క్రికెట్టు... కనికట్టు
వ్యూహం.. బలం ఈ రెంటికి జెండర్ లేదని క్రీడలు నిరూపిస్తాయి! అందులో క్రికెట్ ఒకటి.. వ్యూహం.. బలం.. టీమ్ స్పిరిట్ ప్రతిఫలించే ఆట! మహిళా క్రికెట్‌లో వరల్డ్ కప్ కైవసం చేసుకుని ఈ మూడింటిలోనూ భేష్ అని నిరూపించుకుంది మన జాతీయ మహిళా జట్టు! ఈ టీమ్‌లో ప్రతి ఒక్కరిదీ ఒక్కో ప్రత్యేకత.
రాహుల్ ద్రవిడ్ బ్యాట్‌తో...
స్మృతి మంధాన అంటే తెలియనిదెవరికి? క్రికెట్‌తోనే కాకుండా తన ΄్యాషన్ అయిన మొబైల్ గేమింగ్  (బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా బీజీఎమ్‌ఐ)తోనూ ప్రసిద్ధి. కుకింగ్ అండ్ ట్రావెలింగ్ హాబీస్‌తో ఫేమస్. క్రికెట్ మ్యాచ్‌లు లేకపోతే మొబైల్ గేమింగ్.. కుకింగ్.. ట్రావెల్‌తో సేదతీరుతుందీ ఏ23 అంబాసిడర్. పంజాబీ వంటకాల్లో చేయితిరిగిన నైపుణ్యం ఆమెది. స్పైసీ పనీర్ టిక్కా మసాలా ఆమె సిగ్నేచర్ డిష్. దాన్ని ఆమె థెరపీ ఇన్ ఎ బౌల్‌గా అభివర్ణిస్తుంది. 
ఇష్టమైన ట్రావెల్ డెస్టినేషన్ స్విట్జర్లాండ్. క్రికెట్ విషయానికి వస్తే.. స్మృతి మంధానది సహజంగా కుడిచేతి వాటమే. కానీ వాళ్ల నాన్నకున్న లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ అబ్సెషన్ వల్ల ఆయన బలవంతంగా కూతురిని క్రికెట్‌లో ఎడమచేతి వాటం ప్లేయర్‌గా మార్చాడు. 
డొమెస్టిక్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా ఘనత వహించిన విషయం తెలిసిందే కదా! కానీ ఆ డబుల్ సెంచరీ చేసిన బ్యాట్ ఎవరిదో తెలుసా.. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌ది. అయితే ఆ బ్యాట్‌ను స్మృతి సోదరుడు శ్రవణ్‌కు (జూనియర్ క్రికెటర్‌గా ఉన్న రోజుల్లో) ద్రవిడ్ గిఫ్ట్‌గా ఇచ్చాడట. ముచ్చటపడి ఆ బ్యాట్‌తో తాను ఆడటం మొదలుపెట్టి అలా రికార్డ్ క్రియేట్ చేసింది స్మృతి మంధాన.
వంటాగింటా జాన్తా నై ..క్రికెట్టే జీవితం
హర్మన్ ప్రీత్ కౌర్.. మన మహిళా క్రికెట్ జట్టు సారథి. కూలెస్ట్ పర్సన్. ధైర్యసాహసాలు అని పర్‌ప్లెక్సిటీని అడిగితే ఆమెనే చూపిస్తుంది. పంజాబ్‌కు చెందిన 36 ఏళ్ల ఈ ప్లేయర్ క్రికెట్‌లో తన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడానికి సంప్రదాయ మూసధోరణులతో ఒక యుద్ధమే చేసింది. ఆటల్లో హర్మన్‌ప్రీత్‌కి స్ఫూర్తి ఆమె తండ్రి హర్మందర్ సింగ్ భుల్లర్. ఆయన బాస్కెట్‌బాల్, వాలీబాల్ ప్లేయర్. తనూ తండ్రిలాగే దేశం తరపున ఆడాలని చిన్నప్పుడే నిశ్చయించుకుంది.
క్రికెట్‌లో మహిళల జట్టు లేకపోతే మగవాళ్ల జట్టులో అయినా సరే ఆడి తన సత్తా చాటాలనుకుంది. స్థానిక మేల్ టీమ్‌తోనే ప్రాక్టీస్ మొదలుపెట్టింది కూడా. అలా కూతురు ప్యాంట్, షర్ట్ వేసుకుని.. అస్తమానం మగపిల్లలతోనే ఆడుతుండటం చూసిన హర్మన్‌ప్రీత్ తల్లి కంగారు పడింది. పిల్ల భవిష్యత్ ఏం గానూ అని కలవరం చెందింది.
‘నువ్విలా ప్యాంట్, షర్ట్‌లు వేసుకుని మగపిల్లలతో ఆటలాడ్డం ఏమీ బాగోలేదు. అందరు ఆడపిల్లల్లా చక్కగా సల్వార్ కమీజ్ వేసుకుని ఇంటిపట్టునే ఉండు. రోజూ వంటింట్లో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ వంట నేర్చుకో’ అని అల్టిమేటం కూడా జారీ చేసింది. కానీ మన ప్లేయర్ ‘వంటాగింటా జాన్తా నై.. క్రికెటే నా జీవితం.. నేను ఇలాగే ఉంటాను’ అని తేల్చేసింది. ‘నా ఆ జవాబుతో అమ్మ మళ్లీ మాట్లాడలేదు’ అంటుంది హర్మన్‌ప్రీత్ కౌర్.
ఆటకే కాదు పాటలకూ అంతే ఫాలోయింగ్.. 
మన మహిళా క్రికెట్ జట్టుకు జెమీమా రోడ్రిగ్స్ ఒక మెరుపు. తండ్రి గైడెన్స్‌తో ఏడేళ్ల వయసులోనే క్రికెట్ గ్రౌండ్‌లో అడుగుపెట్టింది. అయితే ఆమెకు స్ఫూర్తి మాత్రం సోదరులు ఎలి, ఎనోచ్‌లే! క్రికెట్‌లో ఆమె సూపర్‌స్టార్ అవుతుందని ప్రపంచానికి జోస్యం చెప్పింది ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్. అన్నట్టుగానే ఆమె సూపర్‌స్టార్ అయింది. క్రికెట్‌తోపాటు ఆమెకు పాటలు పాడటం.. రీల్స్ చేయడం ప్రాణం. ఆటలో ఆమె పట్ల ఎంత క్రేజ్ ఉందో.. ఆమె రీల్స్‌కి సోషల్ మీడియాలో అంతే ఫాలోయింగ్ ఉంది.
అమ్మ ఆనంద తాండవం
మన టీమ్ ఘన విజయం తరవాత పేసర్ రేణుక సింగ్ తల్లి సునీత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో స్థానికులతో కలిసి పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తున్న దృశ్యం నెటిజనులను ఆకట్టుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని పర్సా అనే మారుమూల గ్రామానికి చెందిన రేణుక చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. అప్పటి నుంచి తల్లే తండ్రిగా మారింది.రేణుక తండ్రికి క్రికెట్ అంటే మహా ఇష్టం. తన కూతురిని క్రికెటర్‌గా చూడాలనుకునేవాడు. తండ్రి కల నెరవేర్చడానికి రేణుక ఎంతో కష్టపడింది. ఆమె ప్రయాణంలో ప్రతి అడుగులో తల్లి అండగా నిలిచింది.
ఈ అమ్మాయి పేరు... ముంబై కీ డొనాల్డ్ ట్రంప్
ప్రపంచ కప్ ఘన విజయ సంబరాలు అం» రాన్ని అంటుతున్న నేపథ్యంలో ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ఎట్రాక్షన్‌గా మారింది. ప్రపంచ కప్ విజయం గురించి ఈ అమ్మాయి అద్భుతమైన ఇంగ్లీష్‌లో మాట్లాడిన తీరు, హావభావాలకు నెటిజనులు ఫిదా అయ్యారు. అంతేకాదు, ఈ అమ్మాయికి ‘ముంబై కీ డొనాల్డ్ ట్రంప్’ అని పేరు పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ లెవెల్లో ఇంగ్లీష్ మాట్లాడుతుందని ఆ పేరు పెట్టారు! ‘ఈ విజయం గురించి మాట్లాడడానికి నాకు మాటలు రావడం లేదు. ప్రతి ప్లేయర్ అద్భుతంగా ఆడారు. ఎంతో నిరీక్షణ తరువాత వరల్డ్ కప్ గెలుచుకున్నాం. సహనానికీ , అంకితభావానికి అద్దం పట్టే విజయం ఇది’ అని చెప్పింది ముంబై కి డోనాల్డ్ ట్రంప్.
విల్‌పవర్‌తో వీల్‌చైర్‌లో...
గాయం కారణంగా ఐకానిక్ మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్న ప్రతీక రావల్ నవీముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో వీల్‌చైర్‌లో విజయోత్సవంలో పాల్గొంది. టీమ్ సభ్యులు ఆమెను వీల్‌చైర్‌పై వేదికపైకి తీసుకువస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
‘నేను మైదానంలో పోరాడలేకపోయాను. కానీ నా మనసు ఎప్పుడూ ఆటతోనే ఉంది. ప్రతి ఉత్సాహం నాదే, కన్నీటి బొట్టు కూడా నాదే’ అని ‘ఎక్స్’లో ఫోటో షేర్ చేసింది, కామెంట్ రాసింది రావల్. ‘సీరియస్లీ స్వీట్ మూమెంట్’ అని ఒక నెటిజనుడు ఈ ఫొటో గురించి కామెంట్ రాశాడు.
→ ఐర్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 320 పరుగులు సాధించి.. ఇంటర్నేషనల్ వన్ డే మ్యాచ్‌లలో 300 పరుగుల భాగస్వామ్యం సాధించిన తొలి మహిళా జోడీగా దీప్తి శర్మ, పూనమ్ రౌత్‌లు రికార్డ్ నెలకొల్పారు.
→ మన దేశంలో తొలి మహిళా క్రికెట్ క్లబ్ పేరు ‘ది అల్‌బీస్’. దీన్ని ముంబైలో.. 1969లో అలూ బామ్జీ ఏర్పాటు చేశారు. ఇండియన్ క్రికెట్ క్లబ్ సభ్యురాలైన ఆమె.. క్రికెట్‌లో మహిళలూ ప్రొఫెషనల్‌గా ఆడాలని .. వాళ్లకూ అందులో కీలక స్థానం కల్పించాలని సాఫ్ట్‌బాల్ ప్లేయర్స్‌ను పరిచయం చేశారు. 
 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
