ముంబై నడిబొడ్డున ఎన్నో కలలు కంటున్న ఒక చిన్నారి కలలు ఒక్కసారిగా ఊహించని మలుపు తీసు కున్నాయి. పుస్తకాలతో దోస్తీ చేయాల్సిన 12 ఏళ్ల వయసులోనే పెళ్లి. కట్ చేస్తే.. గృహ హింస, తీరని అణిచివేత అంతకుమించిన పేదరికం. జీవితం పీడకలగా మారిపోయింది. కానీ అక్కడినుంచే తననుంచి దూరంగా వెళ్లి పోయిన జీవితాన్ని వెదుక్కుంది. వెయ్యికోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా మారింది.
దళిత కుటుంబంలో జన్మించి, కడు పేదరికాన్ని అనుభవించి, ఒక్కో మెట్టు ఎక్కుతూ గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగిన కల్పనా సరోజ్ సక్సెస్ స్టోరీ.
1958లో మహారాష్ట్ర అకోలా జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది కల్పనా సరోజ్. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఏడో తరగతి పూర్తి కాగానే కల్పనా సరోజ్‌కు పెళ్లి జరిగిపోయింది. భర్తతో కలిసి థానేలోని ఉల్హాన్స్ నగర్ అనే మురికివాడలోని ఒక చిన్నగదిలో నివసించేది. కానీ పెళ్లి తరువాత అత్తింటి వేధింపులు భరించలేక, బయటపడటానికి మార్గం లేదని భావించి కల్పన ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ ఆమె తండ్రి ఆమెను రక్షించి,ఇంటికి తిరిగి తీసుకు వచ్చాడు. అలా16 సంవత్సరాల వయసులో, మనుగడ కోసం పోరాటం ప్రారంభమైంది. ముంబైలోని ఒక ప్రభుత్వ వస్త్ర మిల్లులో ఉద్యోగం మొదలు పెట్టింది జీతం నెలకు రూ. 2 మాత్రమే. కానీ అదే కల్పన భవిష్యత్తుకు తొలి అడుగు. సాధికారతకు స్వావలంబంనకు బీజం.
ఈ కష్టాలమధ్యే బట్టలు కుట్టడం నేర్చుకుంది. అలా కల్పన ఆదాయాన్ని రూ. నెలకు 50 రూపాయలు. ఆ అనుభవంతో ఆమె పెద్ద రిస్కే చేసింది. జ్యోతిబా ఫూలే స్కీమ్ కింద 1975లో రూ. 50 వేల రుణం తీసుకొని సొంతంగా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించింది. క్లాత్ బొటిక్ ప్రారంభించింది. అనుకోకుండా ఫర్నిచర్ రంగంలోకి అడుగుపెట్టింది . అక్కడితో ఆగిపోలేదు. బలమైన నెట్‌వర్క్‌తో రియల్ ఎస్టేట్‌లోకి విస్తరించింది. ఎలా అంటే..1995లో లిటిగేషన్‌లో ఉన్న స్థలం కొని మోసపోయింది. కానీ అప్పటి కలెక్టర్ సహకారంతో ఆ స్థలాన్ని డెవలప్‌మెంట్‌కి ఇచ్చిన కల్పనా సరోజ్,ఆ స్థలంతోనే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవ్వరూ ఊహించనంత ముందుకు దూసుకుపోయారు. నాలుగుకోట్ల టర్నోవర్ స్థాయికి ఎదిగింది.

KS ఫిల్మ్ ప్రొడక్షన్
ఆ తర్వాత తన సొంత సంస్థ KS ఫిల్మ్ ప్రొడక్షన్‌ను స్థాపించింది. మహారాష్ట్రలోని ఖైర్లాంజీలో ఒక దళిత కుటుంబం ఎదుర్కొన్న దారుణాల గురించి 'ఖైర్లాంజిచ్య మాత్యవర్' అనే వాణిజ్య చిత్రాన్ని నిర్మించింది. ఆధునిక కాలంలో కూడా దళితులను ఎలా చూస్తారనే దానిపై అవగాహన కల్పించడానికి, ఈ కథనాన్ని ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు తీసుకురావాలనది ఆమె అభిమతం. ఈ చిత్రాన్ని హిందీ, ఇంగ్లీష్ ,తెలుగు భాషలలో డబ్ చేశారు. నేరస్థులను ఆపకపోతే, అవగాహన పెంచకపోతే, సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని కల్పన నమ్ముతారు.
కమానీ ట్యూబ్స్‌కు ప్రాణం పోసింది
దృఢసంకల్పం, తెలివైన వ్యాపారవేత్తగా ఆమె ఖ్యాతి పెరిగింది. కమానీ ట్యూబ్స్ కంపెనీప్పుల్లో మునిగి, పతనం అంచున ఉంది. దాదాపు మూడేళ్లుగా దాని 3,500 మంది ఉద్యోగులకు చెల్లించలేకపోయింది. అలా వారు 2001లో, కల్పనను సలహా కోసం సంప్రదించారు. ఇదే ఆమె కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన చాలెంజ్ విసిరింది. దాన్ని బాధ్యతగా తీసుకుంది కల్పన. ఏకంగా కంపెనీని కొనుగోలు చేసి, వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించింది. కార్యకలాపాలను క్రమబద్ధీకరించింది. అచంచలమైన సంకల్పంతో ముందుకు నడిపించింది. అప్పులను తీర్చేసి,కార్మికులకు జీతాలు చెల్లించడమే కాదు, కంపెనీ లాభాల బాట పట్టింది. ఇపుడు కమానీ ట్యూబ్స్ రూ. 100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది.
ఏడో తరగతిలోనే పెళ్లి, కష్టాలు అనుభవించి, రూ. 2 సంపాదించిన బాల్య వధువు కల్పన సరోజ్, రూ. 1000 కోట్ల నికర విలువను కలిగి ఉంది. కమానీ ట్యూబ్స్ చైర్‌పర్సన్‌గా 2013లో పద్మశ్రీ అవార్డును అందుకుంది. IIM బెంగళూరులో గవర్నర్ల బోర్డు సభ్యురాలు కూడా. దీంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతోందామె.

కల్పన సరోజ్ జీవితం అద్భుతమైన విజయగాథ మాత్రమే కాదు. కృషి, పట్టుదల ఉంటూ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు అనడానికి ఇదొక బ్లూప్రింట్. కష్టాల కొలిమినుంచే అందమైన జీవితానికి బాటలు వేసుకున్న ధీర కల్పన సరోజ్ ఎంతోమందికి ప్రేరణ అనడంలో ఎలాంటి సందేహం లేదు.


