బిహార్ ఎన్నికల్లో 23 శాతం ఓట్లు సాధించిన ఆర్జేడీ
143 స్థానాల్లో పోటీ చేసి 25 సీట్లకు పరిమితం
బీజేపీ, జేడీ(యూ) కంటే ఎక్కువ ఓట్లు దక్కించుకున్న తేజస్వీ పార్టీ
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్–రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) కూటమి ఘోరంగా పరాజయం పాలయ్యింది. మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విపక్ష కూటమి తరఫున అంతా తానై వ్యవహరించారు. రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించారు. ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. పలు హామీలు ఇస్తూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.
తేజస్వీ సభలకు జనం పోటెత్తారు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ నీడ నుంచి ఆయన బయటకు వచ్చినట్లే కనిపించింది. ఎన్నికల్లో కష్టపడి పనిచేసినప్పటికీ ఓటమి తప్పకపోవడం ఆర్జేడీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు గాను పొత్తులో భాగంగా 143 స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీ కేవలం 25 స్థానాలు గెల్చుకుంది. అయితే, మిగతా పార్టీల కంటే ఆర్జేడీకే అత్యధికంగా ఓట్లు రావడం గమనార్హం.
పోలైన మొత్తం ఓట్లలో ఆ పార్టీకి ఏకంగా 23 శాతం ఓట్లు లభించాయి. బీజేపీ, జేడీ(యూ)లకు ఇన్ని ఓట్లు రాలేదు. ఓట్ల శాతం పరంగా చూస్తే ఏకైక అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించింది. ఆ పార్టీ 2020 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లు గెల్చుకొని, 23.11 శాతం ఓట్లు దక్కించుకుంది. అంటే ఈసారి సీట్ల సంఖ్య తగ్గినా, ఓట్ల శాతం స్వల్పంగా మాత్రమే తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఆర్జేడీ పట్ల జనాదరణలో మార్పు రాలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
తేజస్వీ యాదవ్ పార్టీకి 1.15 కోట్ల ఓట్లు
ఆర్జేడీ ఓట్ల పరంగా కరోడ్‌పతిగా నిలిచింది. ఈ ఎన్నికల్లో 1,15,46,055 ఓట్లు సాధించింది. 101 సీట్లలో పోటీ చేసి, 89 సీట్లు కైవసం చేసుకొని ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీకి దక్కిన ఓట్లు కేవలం 20.08 శాతం. 2020లో 19.46 శాతం ఓట్లు లభించగా, ఈసారి స్వల్పంగా పెరిగాయి. బీజేపీకి మొత్తం 1,00,81,143 ఓట్లు దక్కాయి. బీజేపీ మిత్రపక్షం, సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్(యునైటెడ్) 101 సీట్లలో పోటీ చేసి, 85 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. ఆ పార్టీకి 19.25 శాతం ఓట్లు(96,67,118) వచ్చాయి.
2020లో 15.39 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 3.86 శాతం పెరిగాయి. నితీశ్ కుమార్ ప్రజా వ్యతిరేకతను అధిగమించడంతోపాటు ఓట్ల శాతాన్ని మెరుగుపర్చుకోవడం విశేషం. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(రామ్‌విలాస్), హిందుస్తానీ అవామీ మోర్చా(సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలకు వచ్చిన ఓట్లు కూడా కలిపితే జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే)కు దక్కిన మొత్తం ఓట్లు దాదాపు 47 శాతం. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాగఠ్‌బంధన్‌కు దక్కిన మొత్తం ఓట్లు 35.89 శాతం. రెండు కూటముల మధ్య ఓట్ల తేడా 11.11 శాతంగా తెలుస్తోంది.
ఎక్కువ సీట్లలో పోటీ చేయడం వల్లే..
ఆర్జేడీ ఓట్ల శాతం భారీగా ఉన్నప్పటికీ సీట్లు పెరగలేదు. ఎన్నికల్లో ఒక పార్టీ లేదా ఒక అభ్యర్థికి మొత్తం ఎన్ని ఓట్లు వచ్చాయో ఓట్ల శాతాన్ని బట్టి నిర్ధారించవచ్చు. ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడానికి ఓట్ల శాతం తోడ్పడుతుంది. ఆర్జేడీ పాలన జంగిల్‌రాజ్ అంటూ ప్రత్యర్థులు పదేపదే నిందలు వేసినప్పటికీ ఆ పార్టీ పట్ల ప్రజాభిమానం చెక్కుచెదరలేదు. ఆర్జేడీ తాను పోటీ చేసిన చాలా నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఎన్డీయేకు గట్టి పోటీ ఇచ్చింది. ఆ పార్టీ ఓట్ల శాతం మెరుగ్గా కనిపించడానికి మరో కారణం కూడా చెప్పుకోవచ్చు. 143 స్థానాల్లో ఆర్జేడీ బరిలోకి దిగింది.
రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఇన్ని స్థానాల్లో పోటీ చేయలేదు. ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన బీజేపీ 101, జేడీ(యూ) 101 సీట్లలో పోటీకి దిగా యి. బీజేపీ కంటే 42, జేడీ(యూ) కంటే 42 ఎక్కు వ సీట్లలో ఆర్జేడీ పోటీ చేసింది. ఎక్కువ సీట్లలో పోటీపడింది కాబట్టే ఎక్కువ ఓట్లశాతం కనిపిస్తోందని, ఇందులో ఆర్జేడీ కొత్తగా బలం చాటింది ఏమీ లేదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. గెలిచిన, ఓడిపోయిన నియోజకవర్గాల్లో పార్టీకి పోలైన మొత్తం ఓట్లను కలిపితే ఆర్జేడీకి 23 శాతం ఓట్లు పడినట్లు చెబుతున్నారు. ఆర్జేడీకి 2010 ఎన్నికల్లో 22 సీట్లు లభించాయి. ఆ తర్వాత అతి తక్కువ సీట్లు దక్కింది మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం.
– సాక్షి, నేషనల్ డెస్క్


