సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేయడంపై రాయచోటిలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హేతుబద్ధత లేకుండా జిల్లా కేంద్రాన్ని తరలించడాన్ని వెనక్కు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజలకు డిమాండ్ చేస్తున్నారు. రాయచోటిని మదనపల్లిలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మండిపడుతున్నారు.
ఇక, జిల్లాను మూడు ముక్కలు చేయడంపై వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్బంగా రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించడానికి వీల్లేదంటూ నినాదాలు చేశారు. స్థానిక ప్రజలు అభిప్రాయాలు తీసుకోకుండా ఎలా మారుస్తారు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాను చీల్చవద్దంటూ నినాదాలు చేశారు. మరోవైపు.. రాయచోటిలో జిల్లా కేంద్రం కోసం ఎన్ని పోరాటాలకైనా సిద్ధమంటూ శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం మారకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. జిల్లాను నిలబెట్టలేకపోతే మీసం తీసుకుంటా అంటూ.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి గతంలో తొడగొట్టి మరీ చెప్పిన మాటలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాయచోటిలో ఆయన తీరుపై అసంతృప్తి.. క్రమక్రమంగా ఆగ్రహ జ్వాలలుగా మారుతోంది. తాజాగా రాయచోటిని మదనపల్లిలో కలపడంపై కేబినెట్‌లో సంతకం చేసిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. బయటకు వచ్చి కంటతడి పెట్టారు. అయితే ఆయనది డ్రామా అంటూ రాయచోటి ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘నాడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకుని రాయచోటికి జిల్లాను తెచ్చారు. దానిని నిలబెడతానని.. లేకుంటే మీసం తీసేస్తానంటూ రాంప్రసాద్‌రెడ్డి శపథం చేశారు. ఈ క్రమంలో.. ఇప్పుడు మీసం తీసేస్తారంటూ అంటూ రాజకీయ ప్రత్యర్థులు సెటైరలు సంధిస్తున్నారు. శ్రీకాంత్‌రెడ్డి పదవీ త్యాగంతో జిల్లాను తీసుకొస్తే..రాంప్రసాద్‌రెడ్డి మంత్రి పదవి కోసం జిల్లాను ముక్కలు చేశాడంటున్న రాయచోటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


