
భలే భలే. ఈమె చిన్న వయసులో న్యాయవాది అయ్యింది. అదీ మన దేశంలో కాదు. ఇంగ్లాండ్‌లో. ఇంకా గొప్ప కదూ. న్యాయవాది కావాలంటే ఎన్నో విషయాలపై అవగాహన ఉండాలి. చట్టాలు, న్యాయ సూక్ష్మాలు తెలిసి ఉండాలి. బారెడు పుస్తకాలు చదివి ఉండాలి. నిత్యం సమాజంలో ఏం జరుగుతుందో గమనిస్తుండాలి. ఇవన్నీ చేస్తేనే న్యాయవాదిగా నిలదొక్కుకుంటారు. పాతికేళ్లు దాటితే తప్ప చాలామంది న్యాయవ్యాద వృత్తిని చేపట్టరు. అలాంటిది 18 ఏళ్లకే లా డిగ్రీ పొంది, 21 ఏళ్లకు న్యాయవాదిగా కేసులు వాదిస్తూ పేరు తెచ్చుకుంటోంది ఓ యువతి. తనే కృషాంగి మేష్రామ్ (Krishangi Meshram). భారత సంతతికి చెందిన తను ఇంగ్లాండ్‌లో అతి పిన్న వయస్కురాలైన సొలిసిటర్‌గా చరిత్ర సృష్టించింది.
పశ్చిమ బెంగాల్‌లోని మాయాపూర్‌కు చెందిన కృషాంగి మెష్రామ్‌కు చిన్ననాటి నుంచి న్యాయశాస్త్రంపై ఆసక్తి ఎక్కువ. న్యాయవాదుల్లా తాను కోర్టులో వాదనలు వినిపించాలని, బాధితులకు న్యాయం అందించాలని భావించింది. వారి కుటుంబం ఇంగ్లండ్‌లో స్థిరపడింది. 15 సంవత్సరాల వయస్సులో స్థానికంగా లా కాలేజీలో చేరాలని భావించినా, ఇంటికి దూరంగా ఉండటానికి ఆమె ఇష్టపడలేదు. ఆ సమయంలో మిల్టన్ కీన్స్‌లోని ఓపెన్ యూనివర్సిటీలో లా చదివేందుకు అవకాశం ఉందని తెలుసుకొని, అందులో చేరాలని నిర్ణయం తీసుకుంది. ఇంట్లోనే తల్లిదండ్రులు, చెల్లెలితో కలిసి ఉంటూ మూడేళ్లపాటు కష్టపడి లా పూర్తి చేసింది.
న్యాయవాదిగా పేరు తెచ్చుకునేందుకు కావాల్సిన నైపుణ్యాలను ఆ సమయంలోనే అప΄ోసన పట్టింది. 18 ఏళ్ల వయస్సులో బ్యాచిలర్ ఆఫ్ లాస్ (ఆనర్స్) డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సింగపూర్‌లో ఓ ఉద్యోగంలో చేరింది. మూడేళ్లు అక్కడ పని చేసి, తగిన అనుభవాన్ని గడిచింది. తిరిగి ఇంగ్లండ్ చేరుకున్న ఆమె అతి పిన్న వయస్కురాలైన సొలిసిటర్‌గా మారింది. ప్రైవేట్ క్లయింట్‌లకు న్యాయవాదిగా మారి సేవలందిస్తానని వివరిస్తోంది.