్. రాత్రిళ్లు ప్రమాదాలు, నేరాలు జరిగినప్పుడు సీన్ దగ్గర ఉన్న మృతదేహాలను చట్టపరమైన సాక్ష్యాలకు ఉపయోగపడేలా ఫొటోలు తీయడం ఒక విద్య. ఆ విద్యలో ఆరితేరిన బిందు కేరళలో ఇప్పటికి 3000 కేసులకు ఫొటోగ్రాఫర్‌గా పని చేసింది. పురుషులైనా స్త్రీలైనా ధైర్యంగా చేయలేని ఈ పనిని చేసి చూపిస్తున్న బిందు పరిచయం.
కేరళ త్రిషూర్ జిల్లా కొడంగలూర్‌లోని బిందూ (46) ఇంటిలో అర్ధరాత్రి ఫోన్ మోగిందంటే ఆమెకు వెంటనే డ్యూటీ పడిందని అర్థం. ఎక్కడో ఏదో ప్రమాదం జరిగింది... నేరం జరిగింది.. సూసైడ్ కేసు... అక్కడకు వెళ్లి వెంటనే ఫొటోలు తీయకపోతే ఆ సాక్ష్యాధారాలు చెదిరిపోవచ్చు. అందుకే బిందు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
కెమెరా బ్యాగ్ భుజాన వేసుకుని మోటర్ సైకిల్ మీద బయలుదేరుతుంది. త్రిషూర్ జిల్లాలోని ఏడు పోలీస్ స్టేషన్లకు బిందూయే ఔట్‌సోర్స్ ఫొటోగ్రాఫర్. ఘటనా స్థలాలలో పోలీసులకు సహాయంగా, చట్టపరమైన పరిశోధనకు వీలుగా, న్యాయస్థానాల్లో ప్రవేశానికి అర్హమైన ఫొటోలు తీసే వారిని ‘ఇన్‌క్వెస్ట్ ఫొటోగ్రాఫర్’ అంటారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఇలాంటి ఫొటోగ్రాఫర్లు ఉంటారు. లేనప్పుడే సమస్య. త్రిషూర్‌లో బిందూయే చాలామందికి ఇన్‌క్వెస్ట్ ఫొటోగ్రాఫర్.
అనుకోకుండా ఒకరోజు
వి.వి.బిందుది కొడంగల్‌లో మధ్యతరగతి కుటుంబం. ఇంటర్ వరకూ చదివాక ఆర్థిక స్తోమత లేక చదువు మానేసి ఒక ఫొటోస్టూడియోలో రిసెప్షనిస్టుగా చేరింది. అక్కడ లైటింగ్ చేసే కుర్రాళ్లు యజమాని లేనప్పుడు కెమెరాతో ఎలా ఫొటో తీయాలో ప్రయోగాలు చేస్తుంటే అప్పుడప్పుడు వారితో పాటు కలిసి గమనించేది. తొలుత ఏ ఆసక్తి లేకపోయినా తర్వాత ఆసక్తి ఏర్పడి ఆరు నెలల్లో కెమెరా అంటే ఏమిటో ఫొటోలు ఎలా తీయాలో ఫండమెంటల్స్‌లో కొట్టినపిండి అయ్యింది. 
దాంతో యజమాని ఆమెను అప్పుడప్పుడు వెడ్డింగ్ షూట్స్‌కు పంపేవాడు. అయితే ఒకరోజు పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది... ఘటనా స్థలంలో ఫొటోలు తీయాలని. వేరే ఎవరూ దొరక్క బిందూను పంపాడు యజమాని. ఇది 2004లో జరిగింది. అది బావిలో మృతదేహం కేసు. అక్కడకు వెళ్లి ఫొటోలు తీసిన బిందు మళ్లీ ఆ పని జన్మలో చేయకూడదని నిశ్చయించుకుంది. ‘అలాంటి వృత్తిలో ఎవరు ఉంటారు?’ అంటుందామె. కాని మరి కొన్ని రోజులకు మళ్లీ ఫోన్ వచ్చింది. డబ్బు అవసరం ఆమెకు మళ్లీ కెమెరా పట్టుకుని వెళ్లేలా చేసింది.
విరామం తీసుకున్నా
పెళ్లయ్యాక ఈ పనికి విరామం ఇచ్చి 2008లో భర్తతో కలిసి బెంగళూరు వెళ్లిపోయింది బిందు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక భర్తతో విడిపోయి తిరిగి 2014లో కొడంగలూరుకు చేరుకుంది. వచ్చిన రోజే ఆమెకు మళ్లీ పోలీసుల నుంచి ఫోన్. ‘ఆశ్చర్యం ఏమిటంటే ఇన్నేళ్లలో నాలాగా ముందుకొచ్చిన ఫొటోగ్రాఫర్లు అక్కడ లేరు. నైపుణ్యం కూడా లేదు’ అందామె గర్వంగా. అందుకే పోలీసులు ఆమెను బతిమిలాడి తిరిగి పనిలో పెట్టారు. ఒక సి.ఐ. అయితే తన శాలరీ సర్టిఫికెట్ ఆమె లోను కోసం పూచీ పెట్టి 2 లక్షలు అప్పు ఇప్పించి మంచి కెమెరా కొనుక్కునేలా చేశాడు. ఇక బిందూ ఆగలేదు. పనిలో కొనసాగుతూనే ఉంది నేటికీ.
కేసుకు 2000 రూపాయలు
బిందు ఇప్పుడు ఏడు స్టేషన్లకు ఇన్‌క్వెస్ట్ ఫొటోగ్రాఫర్‌గా ఉంది. ‘నాకు రోజుకు యావరేజ్‌గా ఒకటి లేదా రెండు కేసులు వస్తాయి. వెళ్లి ఫొటోలు తీస్తాను. కేసుకు రెండు వేల రూపాయలు ఇస్తారు. ఘటనా స్థలికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ చూసినవన్నీ మైండ్‌లో నిండిపోతాయి. కాని ఇంటికి వచ్చి ఒక్కసారి పిల్లల్ని చూసుకున్నాక అన్నీ మర్చిపోతాను. నా పని ఎలా చేయాలో నాకు తెలుసు. సీనియర్ ఆఫీసర్లు నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు.
అప్పుడప్పుడు యంగ్ ఆఫీసర్లు ఇలా కాదు అలా అంటూ తెలివి ప్రదర్శిస్తారు. ఇవన్నీ మామూలే’ అంటుందామె. ఇంత భిన్నమైన వృత్తిలో ఇంతగా రాణిస్తున్న బిందూ గురించి బయటి లోకానికి తెలియదు. ఇటీవలే అక్కడి సీనియర్ ఫొటోగ్రాఫర్, నటుడు కె.ఆర్.సునీల్ ‘అసామాన్య సామాన్యుల’ పై ఒక పుస్తకం అక్కడ వెలువరించాడు. అందులో బిందూపై కూడా కథనం ఉంది. అలా ఆమె జీవితం అందరికీ తెలిసింది.
గుండె దడదడ
నేర/ప్రమాద ఘటనా స్థలాల్లోకి పోలీసులు వెళ్లడానికే జంకుతారు. అలాంటిది బిందు వెళ్లి ఊరికే చూసి రావడం కాదు... కొన్ని నిర్దేశిత యాంగిల్స్‌లో దగ్గరగా వెళ్లి తీయాలి. కొత్తల్లో ఆమెకు చాలా వొణుకుగా ఉండేది. ‘ఒకసారి భయంతో ఫ్లాష్ మర్చిపోయి వెళ్లాను. మళ్లీ తెచ్చుకొని తీయాల్సి వచ్చేది. మరోసారి కెమెరాలో రీల్ లోడ్ చేయడం మర్చిపోయాను. కాని రాను రాను మెల్లగా అన్నీ అలవాటయ్యాయి. ఏ వృత్తయినా ప్రొఫెషనలిజం వచ్చేంత వరకూ కష్టమే. ఆ తర్వాత అంతా నల్లేరు మీద నడకే’ అంటుంది బిందూ.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
