
కర్ణాటక మహిళకు సుప్రీంకోర్టు అనుమతి
న్యూఢిల్లీ: కాబోయే భర్తను హత్య చేసిన కేసులో దోషిగా తేలిన కర్ణాటక మహిళ శుభాకు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. కర్ణాటక గవర్నర్ నుంచి క్షమాభిక్ష కొరేందుకు ఆమెకు అనుమతి ఇచ్చింది. సామాజిక పరిస్థితులు, ఒత్తిళ్ల కారణంగా మహిళలు కొన్ని సందర్భాల్లో నేరాలకు పాల్పడుతున్నారని న్యాయస్థానం పేర్కొంది. శుభా 20 ఏళ్ల వయసులో కాలేజీలో చదువుకుంటున్న సమయంలో నిశ్చితార్థం జరిగింది. ఈ పెళ్లి ఆమెకు ఎంతమాత్రం ఇష్టంలేదు.
కుటుంబ సభ్యుల ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది. కాబోయే భర్తను హత్య చేస్తే తనకు ఈ పెళ్లి తప్పుతుందని భావించింది. తన మిత్రులైన అరుణ్ వర్మ, వెంకటేశ్, దినేశ్‌తో కలిసి అతడిని హత్య చేసింది. శుభాపై నేరం రుజువైంది. అయితే, బలవంతంగా పెళ్లి చేసేందుకు పెద్దలు ప్రయత్నించడంతో విధిలేని పరిస్థితుల్లో అతడిని చంపాల్సి వచ్చిందని శుభా మొరపెట్టుకుంది. గవర్నర్‌ను క్షమాభిక్ష కొరేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అరవింద్ కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. శుభా వినతి పట్ల సానుకూలంగా స్పందించింది.