
కడుపున పుట్టిన పిల్లలే కాదు.. కనిపించకుండా ఎక్కడో నక్కిన సైబర్ నేరస్తుల చేతిలోనూ వేధింపులు, సైబర్ మోసాలకు గురవుతున్న వృద్ధులకు భరోసా కల్పించేందుకు రాచకొండ పోలీసులు అడుగులు ముందుకేశారు. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ (ఆర్కేఎస్సీ)తో కలిసి గోల్డెన్ కేర్ ‘మన కోసం శ్రమించిన వారికి మన సంరక్షణ’ అనే వినూత్న కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వృద్ధులకు రక్షణ, సంరక్షణ, గౌరవం అందించడమే దీని ప్రధాన లక్ష్యం.
గోల్డెన్ కేర్ ద్వారా వారికి భద్రత మాత్రమే కాదు, ఆప్యాయం, గౌరవం, ఆతీ్మయతను అందించనున్నారు. వృద్ధులు సమాజానికి నిజమైన మూలస్తంభాలు, జ్ఞాననిధులని రాచకొండ పోలీస్ కమిషనర్ జీ సుధీర్ బాబు కొనియాడారు. రాచకొండ పోలీసులు ఎల్లప్పుడూ మీ కుటుంబ సభ్యుల్లా ఉంటారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన సీనియర్ సిటిజన్స్ అందరికీ కిట్స్ పంపిణీ చేశారు.
సైబర్ భద్రత, ఆరోగ్య బీమా..
గోల్డెన్ కేర్ కార్యక్రమం కింద వృద్ధులకు నియమిత పర్యటనలు, నైతిక సహకారం అందించడంతో పాటు ఎస్‌ఓఎస్ సెటప్, వైద్య, అత్యవసర సహాయం కోసం ఆస్పత్రులతో ఒప్పందాలు, ఆరోగ్య బీమా సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మార్గదర్శనం అందిస్తారు. వృద్ధులకు ఆర్థిక, సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తారు. మోసాల బారిన పడితే పోలీసులకు తెలియజేసే ప్రక్రియలో సహాయం, శారీరక లేదా మానసిక వేధింపుల కేసుల దర్యాప్తు, జోక్యం చేసుకోవడం, నిర్లక్ష్యానికి గురైనా విడిచిపెట్టే సంఘటనలలో తగిన పరిష్కారం అందిస్తారు.
వీటితో పాటు వృద్ధులు తప్పిపోయినా, ఏదైనా వస్తువులు పొగొట్టుకున్నా వాటిని కనుగొనడంలో పోలీసులు సహాయం అందిస్తారు. గోల్డెన్ కేర్ సేవల కోసం రాచకొండ పోలీసులు ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సీనియర్ సిటిజన్ హెల్ప్‌లైన్ నంబరు 14567 లేదా రాచకొండ వాట్సాప్ నంబర్ 87126 62111లతో సంప్రదించవచ్చు.
బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్–144 కింద వృద్ధులను పోషించకుండా నిర్లక్ష్యం చేసినవారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారు. అలాగే, మెయింటెనెన్స్ యాక్ట్ (సెక్షన్లు 4, 5) వృద్ధులు తమ పిల్లల నుండి ఆర్థిక సహాయం పొందేలా అవకాశం కలి్పస్తుంది. డీసీపీలు పద్మజ, ప్రవీణ్ కుమార్, ఆకాం„Š యాదవ్, సునీతా రెడ్డి, అరవింద్ బాబు, ఇందిరా, ఉషా రాణి, నాగలక్ష్మీ, రమణా రెడ్డి, మనోహర్, ఆర్కేఎస్సీ జాయింట్ సెక్రటరీ శివ కారడి, చీఫ్ కో–ఆర్డినేటర్ సావిత్రి పాల్గొన్నారు.
(చదవండి: She Astra App for Women : రక్షణ ఛత్రం..! 'షీ అస్త్రం'..: దేశంలోనే తొలి ఉమెన్ యాప్)