
అది 1930. దేశ రాజధాని ఢిల్లీలో రాధ (Dr. Radha Pant ) బీఎస్సీ చదవాలని కలలు కంటోంది. అప్పటికి డిగ్రీ స్థాయిలో సైన్స్ చదివే అవకాశం మహిళ లకు ఏ కళాశాలలోనూ లేదు. తండ్రి కాలేజీల చుట్టూ తిరగడం, వెనక్కి రావడం... రెండేళ్లయ్యింది. కానీ ఆ అమ్మాయి మాత్రం వెనక్కి తగ్గడం లేదు; ‘అవసరమైతే గాంధీ మహాత్ముడిలా సత్యా గ్రహం చేస్తాను హిందూ కాలేజీ ఎదుట’ అనేదాకా వెళ్ళింది. అలా బీఎస్సీ సైన్స్ డిగ్రీలో హిందూ కళాశాలలో ప్రవేశం దొరికింది.
కేరళలోని పాల్‌ఘాట్ ప్రాంతం కల్పతి గ్రామంలో 1916 సెప్టెంబర్ 5న రాధ జన్మించారు. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి 1940లో పీహెచ్‌డీ సాధించారు. పీహెచ్‌డీ కొరకు 2, 4 డై మీతోక్సి ఐసోఫ్తలి కామ్లం; 2, 6 డై హైడ్రాక్సి ఐసోథాలికామ్లాలను తొలిసారి తయారు చేసిన శాస్త్రవేత్త రాధ. బొంబాయి హాఫ్కిన్ ఇనిస్టిట్యూట్ వారి న్యూట్రిషనల్ బయో కెమిస్ట్రీ విభాగంలో సీనియర్ రిసెర్చ్ ఫెలోగా పని చేస్తూ... ఎంతోకాలంగా ఉన్న నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ... ‘సోయా కన్నా శనగలే మేలైన పోషక విలువలు కలిగి ఉన్నాయని’ రుజువు చేశారు. 1945లో అలహాబాద్ విశ్వవిద్యాలయంలో తొలి మహిళా అధ్యాపకురాలిగా బయోకెమిస్ట్రీ నేపథ్యంతో చేరారు. అనతి కాలంలోనే అదే విశ్వవిద్యాలయంలో బోటనీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న దివ్య దర్శన్ పంత్‌ను వివాహం చేసుకున్నారు. 1954–56 మధ్యకాలంలో భార్యాభర్తలిద్దరూ యూని వర్సిటీ ఆఫ్ లండన్ వెళ్లి పోస్ట్ డాక్టోరల్ పట్టాలు పొందారు.
‘ఎవర్ ఎ ఫైటర్ ’ పేరుతో రాధా పంత్ తన జ్ఞాపకాలను రాసుకున్నారు. 1956లో అలహాబాద్ యూనివర్సిటీలో తను పరిశోధనను కొనసాగించాలను కున్నప్పుడు ఆ విభాగంలో కేవలం 6 గదులు మాత్రమే ఉన్నాయనీ; ఇక పరిశో ధనకు కావలసిన గ్రంథాలు, వసతులు ఏమాత్రం లేవనీ చెప్పారు. అటువంటి అలహాబాద్ యూనివర్సిటీలోనే 1968లో జీవరసాయన శాస్త్ర విభాగంలో ఎంఎస్సీ కోర్సును ప్రారంభించ గలిగారు. రాధా పంత్ బృందం హృదయ రోగాలు, పట్టుపురుగులు ఇలా అనేక విభిన్న అంశాల మీద విలువైన ఫలితాలు సాధించారని ‘ద బయో కెమిస్ట్’ జర్నల్‌లో కుసుమ్ పంత్ జోషి పేర్కొన్నారు. పట్టుపురుగులకు సంబంధించి రాధా పంత్ కృషి గురించి ఫ్రెంచ్ జర్నల్ ‘సెరికొలో జియా’ ఒక ప్రత్యేకమైన ప్రచురణని వెలవరించిందంటే ఆమె స్థాయి ఏమిటో గమనించవచ్చు. 2003 డిసెంబర్ 19న కన్నుమూసిన రాధ చిరస్మరణీయురాలు.
– డా. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి