
తొలి ప్రయాణం... ఒక ట్రిగ్గర్
‘ఇల్లే తీర్థం–వాకిలే వారణాసి–కడుపే కైలాసం’ అనుకుంటారు కొందరు. కొందరు మాత్రం ‘ప్రపంచమే అతి పెద్ద ఇల్లు’ అనుకుంటారు. ప్రయాణాలను ఇష్టపడతారు. ఒక వయసు దాటిన తరువాత ‘ఈ వయసులో ప్రయాణం ఏమిటి’ అనుకుంటారు ఇంకొంతమంది. అయితే ప్రయాణం వయసెరుగదు. ఎందుకంటే వయసు భారాన్ని అధిగమించే ఉత్సాహం ప్రయాణాలలో ఉంది. అలాంటి ఒక ఉత్సాహవంతురాలు ఇందిర. కేరళకు చెందిన ఇందిర ఎం. ఉపాధ్యాయురాలు. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తరువాత 35 దేశాలు పర్యటించింది.
కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని చిన్నప్పుడు కలలు కనేది ఇందిర. అయితే అరవై ఏళ్ల వయసులోగానీ ఆ కల నెరవేరలేదు. సౌత్ ఆఫ్రికన్ సవానా తన తొలి ఇంటర్నేషనల్ ట్రిప్. తొలి ప్రయాణ విశేషాల గురించి అపురూపంగా చెబుతుంది. జీవవైవిధ్యంతో అలరించే ప్రకృతి, బిగ్‌ఫైవ్‌లాంటి వన్య ప్రాణులు, వైవిధ్యమైన వాతావరణం... స్థూలంగా తొలి పర్యటన ఇందిరకు ఎంతో సంతోషాన్నిచ్చింది.
సఫారీలో తాను చూసిన ఏనుగులు, సింహాల గురించి చిన్నపిల్లలా ఉత్సాహపడుతూ... ‘ప్రయాణాల పుణ్యమా అని నాకు ఎంతోమంది స్నేహితులయ్యారు. జీవితంతో పాటు రకరకాల విషయాలు మాట్లాడుకుంటాం. మాలో చాలామందికి ఒకేరకమైన జీవితానుభవాలు ఉన్నాయి. నా స్నేహబృందంలో వివిధ వయసుల వాళ్లు,ప్రాంతాల వాళ్లు ఉన్నారు. అయితే మా స్నేహానికి వయసు,ప్రాంతం ఎప్పుడూ అడ్డుగోడ కాలేదు’ అంటుంది ఇందిర.
పెళ్లికావడానికి ముందు ప్రయాణాలు చేయాలనే ఉత్సాహం ఉన్నా ఆమె దగ్గర సరిపడా డబ్బు ఉండేది కాదు. ఉద్యోగం వచ్చి, పెళ్లయిన తరువాత కుటుంబ ఖర్చులు, బాధ్యతల వల్ల ప్రయాణాలు చేయలేక పోయింది. ‘సోలో ట్రావెలింగ్ గురించి ఆలస్యంగా తెలిసింది. అది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నన్ను నేను లోతుగా తెలుసుకోవడానికి ఉపయోగపడింది’ అంటుంది ఇందిర.
ప్రతి ప్రయాణంలో ఆమె ఎన్నో అనుభవాలను మూటగట్టుకుంది. ఇస్తాంబుల్‌లో ఉన్నప్పుడు సూట్‌కేస్ కోడ్ మరిచి పోయింది. జపాన్‌లో ఒకరోజు గాయపడింది... ఇలాంటి ఎన్నో సందర్భాలలోనూ ఎవరో ఒకరు ఆమెకు సహాయంగా నిలిచేవారు. ఎక్కడ ఏ కష్టం వచ్చినా, దయాగుణం అనుకోని అతిథిలా వచ్చేది.
సోలో ట్రావెల్‌ను ఎంజాయ్ చేసినట్లే గ్రూప్ ట్రావెల్‌ను కూడా ఎంజాయ్ చేసింది ఇందిర. ‘గ్రూప్‌తో కలిసి ప్రయాణం చేసినప్పుడు కుటుంబసభ్యులతో ఉన్నట్లుగానే ఉంటుంది. ప్రతి ఒక్కరూ మరొకరికి సహాయపడతారు’ అంటున్న ఇందిర ఇప్పటివరకు 35 దేశాలకు వెళ్లింది. మరిన్ని దేశాలకు వెళ్లడానికి సన్నద్ధం అవుతోంది. తాజాగా స్కాండినేవియా దేశాల పర్యటనకు సిద్ధం అవుతోంది.
తొలి ప్రయాణానికి సంబంధించి పిల్లలు నన్ను ఎంతో ప్రోత్సహించారు. మొదటి ప్రయాణ సమయంలో ఖర్చు గురించి ఆలోచించాను. అయితే విలువైన ప్రయాణ అనుభవాల ముందు ఆ ఖర్చు ఒక లెక్కే కాదని తెలుసుకున్నాను. ప్రయాణాన్ని ఇంత బాగా ఆస్వాదిస్తానని ఊహించలేదు. తొలి ప్రయాణం అనేది నేను ప్రయాణాలను ఇష్టపడేలా చేసిన ఒక ట్రిగ్గర్.
ఎప్పుడూ ఉండే ఇంటిని దాటి మనల్ని మనం కనుగొనడంలో ఒక నిర్దిష్ట నిశ్శబ్ద శక్తి ఉంది. నేను చాలా ఆలస్యంగా ప్రయాణాలు ప్రారంభించాను. చాలా ముందుగానే మొదలు పెట్టి ఉంటే బాగుండేదనిపిస్తోంది. సోలో ట్రావెల్‌కు చాలామంది వెనకాడుతుంటారు. అయితే మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అవి ఎంతో ఉపయోగపడతాయి.
– ఇందిర ఎం