
టీవీ చర్చల్లో అర్నాబ్ గోస్వామి ఎలా మాట్లాడతారో చాలా మందికి తెలుసు. ఓ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని వ్యంగ్యంగా "రాహుల్ బాబా" అని పదేపదే సంబోధించారు. అదే కార్యక్రమంలో పాల్గొన్న ఓ యువతి అర్నాబ్ బాబా అంటూ కౌంటర్ ఇవ్వడంతో అర్నాబ్ వెనక్కి తగ్గారు. ఆ యువతిపేరు కాంచనా యాదవ్. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆమె 2018లో విద్యార్థి రాజకీయాల్లో చేరి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) భావజాలం ప్రభావంతో ఆ పార్టీలో కొనసాగుతున్నారు.
మరొక టీవీ చర్చా కార్యక్రమంలో అర్నాబ్ గోస్వామి మాట్లాడుతూ.. 'నేను ఉన్నత కులానికి చెందిన బ్రాహ్మణుడి'ని అంటూ వ్యాఖ్యానించారు. అక్కడే ఉన్న ప్రియాంక భారతి (Priyanka Bharti) ఈ వ్యాఖ్యలపై దీటుగా స్పందించారు. మీది ఉన్నత కులం కాదు. పుట్టకతోనే ఎవరూ ఉన్నతులు, తక్కువ వారు కాదు. మీ మాటలు వివక్షపూరితంగా ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు. దీంతో గోస్వామి కామ్ అయిపోయారు.
కాంచన, ప్రియాంక ఇద్దరూ ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధులు. ఈ ఇద్దరు యువతులు తమ పోరాట శైలితో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా టీవీ చర్చల్లో తమ పార్టీ గళాన్ని బలంగా పనిచేస్తూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ఇద్దరూ 2018లో JNUలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆర్జేడీ విద్యార్థి విభాగం ఛత్ర రాష్ట్రీయ జనతాదళ్ (CRJD)లో చేరారు. విశ్వవిద్యాలయ విద్యార్థి రాజకీయాల్లో తన ఉనికిని బలోపేతం చేసుకోవాలని భావించిన ఆర్జేడీ.. 2019 విద్యార్థి సంఘాల ఎన్నికల్లో పోటీ చేసింది.
''జేఎన్‌యూలో ప్రతిభావంతులైన వారిని గుర్తించి, పార్టీలో ప్రోత్సహించాలనేది ఎంపీలు మనోజ్ ఝా, సంజయ్ యాదవ్ (Sanjay Yadav) ఆలోచన. సీఆర్‌జేడీ ఏర్పడినప్పటి నుంచి ప్రొఫెసర్ నవల్ కిషోర్ దీనికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. దాని అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు" అని పార్టీ కార్యకర్త ఒకరు తెలిపారు. కాంచన, ప్రియాంక.. సీఆర్‌జేడీ ద్వారానే వెలుగులోకి వచ్చారు. కంప్యూటేషనల్, ఇంటిగ్రేటివ్ సైన్సెస్‌లో కాంచన పీహెచ్‌డీ చేశారు. జర్మన్ స్టడీస్‌లో ప్రియాంక పీహెచ్‌డీ చేస్తున్నారు. 2023, అక్టోబర్‌లో ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధులుగా వీరిద్దరూ నియమితులయ్యారు.
లాలూ స్ఫూర్తితోనే..
లాలూ ప్రసాద్ యాదవ్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు కాంచన వెల్లడించారు. తన రాజకీయ ప్రవేశంపై 'ది ప్రింట్'తో ఆమె మాట్లాడుతూ.. ''2018లో నేను విద్యార్థి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. నాకు ఇతర ఎంపికలు కూడా ఉన్నాయి. కానీ నేను RJD భావజాలంతో బాగా ప్రభావితమయ్యాను. (పార్టీ చీఫ్) లాలూ ప్రసాద్ జీ సిద్ధాంతాలపై ఎప్పుడూ రాజీపడలేదు. JNUలోని చాలా మంది విద్యార్థులు సాధారణంగా వామపక్ష విద్యార్థి సంఘాల వైపు ఆకర్షితులవుతారు. కానీ లాలూజీ భావజాలం నన్ను ఆకట్టుకుంద''ని తెలిపారు. విద్యార్థి నేతగా ఫీజు పెంపుదల, హాస్టల్ సంబంధిత సమస్యలతో పాటు అంశాలపై పోరాటం చేసినట్టు వెల్లడించారు.
పోలీసులు దారుణంగా కొట్టారు
తన రాజకీయ ప్రయాణం గురించి ప్రియాంక మాట్లాడుతూ.. ''నేను గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ఆర్జేడీ విద్యార్థి విభాగంలో చేరాను. ఆ సమయంలో జేఎన్‌యూలో అనేక నిరసనలు జరుగుతున్నాయి. వామపక్ష గ్రూపులలో చేరడం వంటి ఇతర ఎంపికలు కూడా నాకు ఉన్నాయి, కానీ అవి కుల సమస్యలపై తగినంతగా గళం విప్పడం లేదని నేను భావించాను. నేనేమీ అకస్మాత్తుగా రాజకీయాల్లోకి రాలేదు. ఫీజుల పెంపుదలకు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించాను. పోలీసులు నన్ను దారుణంగా కొట్టారు. నా చర్మంపై పిన్నులు గుచ్చారు. దాని వల్ల నా మోకాలిలో కణితి వచ్చింది. మా విద్యార్థి విభాగం కోసం కరపత్రాలు పంపిణీ చేస్తున్నప్పుడు సీఆర్‌జేడీ తరపున ఎందుకు ప్రచారం చేస్తున్నావని సీనియర్ ఒకరు అడిగారు. సామాజిక న్యాయం, లాలూజీ సిద్ధాంతాన్ని నమ్ముతానని చెప్పాను. అలా నాకు సీఆర్‌జేడీలో సభ్యత్వం వచ్చింద''ని తెలిపారు.
ఎవరీ కాంచన?
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో కాంచన జన్మించింది. ఆమె పూర్వీకులు బిహార్‌లోని ససారాంకు చెందినవారు. కాంచనతాత ప్రభుత్వ ఉద్యోగి కాగా, తండ్రి ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 2017లో లైఫ్ సైన్సెస్‌లో ఎంఎస్సీ చేయడానికి జేఎన్‌యూలో చేరారు. సీఎస్‌ఐఆర్ ఫెలోషిప్ సాధించడంతో బెంగళూరులో సైంటిస్ట్ ఉద్యోగ అవకాశం వచ్చింది. రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో ఢిల్లీలోనే ఉండిపోయారు. త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల తమకెంతో కీలకమని, ఈ ఎన్నికల తర్వాతే ఉద్యోగం గురించి ఆలోచిస్తానని కాంచన 'ది ప్రింట్'తో చెప్పారు.
ప్రియాంక ప్రస్థానం
పట్నా జిల్లా తూర్పు శివార్లలోని ఫతుహా పట్టణానికి చెందిన ప్రియాంక 2019లో జరిగిన జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్ష ఎన్నికల్లో సీఆర్‌జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమె తండ్రి రైతుగా పనిచేస్తున్నారు. తమ కుటుంబానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదని ప్రియాంక చెప్పారు. జేఎన్‌యూలో పీహెచ్‌డీ కొనసాగుతోందన్నారు. టీవీ చర్చా కార్యక్రమాల్లో ఆర్జేడీ (RJD) పార్టీ వైఖరిని బలంగా వినిపించడంపై ప్రస్తుతం దృష్టి సారించినట్టు వెల్లడించారు.
చదవండి: 'మా ఆయన అస్సలు మంచోడు కాదు'
మీడియాలో వివక్ష
మీడియాలో ప్రతిపక్ష నాయకుల పట్ల వివక్ష కొనసాగుతోందని కాంచన, ప్రియాంక ఆరోపించారు. కొంత మంది న్యూస్ యాంకర్లు అధికార పార్టీ ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికార బీజేపీ, గోడి మీడియా యాంకర్లకు సరైన సమాధానం ఎలా ఇవ్వాలో తమకు తెలుసునని.. భయపడేది లేదని వారిద్దరూ ముక్తకంఠంతో చెప్పారు. చర్చల్లో పాల్గొనకుండా తమను గోడి మీడియా బాన్ చేసినప్పుడు ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ (Tejashwi yadav) తమకు అండగా నిలబడ్డారని తెలిపారు.