
భర్త పెట్టిన చిత్రహింసలను మౌనంగా భరించింది. మానసికంగా, భౌతికంగా హించించినా ఓర్చుకుంది. పరాయి మహిళలతో తన పెనిమిటి పాడు సంబంధాలు పెట్టుకున్నా ఊరుకుంది. కానీ పరాయి మగాళ్ల కోరిక తీర్చాలని తనను భర్త ఒత్తిడి చేయడంతో ఆమె తట్టుకోలేకపోయింది. భర్తకు తోడు అతడి కుటుంబ సభ్యులు కూడా గలీజు పనులు చేయమని పోరు పెట్టడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని పుట్టెనహళ్లిలో (Puttenahalli) వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం.. 2024, డిసెంబర్‌లో సయ్యద్ ఇనాముల్ హక్ అనే వ్యక్తితో బాధితురాలికి పెళ్లి జరిగింది. వివాహ సమయంలో 340 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక యమహా బైక్‌ను ఇచ్చారు. పెళ్లైన కొద్దిరోజులకే వరుడి అసలు రూపం బయటపడింది. అతడికి అప్పటికే పెళ్లయిందని, తాను రెండో భార్యనని తెలిసి బాధితురాలు హతశురాలయింది. అంతేకాదు తనకు 19 మంది పరాయి మహిళలతో వివాహేతర సంబంధాలున్నాయని స్వయంగా భర్త చెప్పడంతో ఆమె నిశ్చేష్టురాలయింది.
అతడి ఆగడాలు అక్కడితో ఆగలేదు. బెడ్‌రూంలో సీక్రెట్ కెమెరా (Secret Camera) పెట్టి రికార్డు చేసిన వీడియోలను విదేశాల్లోని తన స్నేహితులకు పంపించాడని బాధితురాలు వెల్లడించింది. వారితో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడని, తాను ఒప్పుకోకపోవడంతో.. ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించినట్టు పోలీసులకు ఆమె తెలిపింది. ఇంటా, బయట తనను పదేపదే చిత్రహింసలకు గురిచేశాడని వాపోయింది.
ఫ్లాట్ (Flat) కొనడానికి తన బంగారు నగలను అమ్మమని అతడు ఒత్తిడి తెచ్చాడని, తాను నిరాకరించడంతో తనపై దాడి చేశాడని ఆమె చెప్పింది. అత్తమామలతో పాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 21న బాధితురాలిపై దాడి చేసి నిందితుడు పారిపోయాడు. అతడితో పాటు కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు ఇంకా పట్టుబడలేదని, అతడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలని, అతడి బారి నుంచి మహిళలను కాపాడాలని పోలీసులను బాధితురాలు ప్రాధేయపడింది.