రాష్ట్రంలోనే హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న తొలి ఎస్సీ యువతి
26న పరేడ్ మైదానంలో ఆర్‌టీసీ బస్సు నడపనున్న విశ్వవాణి
కర్నూలు(అర్బన్): మహిళలు అన్ని రంగా ల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. కష్టమైన రంగాల్లో కూడా వెనకడగు వేయడం లేదు. పురుషులకే పరిమితమైన డ్రైవింగ్‌లో కూడా మహిళలు తమ ప్రతిభ చాటుతున్నారు. అయితే కేవలం లైట్ వెహికల్స్‌కే పరిమితమైన మహిళలు నేడు హెవీ వెహికల్స్ నడిపేందుకు కూడా సిద్ధమవుతున్నారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వాహనాలను నడుపుతున్న మహిళల జాబితాలోకి కర్నూలు నగరానికి చెందిన యువతి విశ్వవాణి చేరనుంది. కర్నూలు పాతబస్డాండ్ సమీపంలోని సెంట్రల్ లైబ్రరీ ప్రాంతానికి చెందిన విజయేశ్వరరావు, మణి దంపతుల కూతురు విశ్వవాణి బీఎస్సీ చదివారు.
ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా నిలవాలనే తపనతో ఆమె ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌టీసీ శిక్షణా సంస్థలో హెవీ డ్రైవింగ్‌లో శిక్షణను పూర్తి చేసుకొని ఆర్‌టీసీ బస్సును సునాయసంగా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోనే తొలి ఎస్సీ మహిళా డ్రైవర్‌గా కూడా గుర్తింపు పొందనున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబర్ 3 నుంచి ఈనెల 12వ తేదీ వర కు అర్హులైన వారికి ఆర్‌టీసీ శిక్షణా సంస్థలో హెవీ డ్రై వింగ్‌లో శిక్షణ ఇప్పించారు. ఈ శిక్షణకు ఉమ్మడి కర్నూ లు జిల్లాలో 20 మంది ఎంపిక కాగా, ఇందులో 19 మంది పురుషులు కాగా, విశ్వవాణి ఒక్కరే మహిళ .
ఇష్టంతోనే స్టీరింగ్ పట్టా ..
‘ఉద్యోగ రంగాల్లో తీవ్ర పోటీ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో స్వయం ఉపాధి అవకాశాల వైపు చూశాను. నేర్చుకోవాలనే తపన, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ తీసుకునేందుకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కే తులసీదేవి, ఆర్‌టీసీ కర్నూలు డిపో మేనేజర్ సుధారాణి, ట్రైనింగ్ కళాశాల ఇన్‌స్ట్రక్టర్ వలితో పాటు నాతో శిక్షణ తీసుకుంటున్న వారు ఎంతో సహకారాన్ని అందించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 26వ తేదీన స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో ఆర్టీసీ బస్సును నడిపేందుకు నన్ను ఎంపిక చేసినందుకు ఆనందంగా ఉంది’.


