breaking news
out source
-
నీటి చార్జీలు ఔట్ సోర్సింగ్!
⇒ తొలుత గ్రేటర్ వరంగల్‌లో అమలు ⇒ పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ⇒ నల్లా బిల్లుల వసూళ్లు ⇒ 6.90 శాతానికి తగ్గడమే కారణం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నల్లా బిల్లుల వసూళ్ల బాధ్యతను ఔట్సోర్సింగ్ సంస్థలకు అప్పగించనున్నారా..? నగరాలు, పట్టణాల్లో నల్లా బిల్లుల వసూళ్లు అంతంత మాత్రంగా ఉండటంతో ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలి స్తోందా..? దీనికి అవుననే సమాధానం వినిపిస్తోంది. నీటి బిల్లుల వసూళ్లలో పురపాలక సంఘాలు విఫలమవుతున్న నేపథ్యంలో ఆ బాధ్యతలను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించాలనే ఆలోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ మినహా.. రాష్ట్రంలోని ఇతర నగర, పట్టణాల్లో బిల్లుల వసూళ్లు ఇప్పటివరకూ 6.90 శాతమే వసూలవ్వడంతో ప్రభుత్వం ఔట్ సోర్సింగ్‌పై దృష్టి సారించినట్టు సమాచారం. 1 నుంచి ‘రెవెన్యూ’ పర్యవేక్షణ జనాభా ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఉన్న గృహాల సంఖ్యతో పోలిస్తే అధికారిక నల్లా కనెక్షన్ల సంఖ్య తక్కువగా ఉంది. ఉన్న అధికారిక కనెక్షన్ల నుంచి సైతం సక్రమంగా బిల్లుల వసూళ్లు లేవు. నీటి బిల్లుల వసూళ్లను పర్యవేక్షిస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది ఇతర బాధ్యతలు, పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పురపాలక శాఖ జరిపిన అంతర్గత సమీక్షలో నల్లా బిల్లుల వసూళ్ల బాధ్యతను రెవెన్యూ వి భాగాలకు బదలాయించారు. సెప్టెంబర్ 1 నుంచి నల్లా బిల్లుల బాధ్యతలను మున్సిపాలిటీల రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షించనున్నారు. నల్లా చార్జీల వసూళ్లను ఔట్ సోర్సింగ్‌కు అప్పగిస్తే బిల్లుల ఎగవేతలను నివారించవచ్చనే అంశంపైనా ఈ సమీక్షలో చర్చించినట్లు తెలిసింది. తొలుత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దీనిని అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇక ఆన్లైన్లో నల్లా బిల్లులు.. నల్లా బిల్లుల వసూళ్లు, బకాయిలకు సంబంధించిన సరైన రికార్డులు మున్సిపాలిటీల వద్ద లేవు. బిల్లుల వసూళ్లలో లొసుగులను దాచిపెట్టేందుకు స్థానిక సిబ్బందే రికార్డులను మాయం చేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఇకపై ఇలా జరగకుండా నల్లా బిల్లుల వసూళ్లను సైతం ఆన్లైన్ చేయాలని నిర్ణయించారు. అక్రమాలను నియంత్రించడానికి ఆస్తి పన్నులు, ఇతరత్రా వసూళ్లను ఏ రోజుకు ఆరోజు ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి నీటి బిల్లుల వసూళ్లను సైతం ఆన్లైన్లో ఎంట్రీ చేయనున్నారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదు నల్లా బిల్లులను ఔట్ సోర్సింగ్ చేయాలన్న అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటి వరకు జరిగిన బిల్లుల చెల్లింపులు, బకాయిల రికార్డులను ఆన్లైన్ వెబ్సైట్లో పొందుపరుస్తున్నాం. ఆ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. - శ్రీనివాస్‌రెడ్డి జాయింట్ డెరైక్టర్, పురపాలక శాఖ -
709 తాత్కాలిక ఉద్యోగాలు
హైదరాబాద్ సిటీ: తెలంగాణ తాగునీటి సరఫరా పథకం(వాటర్‌గ్రిడ్) నిర్మాణ బాధ్యతలను చేపట్టిన గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యుఎస్)లో తాత్కాలిక ఉద్యోగాలకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేసేందుకు సిబ్బంది కొరత ఏర్పడిన నేపథ్యంలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి మంగళవారం సర్క్యులర్ జారీచేశారు. ఆర్‌డబ్ల్యుఎస్‌లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 47 సీనియర్ అసిస్టెంట్ల స్థానాల్లో 47మంది జూనియర్ అసిస్టెంట్లను, వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ పనుల పర్యవేక్షణ నిమిత్తం కొత్తగా 662 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను నియమించుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీర్ ఇన్ ఛీఫ్‌ను సర్కారు ఆదే శించింది. ఉద్యోగాలకు అర్హతలు ఇలా.. ప్రభుత్వం జారీచేసిన ఔట్ సోర్సింగ్ నియమ నిబంధనల మేరకే జూనియర్ అసిస్టెంట్ నియామకాలు, వారి వేతనాలు ఉండాలని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. వర్క్ ఇన్స్పెక్టర్ల పోస్టుల భర్తీ విషయంలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం చేపట్టి, రోజువారీగా కన్సాలిడేటెడ్ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 662 వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టుల్లో 636 పోస్టులకు సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లమో పూర్తి చేసిన వారు అర్హులు, మొత్తం పోస్టుల్లో సగం డిగ్రీ అభ్యర్థులకు, సగం పోస్టులు డిప్లమో అభ్యర్థులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. మరో 26పోస్టుల్లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సు చేసిన డిగ్రీ/డిప్లమో అభ్యర్థులకు కేటాయించారు. అభ్యర్థులు యూజీసీ గుర్తింపు కలిగిన ఏదేని యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఏఎంఐఈ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు 60ఏళ్ల వయస్సు దాటిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోరు. బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు రోజువారీ వేతనం రూ.735 చొప్పున నెలలో 25రోజులకు 18,375 చెల్లిస్తారు. డిప్లమో అభ్యర్థులకు రోజుకు రూ.550 చొప్పున నెలలో 25రోజులకు కలిపి రూ.13,750 వేతనాన్ని చెల్లిస్తారు.